పెదరాయుళ్లు

7 Aug, 2016 00:28 IST|Sakshi
పెదరాయుళ్లు

మన సమస్య మనకు ఎప్పుడూ పెద్దగా అనిపిస్తుంది..
ఇతరుల సమస్య అర్థం చేసుకున్నప్పుడు
మన సమస్య చిన్నగా అవుతుంది..
పెద్ద గీత ముందు చిన్న గీత లాగా!
పెద్ద పెద్ద కష్టాలను చిన్నబోయేలా చేస్తున్నారు
ప్రయోజనాత్మకమైన సృజనాత్మక
టెలివిజన్ షోస్ హోస్ట్ చేస్తున్నారు!
సుమలత, జీవితలు ఇతరుల సమస్యలు,
కష్టాలను అర్థం చేసుకుని తమ కష్టాలుగా భావించి
‘జీవిత’ ‘సుమాలు’గా మారారు.

పెద్ద తెర నుంచి చిన్ని తెరకు ఎలా అడ్జస్ట్ కాగలిగారు?
జీవిత: పెద్ద తెరకు ఇవాళ చిన్ని తెర ఏమాత్రం తక్కువ కాదు. గేమ్ షోస్, పర్పస్‌ఫుల్ షోస్ పెరుగుతున్నాయ్. చేసేది ప్రయోజనాత్మక కార్యక్రమం కాబట్టి చిన్ని తెర కోసం ప్రత్యేకంగా అడ్జస్ట్ కావల్సిన అవసరం ఏర్పడలేదు. నటిగా నేను సినిమాలు చేసింది ఎక్కువగా రాజశేఖర్ గారితోనే. ఆ తర్వాత దర్శకురాలిగా-నిర్మాతగా చేశాను. ఇప్పుడు బుల్లితెర ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుంది.

సుమలత: ప్యాషన్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం రాలేదు. సినిమా, టీవీ దేని ప్రభావం దానిదే. టీవీకే రీచ్ ఎక్కువ. సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు థియేటర్‌కి రావాలి. కానీ, టీవీతో మనం ప్రేక్షకుల ఇంట్లోకి వెళ్తాం. అందుకే  ఒక కుటుంబ సభ్యుల్లా మన ల్ని చూస్తారు కాబట్టి హ్యాపీగా ఉంది.

టీవీ వాళ్లంటే సినిమా స్టార్స్‌కి చిన్న చూపు ఉంటుందేమో...
సుమలత: ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. పెద్ద పెద్ద స్టార్స్ టీవీలోకి వచ్చేశారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ స్మాల్ స్క్రీన్ స్వరూపాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన ముందు మాలాంటి వాళ్లెంత.

 ఈ ప్రోగ్రామ్ గురించి మీ భర్త అంబరీష్‌గారు ఏమంటారు?
నిన్ను ఇంట్లో మహారాణిలా చూసుకుంటే నువ్వెందుకు అందరి సమస్యలు వింటూ ఇబ్బంది పడతావు అంటారు. కానీ సామాన్య జనాలతో కలవడం, వాళ్ల ప్రాబ్లమ్ వినడం, పరిష్కారాలు చెప్పడం నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలతో తప్ప వాళ్లను కలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఆ మాటే అంబరీష్‌గారితో అన్నాను. దాంతో కన్విన్స్ అయ్యారు. ‘బాగా చేస్తున్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. మన చుట్టూ ఉన్న సమాజంలో జీవితాలు ఇలా కూడా ఉన్నాయా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇంత కష్టాలు పడి మనుషులు బతుకుతున్నారా అనిపిస్తుంటుంది. వాళ్ల పెదాలపై చిన్న చిరునవ్వు కలిగిస్తే చాలనిపిస్తుంది.

జీవిత: ఒకప్పుడు బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా ఉండేది. ఇప్పుడలాంటిది లేదు. స్మాల్ స్క్రీన్‌కి బిగ్ స్టార్స్ వస్తున్నారు. దానివల్ల చిన్ని తెరకు క్రేజ్ పెరిగింది. చిన్న చూపు కూడా పోయింది.

ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ ఉండగా సమస్యలను పరిష్కరించే షోని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
జీవిత:ఈ కార్యక్రమానికి సోషల్ కాజ్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. జీ తెలుగువాళ్లు ‘బతుకు జట్కా బండి’ రెండోసారి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ షో దర్శకుడు కిశోర్ ‘జీవితగారు చేస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ తర్వాత నన్ను కలిశారు. పదిమందికి ఉపయోగపడే షో అనే ఉద్దేశంతోనే అంగీకరించాను.
సుమలత:హాలీవుడ్‌లో ఓప్రా విన్‌ఫ్రే చేసే టీవీ షోలు  బాగుంటాయి. అలాంటి షో చేయాలనిపించింది. ఆ చాన్స్ దక్కినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమా లు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది. విడిపోయిన కుటుంబాలు కలవడానికి మరిన్ని వేదికలు దొరుకుతాయి.
ఒక మహిళగా మీరు మహిళలకు ఎక్కువగా మద్దతిచ్చే అవకాశం ఉంటుందని కొందరి అభిప్రాయం?
సుమలత: జనరల్‌గా ఆడ, మగ మధ్య సమస్య అంటే దానికి కారణం మగవాళ్లే అనే అభిప్రాయం ఉంటుంది. నిజానికి మహిళల వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చే వాటిలో 80 నుంచి 90 శాతం కేసులు మహిళల గొడవలతోనే ఉంటున్నాయి. ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ల వైపే మాట్లాడతా. ప్రత్యేకంగా మహిళలకు సపోర్ట్ చేయడం అంటూ ఉండదు.

మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో గుర్తుండిపోయిన కేసు ఏది?
సుమలత: కర్నూలు నుంచి ఒక కేసు కౌన్సిలింగ్‌కు వచ్చింది. టైలర్ పని చేసుకునే పుట్టు మూగ, చెవిటి  వ్యక్తికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి చాలా మంచిది. ఏమీ వినపడని, మాటలు రాని భర్తకి తనే అన్ని సేవలు చేసేది. అతని మూగ భాషను అర్థం చేసుకుంది. సైగలతో మాట్లాడటం నేర్చుకుంది. ఇద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతను టైలర్ పని మానేస్తే... తనే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇలా ఇరవై ఏళ్లు భర్తను కాపాడుకొచ్చింది. కొన్నేళ్ల తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన అంగవైకల్యం వల్ల భార్య మరో వ్యక్తిని ఇష్టపడుతుందేమోనన్న అనుమానం అతనిలో మొదలైంది. భార్యను తిట్టేవాడు, కొట్టేవాడు. అన్నీ సహించిందామె. ఈ కార్యక్రమానికి వచ్చారు. అతను విడాకులు కావాలన్నాడు. ఆమె నాకు కుటుంబమే కావాలంది. ఎందుకమ్మా ఇంకా ఇతన్ని భరిస్తావు? అని అడిగితే... ‘నేను లేకపోతే నా భర్తను ఎవరూ చూసుకోరు. ఆయన్ను నేను మాత్రమే కాపాడగలను’ అంది. ఆ అమ్మాయి మంచితనం, సహనం నా మనసుని క దిలించింది. కౌన్సిలింగ్ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. మేం చేయాల్సిన సాయం చేశాం. ఇప్పుడు వాళ్లు కలిసి ఉంటున్నారు.

