శివమ్‌ ప్రకాశమ్‌!

19 Jul, 2017 12:24 IST|Sakshi

నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు... మరి సినిమా స్టార్స్‌?!..
ఆ.. వీళ్లకు పక్క నుంచి ఓ లైట్, పై నుంచి ఓ లైట్, ఫ్రంట్‌ నుంచి ఓ లైట్‌ వేస్తే కానీ మెరవరు...
అయితే, స్వయం ప్రకాశాన్ని కట్‌ చేస్తే... శివం ప్రకాశమ్‌ ఎందుకొచ్చిందో..
‘సంతోషం సంబరమైతే.. ఆనందమే తాండవిస్తే... శివుడు ప్రకాశం అంటున్నారు’ జయప్రకాశ్‌రెడ్డి
అందరూ కష్టాల్లో దేవుణ్ణి తలుచుకుంటే... తను సంతోషంలో దేవుణ్ణి దర్శిస్తుంటారు.

‘‘జయ ప్రకాశం జయ ప్రకాశం
నా బతుకే శివప్రకాశం..
సాక్ష్యం భూమి, ఆకాశం..
సదాశివునిపై భక్త్యావేశం... ’’
సినిమాల్లో విలన్‌గా మనకు తెలిసిన జయప్రకాశ్‌రెడ్డి శివగానం చేస్తుంటే ఆశ్చర్యంతో చూస్తుండిపోయాం. హైదరాబాద్‌ మోతీనగర్‌లోని జయప్రకాశ్‌రెడ్డిని కలిసి, మీ ఇష్ట దైవం గురించి చెప్పమని అడిగినప్పుడు పాటతో ఇలా పరవశించిపోయారాయన.ఇంత అద్భుతంగా పాడుతున్నారు. సదాశివుడు మీ దైవం ఎప్పుడయ్యాడు?
తాతల నాటి నుంచి మా కుల దైవం శివయ్యే! ఇప్పటికీ ఇంట్లో రోజూ ఉదయం దీపారాధన చేస్తుంటాను. అలాగని మిగతా దేవుళ్లను తక్కువ చేయను. సోమవారం శివయ్య, మంగళవారం ఆంజనేయస్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయి బాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర్లు, ఆది– సోమ మళ్ళీ శివయ్య.. ఏది జరిగినా ‘ఈశ్వరా’ అనుకోవడమే శ్వాస.

కష్టంలోనూ శివయ్యనే తల్చుకుని గట్టెక్కారా?
ముప్పై ఏళ్ళ కిందటి వరకు అష్టకష్టాలే. బి.ఎస్సీ బీఈడీ చదువుకున్న నేను మ్యాథ్స్‌ టీచర్‌గా ఉద్యోగం చేస్తుండేవాడిని. నాటకాలు నా ప్రాణం. ఒకసారి దాసరి నారాయణరావు గారు నా నాటకం చూసి ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో టీచర్‌ ఉద్యోగానికి సెలవు పెట్టి మద్రాసుకు వెళ్లాను. ఆ తర్వాత చిన్నా చితక వేషాలు ఉన్నా రాబడి ఏమీ లేదు. నాకు ఓ కొడుకు, కూతురు. వాళ్లు స్కూల్‌ నుంచి కాలేజీ చదువులకు వస్తున్నారు. ఫీజులు, కుటుంబ ఖర్చులు పెరగుతున్నాయి.  బాగా అప్పులయ్యాయి. కుటుంబం ఎలా గడుస్తుందని భయం. ‘ఎలారా దేవుడా’ అనుకున్నప్పుడు ఉద్యోగమే మేలని ఊరొచ్చేశాను. ప్రైవేట్లు చెప్పుకుంటూ, ఉద్యోగం చేస్తూ ఐదేళ్లు సినిమా రంగం గురించి పూర్తిగా మర్చిపోయాను.

ఆ టైమ్‌లో శ్రీశైలంలో జరిగే శివదీక్ష గురించి తెలిసింది. నాకూ ఆ దీక్ష తీసుకోవాలనిపించింది. నలభై ఒక్కరోజుల పాటు శివదీక్ష తీసుకున్నాను. ఈ దీక్ష తీసుకున్నవారు సరిగ్గా మహాశివరాత్రి నాటికి జ్యోతిర్ముడితో శ్రీశైలం వెళ్లాలి. లింగోద్భవ కాలంలో దేవాలయానికి తలపాగా చుడతారు. అది తప్పక చూసి రావాలి. అలా ప్రతి ఏటా 18 ఏళ్ల పాటు శివదీక్ష చేశాను. ఇదీ అని చెప్పలేను గానీ అప్పటి నుంచి నా దశ కూడా మారుతూ వచ్చింది. అనుకోకుండా రామానాయుడిగారి కంటపడటం ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత శ్రీరాములయ్య, ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి’... అలా అలా బతుకు చిత్రమే మారిపోయింది. ఈ మూడేళ్లుగా దీక్ష తీసుకోవడం లేదు. శివయ్యకు చెప్పేశాను. ‘లక్షలాది జనం మధ్య జ్యోతిర్ముడితో రావడం కుదరడం లేదయ్యా! కరుణించు’ అని వేడుకున్నాను. అంతా ఆయనిచ్చిన అదృష్టం.

ఆ అదృష్టమే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందా?
దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అదృష్టానికి మన కష్టం తోడవ్వాలి. ‘ప్రేమంటే ఇదేరా!’ సమయంలో రాయలసీమ మాండలికంలో డైలాగులు కావాలన్నారు. నంద్యాలలో పెరిగినందుకు ఆ భాష కలిసొచ్చింది. అయినప్పటికీ మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లి టేపురికార్డర్‌ పట్టుకొని, అక్కడి షాపుల వాళ్లతో మాట్లాడి ఆ మాటలన్నీ రాత్రిపూట వింటూ, యాస కోసం బాగా సాధన చేసేవాడిని. ముందురోజే స్క్రిప్టు కావాలని రైటర్లను అడిగేవాడిని. వాళ్లెంత బిజీగా ఉన్నప్పటికీ నా అభ్యర్ధనను మన్నించారు. ముందుగానే స్ట్రిప్టు ఇచ్చేవారు. దానిని నేను నాదైన బాసలోకి మార్చుకుని సాధన చేసేవాడిని. ఆ కష్టం ఊరికేపోలేదు. ‘సమరసంహారెడ్డి’ సినిమాతో బాగా పేరొచ్చింది. యేటా ఏదో ఒక మంచి వస్తూనే ఉండేది. అప్పులు తీర్చుకుంటూ వచ్చాను. నన్ను నిమ్మి ఆ సమయంలో జనాలు కూడా సాయం చేసేవారు.

మనుషుల్లో దైవత్వాన్ని ఎప్పుడు చూశారు?
ఎక్కడో కాదు. ఇంట్లోనే. మా నాయిన సాంబిరెడ్డిలో చూశాను. ఆయన నాకు సాక్షాత్తు శివయ్యే! మా నాయిన పోలీసు ఆఫీసర్‌. విపరీతమైన నిజాయితీపరుడు. ఆయన కొలీగ్స్‌ అంతా సంపాదించుకుంటే ఈయన మాత్రం తాతల ఆస్తిని అమ్మేసుకున్నాడు కుటుంబ పోషణకు. వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. జనం ఆయన్ని ఓ దేవుడిలా చూసేవారు. పెద్ద పెద్ద వాళ్లు ఎంతో గౌరవంగా చూసేవారు. అలా బతకాలి అనిపించేది.

మా నాన్న నాకు చెప్పింది నేర్పింది ఒక్కటే ఆత్మసంతృప్తి. ‘ఒరేయ్, ఈ లోకంలో తిండి లేక, సరైన బట్ట లేక ఎంత మంది యాతన పడుతున్నారో చూడు. నీకు తినడానికి మూడు పూటలా తిండి ఉంది. బట్ట కట్టుకుంటున్నావ్‌. ఇది దేవుడు నీకు ఇచ్చిన అదృష్టం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు. పచ్చడి అయినా ఒకటే, పరమాన్నం అయినా ఒకటే అని భావించు’ అన్నాడు. ఆ స్ఫూర్తే ఆయన నాకు ఇచ్చిన ఆస్తి. అంతేకాదు, ఆయన చూపిన తోవే నన్ను ఈ రోజు ఎంతోమందికి తెలిసేలా చేసింది. మా నాన్నకు నాటకాలంటే విపరీతమైన ఇష్టం. పోలీసాఫీసర్‌గా నాటకాలు వేయడం ఆయనకు కుదిరేది కాదు. ఎప్పుడైనా నేను ఖాళీగా కనపడితే చాలు ‘నాటకం వేయకుండా ఏం చేస్తున్నావ్‌రా!’ అని తిట్టేవాడు. ఆయనకున్న నాటకాల పిచ్చి, అభిమానం నాకూ బాగా వంటబట్టాయి.  

ఎప్పుడూ దైవం మీద కోపం రాలేదా?
కష్టం వస్తే ‘ఈశ్వరా’ అనుకున్న రోజులున్నాయి గానీ, కోపమా?! ఎంతమాట. మొదటిసారి శ్రీశైలంలో స్వామిని కలిసినప్పుడే ఒక ధైర్యం కలిగింది. ఏదొచ్చినా శివయ్య ఉన్నాడుగా ఆయనే చూసుకుంటాడు అనిపించేది. ఆ స్వామి దగ్గర నేను పూర్తిగా సరెండర్‌ అయిపోయాను. కాకపోతే ‘ఇదియ్యి, అదియ్యి’ అని ఎప్పుడూ మూర్ఖంగా కోరుకోలేదు. ఫలానా పని అవలేదు అని ఎప్పుడూ తిట్టుకోలేదు. ఏ ప్రాంతానికి వెళ్లినా నన్ను ఫలానా అని గుర్తుపట్టేస్తారు. అంతకుమించి ఏం కావాలండీ!

ఆలయాలకు ఎప్పుడెప్పుడు వెళుతుంటారు?
ఆలయం విషయం వస్తే.. ముందు నలభై ఏళ్ల కిందటి సంఘటన ఒకటి చెప్పాలి. మా అమ్మమ్మ ఊరు వెళ్లాను. ఇంటికి కావల్సినవి ఏవో కొనుక్కురమ్మన్ని మార్కెట్‌కి పంపించారు. మార్కెట్‌కి బస్‌స్టాప్‌ మీదుగ వెళ్లాను. అక్కడ శ్రీశైలం బోర్డున్న బస్సు కనిపించింది. అప్పటి వరకు శ్రీశైలం గురించి విని ఉన్నాను. కానీ, ఎప్పుడూ వెళ్లింది లేదు. ఎవరో మంత్రం వేసినట్టు వెళ్లి ఆ బస్సులో కూర్చున్నాను. శ్రీశైలం చేరుకున్నాను. అక్కడ స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ.. నా తలను శివ లింగానికి తాకించారు. అంతే, ఒక్క క్షణం.. ఓ తెలియని విద్యుత్తు ఏదో ఆ లింగం నుంచి నా నుదుటి ద్వారా ఒళ్లంతా పాకినట్టు అనిపించింది. దానిని ఇన్నేళ్లు అయినా మర్చిపోలేను. ఒక అలౌకికమైన ఆనందం. ఆ రాత్రి అక్కడి సత్రంలోనే బస చేసి, ఉదయాన్నే మళ్ళీ దర్శనం చేసుకొని ఊరొచ్చాను. అప్పుడు ఫలానా చోట ఉన్నానని చెప్పడానికి ఫోను సదుపాయం లేదు. మా ఇంట్లో వారంతా ఏడుపులు.. పిల్లాడు ఎక్కడికి పోయాడో అని. ఇప్పుడైతే.. సంతోషంగా ఉన్నప్పుడు. దేవుడికి కృతజ్ఞత చెప్పాలనిపించినప్పుడల్లా తప్పక వెళతాను. శ్రీశైలమే కాదు తిరుపతికి, శిరిడీకి కూడా వెళుతుంటాను.

మీలో దైవత్వాన్ని చూసినవారి గురించి...
మా నాన్న చేసినంత సాయం నేను చేయలేదు. నా పరిధిలో ఉన్నంతవరకు మా జూనియర్‌ ఆర్టిస్టుల పిల్లలకు చదువులు చెప్పించాను. చెప్పిస్తుంటాను. వాళ్ల చేతికి డబ్బు ఇవ్వను. కాలేజీ, స్కూళ్లకు వెళ్లి ఫీజులు కట్టివస్తుంటాను. 40 సంవత్సరాల క్రితం నాతో పనిచేసిన టీచర్లు ‘నువ్వేం మారలేదయ్యా’ అంటుంటారు. అదే నాకు ఆనందం.

విశ్రాంతి జీవితంలో దైవం ఆలంబన?
నా వయసు 71. ఈ రోజుకీ బీపీ కూడా లేదు. ఉపాధ్యాయుడిగానూ, నటుడిగానూ రాణించగలిగాను. ప్రతి నెలా నాటక పరిషత్‌ ద్వారా నాటకాలు వేయిస్తుంటాను. నాకు ఎంతో ఇష్టమైన ‘అలెగ్జాండర్‌’ నాటకాన్ని ఇప్పటికీ వేస్తుంటాను. పిల్లల జీవితాలు బాగున్నాయి. నన్ను అర్థం చేసుకునే అర్ధాంగి ఉంది. దేవుడి దయ వల్ల పెన్షన్‌ వస్తుంది. ఇది లేదు అనే దిగుల్లేదు. ఇప్పటికీ ఏమీ లేకపోయినా శ్రీశైలం వెళితే.. అక్కడి సత్రంలో ఓ గది ఇస్తారు. నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే చాలు భోజనం పెడతారు. పొద్దునే ఓం నమఃశివాయ అని వినిపిస్తూ ఉంటుంది. ఇంక ఏం కావాలి? మనం సంతోషంగా ఉండాలనే దైవం కోరుకుంటుంది. అందుకే వర్రీస్‌ గురించి వర్రీ అవ్వద్దు.

శివయ్య గురించి అంత బాగా గానం చేశారు. ఎలా వచ్చింది ఆ పాట..?
శివయ్య మీద ఉన్న భక్తి భావాలను పేపర్‌ మీద పెట్టడానికి చాలా ప్రయత్నించాను. కానీ, అద్భుతంగా కీర్తిస్తూ రాయలేను. నా జీవితాన్ని నడుపుతున్నది శివయ్యే! ఆయన మీద నోరారా పాటలు పాడుకోవాలి ఎలా అని పరితపించాను. రచయిత జొన్నవిత్తులను అడిగాను. మహానుభావుడు పైసా అడగలేదు, ఆరుపాటలు రాసిపెట్టాడు. వీణాపాణి బాణీలు కట్టారు. ఆ పాటలు పాడి ‘శివ ప్రకాశం’ పేరుతో ఆల్బమ్‌ చేయించాను. నాకు పాటలు రాయడం, సంగీతం, గానం రావు. కానీ, భావం– భక్తి ప్రధానం అని నమ్మి పాడాను.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి

మరిన్ని వార్తలు