ఒక్క జీవితం.. మూడు సినిమాలు

25 Feb, 2019 01:17 IST|Sakshi

తలైవి

బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న టైమ్‌లో తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బయోపిక్స్‌లో జయలలిత బయోపిక్‌ ఒకటి. ఒకటీ, రెండు కాదు మూడు యాక్చువల్లీ. జయ జీవితం ఆధారంగా ముగ్గురు దర్శకులు (ఏఎల్‌ విజయ్, ప్రియదర్శని, భారతీరాజా) బయోపిక్స్‌ అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జయలలిత జయంతి. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని ఆనవాయితీ ప్రకారం ఆయా సినిమాల టైటిల్స్‌ను, రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ రూపొందిస్తున్న చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కించనున్నారు.

జయలలిత పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విద్యా బాలన్, నయనతార.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథకు స్క్రిప్ట్‌ సూపర్‌వైజ్‌ చేయనున్నారు. విబ్రీ మీడియా విష్ణు నిర్మాత. ‘ఎన్టీఆర్, ‘83’ (1983 వరల్డ్‌ కప్‌) బయోపిక్‌లు నిర్మాత ఈయనే. సుమారు తొమ్మిది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్‌ పనులు చేశాం, కథకు కావల్సిన సమాచారాన్ని సేకరించాం అని ‘తలైవి’ చిత్రబృందం తెలిపింది. దర్శకురాలు ప్రియదర్శని సినిమా విషయానికి వస్తే.. ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌తో జయలలితగా నిత్యా మీనన్‌ నటిస్తారని ఎప్పుడో అనౌన్స్‌ చేశారు. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న చిత్ర రిలీజ్‌ను చేస్తున్నాం అని ప్రకటించారు. భారతిరాజా అనౌన్స్‌ చేసిన సినిమా, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఓ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ప్రస్తుతానికి రాలేదు. ఇన్ని సినిమాలు, సిరీస్‌లు ఒకే వ్యక్తి జీవితంపై తెర మీదకు రావడం విశేషం.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా