కృత్రిమ గుండె కండరం సిద్ధమైంది...

30 Jan, 2020 00:13 IST|Sakshi

పరిపరిశోధన

జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారి పరిశోధనశాలలో అభివృద్ధి చేసిన కండరాన్ని గుండెకు అతికించడంలో విజయం సాధించారు. పాడైపోయిన గుండె స్థానంలో దాతల నుంచి సేకరించే గుండెను అమర్చడం ఇప్పటి వరకూ ఉన్న పద్ధతి. అయితే దాతల కొరత కారణంగా ఇప్పటికీ అవసరార్థులు చాలామందికి అవయవాలు దొరకడం లేదన్నది మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఒసాకా శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన కొత్త పద్ధతి కృత్రిమ అవయవాల డిమాండ్‌కు కొంత అడ్డుకట్ట వేసేదిగా అంచనా. సహజసిద్ధంగా నశించిపోయే పొరల్లోపల గుండె కండరకణాలను ఉంచి పెంచడం.. ఆ పొర మొత్తాన్ని పాడైపోయిన గుండెప్రాంతంలో ఉంచడం ఈ కొత్త పద్ధతిలోని ముఖ్యమైన అంశం.

రోగినుంచి సేకరించిన కణాలనే ఉపయోగించడం వల్ల శరీరం నిరాకరిస్తుందన్న ఆందోళన ఉండదు. రక్తం లేదా చర్మం నుంచి సేకరించిన మూలకణాలను గుండె కండర కణాలుగా మార్చి కండరాన్ని పెంచడం చెప్పుకోదగ్గ అంశం. జపాన్‌ శాస్త్రవేత్తలు ఐష్చెమిక్‌ కార్డియో మయోపతి అనే సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి ఈ కొత్త కండరాన్ని ఎక్కించారు. ఈ కణాలు విడుదల చేసే ప్రొటీన్‌తో ఆ ప్రాంతంలో కొత్త రక్త నాళాలు పుట్టుకొస్తాయని, తద్వారా అతడి గుండె మరింత సమర్థంగా పనిచేయడం మొదలుపెడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు