ముందు రప్పించింది... తర్వాత మెప్పించింది!

8 Oct, 2013 00:00 IST|Sakshi
ముందు రప్పించింది... తర్వాత మెప్పించింది!

పర్యాటకులను ఆకర్షించడానికి ఫార్ములా వన్ రేసులే అవసరం లేదు... ఎద్దుల బండి పోటీలు చాలు.. కోట్లు ఖర్చుపెట్టి ఫార్ములా రేసులకు అనుగుణంగా ట్రాక్ నిర్మాణాలు, వాటికి అనుమతులు అవసరం లేదు... తట్టి లేపితే మన పల్లెటూళ్లే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వినోదాన్ని అందిస్తాయి... విహార యాత్రికులను ఆకట్టుకొంటాయి. ఈ దిశగానే ప్రయత్నించింది జార్ఖండ్ పర్యాటక శాఖ. ఒకవైపు ’ఫార్ములా వన్ సర్క్యూట్’లను ఏర్పాటు చేస్తూ.. కార్ల రేసుల ద్వారా అభివృద్ధి సాధించుకొన్నామని నిరూపించుకోవడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎద్దుల బండి పోటీలు నిర్వహించి, వాటికి జాతీయ స్థాయిలో ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే అది విశేషమైన అంశం. అభినందించాల్సిన విషయం. జార్ఖండ్‌లోని సింగ్బమ్ జిల్లా ఘట్‌సిలాలో ఇటీవలే ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు.
 
 ఇప్పటికీ ఎద్దుల బండి పోటీలు గ్రామీణ భారతంలో చాలా సాధారణమైన విషయాలే. అయితే ఈ పోటీల విషయంలో మాత్రం జార్ఖండ్ పర్యాటక శాఖ చొరవ చూపి... భారీఎత్తున నిర్వహణ ఏర్పాట్లు చేసింది. బాగా ప్రచారం చేసి వేలాదిమంది వీక్షకులను ఈ గ్రామానికి రప్పించగలిగింది. ఇక్కడ చుట్టుపక్కన ఉన్న 150 ఊళ్లు పర్యాటకులకు హాట్‌స్పాట్ లాంటివి. ప్రకృతి సహజంగా ఏర్పడిన అందాలు, స్థానిక ప్రత్యేకతను చాటే కళలు.. పర్యాటకులను ఆకట్టుకొంటాయి. ఎద్దుల బండి పోటీలను చూడటానికి వచ్చిన పర్యాటకులను ఆ గ్రామాలను చూపించి కట్టి పడేసేందుకు జార్ఖండ్ పర్యాటక శాఖ వ్యూహాన్ని రచించింది. అది విజయవంతం కావడంతో భారతదేశ గ్రామీణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇకపై ఇలాంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి మన పల్లెటూళ్లలోనూ ఇలాంటి ప్రత్యేకతలున్నాయి.. మనకూ ప్రభుత్వాలున్నాయి.. మరి వారికి ఇంత ఓపిక ఉందా?
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు