కాటి ఊపిరి

9 Nov, 2018 00:44 IST|Sakshi

జీవనం 

ఊపిరి ఆగాక చివరగా చేరే చోటు అది. కాని ఆ చోటే ఆమెకు ఊపిరి పోస్తోంది. చీకటి, చితి భయపెట్టే స్థలం అది. కాని అక్కడే ఆమె తన బతుక్కి వెలుగు వెతుక్కుంటోంది. తల కొరివి పెట్టే హక్కు, కాటి కాపరిగా ఉండే అధికారంమగవాడికే సొంతం అని లోకరీతి.జన్మనిచ్చే సమయంలో స్త్రీ చేతులు ఉన్నప్పుడు సాగనంపే సమయంలో స్త్రీ చేతులు  ఎందుకు ఉండరాదు అని ప్రశ్నిస్తోంది జయలక్ష్మి.

గుండె దమ్ము అనే మాట మగవాళ్ల విషయంలోనే వింటూ ఉంటాం. స్త్రీకి గుండె ఉండదనీ అందులో దమ్ము ఉండదని లోక ప్రచారం. ధైర్యంగా చేయాల్సిన పనులు, భయం పుట్టించే క్రతువుల్లో స్త్రీని భాగస్వామ్యం చేయలేదు మన సంస్కృతి. ముఖ్యంగా చావులో, అంత్యక్రియల్లో పురుషులే విధులు నిర్వర్తించాలని స్థిరపరిచి ఉన్నారు. కాటికాపరిగా అనాదిగా మగవాళ్లే ఉంటూ వస్తున్నారు. స్మశానంలో ఉంటూ శవాలతో సహవాసం చేయడం మగవాడికే చేతనైన పని అని నిరూపిస్తూ వస్తున్నారు. కాని జయలక్ష్మి ఈ ఆనవాయితీకి సవాలుగా నిలిచింది. ఈ పని తానూ చేయగలనని నిరూపించింది. అనకాపల్లి గవరపాలెం శ్మశానంలో పదహారేళ్లుగా కాటికాపరిగా ఉన్న తట్టా జయలక్ష్మి (45) జీవిత గాథ ఆమె మాటల్లోనే.‘‘చనిపోయినవాళ్లు దేవుడి దగ్గరకు వెళతారని పెద్దలు అంటారు. దేవుడితో ముడిపడిన ఈ పని ఎంతో పుణ్యమైన పని అని నేననుకుంటాను. చనిపోయినవారు సక్రమంగా దేవుని దగ్గరకు చేరుకోవడానికి కాటికాపరులు సాయం చేస్తారు. జీవుడు ఈ కట్టె మీద మమకారం పూర్తిగా వదులుకునేందుకు శరీరాన్ని దహనం చేసే పని మాది. ఆ పని అందరూ చేయలేరు. రాసి పెట్టిన వారికే ఆ పుణ్యం దక్కుంది’’ అందామె.

భయం నుంచి బయటపడి...
‘‘మాది ఈ ఊరే. మా అమ్మా నాన్న చేతనైన పని చేసి మమ్మల్ని సాకేవారు. మా ఇళ్లల్లో కాటికాపరి పని ఉంది. ఊరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని శారదా నది ఒడ్డు  శ్మశానంలో మా పెద మావయ్య తట్టా కొండయ్య కాటికాపరిగా పని చేసేవాడు. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు కాటి కాపరిగా ఉన్న ఆయనకు చద్ది అన్నం పట్టుకెళ్లేదాన్ని.  అంతి చిన్న వయసులో శ్మశానమంటే ఎవరికైనా భయమే. నాక్కూడా చాలా భయం వేసేది.  ఒకరోజున మామయ్య నాకు చిన్న పని అప్పగించాడు.  దూరంగా ఉన్న నూతి గట్టు దగ్గరి నుంచి బకెట్‌ తీసుకురమ్మన్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం. మంచి ఎండ ఉంది. శ్మశానంలో మా మావయ్య, నేను తప్ప ఎవరం లేము. మావయ్య చెప్పాడని గుండె చేతబట్టుకుని బిక్కుబిక్కుమంటూ  నూతి దగ్గరకు వెళ్లాను. వెనుక నుంచి ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది.కాళ్లు ఒణికాయి. అంతే భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి జరిగినదంతా అమ్మతో చెప్పి కళ్లు తిరిగి పడిపోయాను. దాంతో మా ఇంట్లో నా చేత చద్ది పంపే పని మానుకున్నారు. కాని దేవుడి లీల చూడండి. ఎక్కడైతే నేను భయపడ్డాను అక్కడే బతికే ధైర్యం ఇచ్చాడు’’ అందామె.

పెళ్లి తర్వాత బాధ్యత
‘‘నాకు పద్నాలుగేళ్లు వచ్చాక నూకేశ్వరరావుతో వివాహం జరిగింది. అప్పటికి గవరపాలెం స్మశానవాటికి కాటికాపరి పని మా బావగారు చేస్తూ ఉన్నారు. కాని ఆయన ఆ పని మానుకుని బేల్దారు మేస్త్రిగా పని వెతుక్కున్నాడు. తరాలుగా వస్తున్న పని కదా ఎందుకు వదులుకోవాలి అని నా భర్త ఆ పని తీసుకున్నాడు. అప్పటికి నాకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. జీవితం బాగానే ఉందనిపించేది. కాని సరిగ్గా 16 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా నా భర్త  చనిపోయాడు. నన్ను నా పిల్లలను గతి లేని వాళ్లను చేసి వెళ్లిపోయాడు. మేము ఎలా బతకాలి. బతుకు వల్లకాడు చేసుకోవడం కన్నా వల్లకాడునే బతుగ్గా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నలుగురు పిల్లల్ని సాకుతూ శ్మశానంలో కళేబరాల సేవ చేయడం సాధ్యమేనా ఒక ఆడది ఈ పని చేయగలదా అని బంధువులు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్లు తర్జన భర్జనలైతే పడగలరుకాని అన్నం పెట్టలేరు కదా. అందుకే ధైర్యంగా కాటికాపరి పని తీసుకున్నాను’’ అందామె. 

శివయ్యకు మొక్కి
‘‘రోజూ ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శ్మశానంలోనే ఉంటాను. ఉదయం శ్మశానం తలుపులు తీయగానే శివునికి మొక్కుతాను. ఆ తరవాత పరిసరాలను శుభ్రం చేస్తాను.  పిచ్చిమొక్కలను తొలగిస్తాను. ఎవరయినా చనిపోతే శవాన్ని కాల్చడానికి కర్రలు పేరుస్తాను. తల కొరివి పెట్టి అయినవాళ్లు తప్పుకున్నాక శవం చివరి వరకూ కాలేదాకా జాగ్రత్త తీసుకుంటాను.  శవాన్ని కాల్చేటప్పుడు ఒక్కోసారి చమురు ఎగిరి ఒంటి మీద పడుతుంది. అయినా బెదరకుండా ధైర్యంగా పని పూర్తి చేస్తాను. ఒక్కోసారి కాలుతున్న శవం అమాంతం  ఎగిరిపడుతుంది. ఏ మాత్రం జంకు లేకుండా కర్రతో అదుముతూ శవ దహనం పూర్తి చేస్తాను. అర్ధరాత్రి వేళ ఒంటరిగా అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వెళుతుంటే అందరూ ఒక రకమైన ఉద్వేగంతో చూస్తుంటారు. నేను పట్టించుకునేదాన్ని కాదు. తొలి రోజుల్లో మా అమ్మ చాలా భయపడిపోయేది. నేను ఇంటికి రావడం ఆలస్యమైతే వణికిపోయేది. కాని నా ధైర్యం చూసి మానుకుంది. నన్ను చూసి కొందరు ఆడవాళ్లు గర్వపడుతుంటారు. కొందరు బెరుకుపడతారు. అందరి పనిలాగా నాదీ ఒక పనే అని అర్థం చేసుకుంటే ఇదంతా ఏమీ ఉండదు’’

అందరూ చేరాల్సింది అక్కడికే
‘‘మనం ఎక్కడ పుట్టినా చివరికి  చావు తప్పదు. తల్లి ఒడిలో పుట్టిన మనం శివయ్య తండ్రి ఒడిలోకి చేరాల్సిందే. ఈ పదహారేళ్లుగా రోజుకి కనీసం ఒక్క శవాన్నయినా చూస్తున్నాను. అర్ధాయుష్కుతో ఎవరైనా పోయినప్పుడు మాత్రం చాలా బాధ పడుతుంటాను. ఆ రోజంతా అన్నం తినలేకపోతాను. చిన్నప్పుడు కథలు వినేటప్పుడు అందరిలాగే నాకు కూడా శ్మశానం అంటే భయమేసింది. ఇప్పుడు శ్మశానమే ఆవాసంగా మారింది. ఈ పనిలో ఒక వేదాంతం అలవడుతుంది. అత్యాశ చచ్చిపోతుంది. అందరూ పోయేవాళ్లమే అయినప్పుడు మంచి చేసి పోవడమే మేలనిపిస్తుంది. ఇప్పుడు నా పెద్దకొడుకు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను. నెల జీతం నాకు సంతృప్తికరంగానే ఉంది. ఈ పనిలో నేను చేయదగ్గ సేవ చేస్తున్నాను. నా పిల్లలు ఇతర వృత్తుల్లోకి ఇంకా మంచి పనుల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని ముగించారామె.

బతుకు వల్లకాడు చేసుకోవడం కన్నా వల్లకాడునే బతుగ్గా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నలుగురు పిల్లల్ని సాకుతూ శ్మశానంలో కళేబరాల సేవ చేయడం సాధ్యమేనా ఒక ఆడది ఈ పని చేయగలదా అని బంధువులు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్లు తర్జన భర్జనలైతే పడగలరుకాని అన్నం పెట్టలేరు కదా. అందుకే ధైర్యంగా కాటికాపరి పని తీసుకున్నాను.
 సంభాషణ:  దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి

మరిన్ని వార్తలు