తోడుగా నీడ

25 Apr, 2018 00:04 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్‌ నుంచి ప్రొజెక్టర్‌ గుండా కర్టెన్‌ పై పడుతున్న ‘రక్షణ నీడ’ 

ఆత్మరక్షణ

అపార్ట్‌మెంట్‌లలో ఒంటరిగా ఉండే మహిళల రక్షణ కోసం జపాన్‌లోని ‘లియోప్యాలెస్‌21 కార్పొరేషన్‌’ అనే అపార్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ  కొత్తగా ఒక ఆత్మరక్షణ వ్యవస్థను అందుబాటులోకి తేబోతోంది. ‘మ్యాన్‌ ఆన్‌ ది కర్టెన్‌’ అనే ఆ వ్యవస్థ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ నుంచి గోడ కర్టెన్‌కు అనుసంధానం అయి ఉండే ఈ వ్యవస్థ.. ఫోన్‌ నుంచి కర్టెన్‌ మీదకు ఒక పురుషుడి నీడను ఫోకస్‌ చేస్తుంది. ఆ ఫోకస్‌తో అతడి నీడ కర్టెన్‌పై బాక్సింగ్‌ చేస్తుంటుంది. పంచ్‌లు ఇస్తుంటుంది. ఎవరైనా ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించడానికి జంకే విధంగా ఆ నీడ.. మనం ఇచ్చుకున్న ఆప్షన్‌ని బట్టి కరాటే, జూడో, కుంగ్‌ఫూలను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపిస్తుంది.

బయటి నుంచి వచ్చిన వారు ఆ నీడను చూసి, ఇంట్లో ఎవరో దృఢకాయుడైన పురుషుడు, ఫైటర్‌ ఉన్నాడని భ్రమించి వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయనీ, ఆ విధంగా ఒంటరి మహిళలకు రక్షణ లభిస్తుందని కార్పొరేషన్‌ మేనేజర్‌ కీచీ నకమురా అంటున్నారు. అయితే ఇలాంటి టెక్నాలజీ వచ్చిందన్న సంగతి నలుగురికీ తెలిసినప్పుడు ఆ వచ్చే ఆగంతకుడికి తెలియకుండా ఉంటుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. దీనికి  కీచీ చెబుతున్న సమాధానం ఏంటంటే.. ఏదైనా కీడు తలపెట్టేందుకు బయటి నుంచి వచ్చేవాడు రావచ్చు, రాకపోవచ్చు. ఒక షాడో తనకు తోడుగా ఉందన్న ధైర్యం.. ఆ ఒంటరి మహిళను ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ విధంగానైనా ఈ ‘మ్యాన్‌ ఆన్‌ ది కర్టెన్‌’ ఉపయోగపడుతుంది అంటున్నారు కీచీ.

మరిన్ని వార్తలు