జీవిత: ఓ కేసుని ఎప్పటికీ మర్చిపోలేను. పెళ్లయిన ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు పుట్టాక, తన భర్తని వదిలిపెట్టి వేరే ఎవరితోనే వెళ్లిపోయింది. ‘నా కోసం వద్దు. పిల్లల కోసమైనా వచ్చెయ్. నీ దారిన నువ్వు ఉండు. నీ జోలికి నేను రాను’ అని మా అందరి సాక్షిగా ఆ అమ్మాయి భర్త అన్నాడు. కానీ, ఆ అమ్మాయి మాత్రం పిల్లలు మొహం చూసో, భర్త కోసమో, సమాజం గురించి ఆలోచించో నిర్ణయం తీసుకోలేదు. ఎవరితో వెళ్లిపోయిందో అతనితోనే ఉంటానని చెప్పింది. ఈ అమ్మాయిని ఎవరైతే తీసుకెళ్లాడో అతన్ని మానవతా దృక్పథంతో ఆలోచించమంటే, ‘చచ్చినా.. బతికినా ఆ అమ్మాయితోనే. విడిపోయే ప్రసక్తి లేదు’ అని తెగేసి చెప్పాడు. పిల్లలు కూడా ‘రామ్మా..’ అని బతిమాలారు. కానీ, ఆ తల్లి కనికరించలేదు. కావాలంటే ‘మీరు రండి.. నాతో ఉండండి’ అంది. పిల్లలు మాత్రం ‘నువ్వూ, నాన్నా కలిసి ఉంటేనే మేం ఉంటాం. లేకపోతే నాన్నతోనే ఉంటాం’ అన్నారు. అప్పుడు నేను చెప్పిన తీర్పు ఏంటంటే.. ఆ అమ్మాయి భర్తను పిలిచి, ‘నీకు తగ్గ అమ్మాయిని, నీ పిల్లలను బాగా చూసుకునే అమ్మాయిని చేసుకో. నువ్ కాబట్టి ఆ అమ్మాయిని మళ్లీ తీసుకువెళతానంటున్నావ్. వేరేవాళ్లయితే ఒప్పుకోరు’ అన్నాను.

జీవిత: దర్శక-నిర్మాతలు షో ప్రారంభానికి ముందు నా దగ్గర కేసు గురించి పది నిముషాలు వివరిస్తారు. దాంతో ఎవరు ఏంటో ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత షోలోకి వెళతాను. అక్కడ రెండు వర్గాలవాళ్లు చెప్పినవన్నీ వింటాను. మామూలుగా కొన్ని షోస్‌లో డెరైక్టర్ ఎలా చెబితే అలా చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఒక కేస్‌ని డీల్ చేసేటప్పుడు ఆడ, మగ అనేది ఉండదు. న్యాయంవైపే ఉంటాను.

ఇక్కడికొచ్చేవాళ్లు సమస్యలను కాస్త ఎక్కువ చేసి చెప్పే అవకాశం ఉంటుంది కదా?
సుమలత: మేం ప్రశ్నించేటప్పుడు పూర్తిగా కాకున్నా 70 శాతం ఎవరు నిజం మాట్లాడుతున్నారు? ఎవరు అతిగా చెబుతున్నారనేది ఒక అంచనాకు వస్తాం. ఈ షో ప్రొడ్యూసర్స్ ఆ జంటలో ఎవరు తప్పు చేశారనేది ముందుగానే  కనుక్కుంటారు. ఆ ఫీడ్‌బ్యాక్‌తో ఎవరు అతిగా చెబుతున్నారనేది తెలిసిపోతుంది.

జీవిత:  ఒకట్రెండు సార్లు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ రాకపోతే.. ఒకటికి నాలుగు సార్లు అడుగుతాను. వాళ్లే కన్‌ఫ్యూజ్ అయ్యి అసలు విషయం చెప్పేస్తారు. ఏ విషయాన్నయినా అతిగా చెబితే ఇట్టే పట్టేయొచ్చు. 200 శాతం నేను కరెక్ట్‌గా జడ్జ్ చేస్తాను.
ఈ కార్యక్రమంతో మీరెంత సంతృప్తిగా ఉన్నారు?
సుమలత: కౌన్సిలింగ్‌కు వచ్చిన చాలామంది.. మూడు నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తారు. ‘మేడమ్ ఇప్పుడు మా కుటుంబం బాగుంది’ అని చెబుతుంటారు. అప్పుడు నాకు దొరికే సంతృప్తి డబ్బుతో రాదు. ఒక కుటుంబాన్ని నిలబెట్టామనే సంతోషం వెల కట్టలేనిది.

జీవిత: ఓ పెద్ద యూనివర్శిటీ వీసీ (వైస్ చాన్సలర్) ‘మేడమ్.. మీ షో చాలా బాగుంది. నేనా షోకి మా ఇంట్లో వాళ్లను తీసుకొచ్చే పరిస్థితిలో లేను. విడిగా మీరు టైమ్ ఇస్తే, నా కూతురు, అల్లుణ్ణి తీసుకువస్తాను. మీరు మాట్లాడితే సర్దుకుంటుందని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది?

ఇలాంటి షోస్ ఇంకా ఉన్నాయి కదా.. మరి పోటీ?
జీవిత: ఎవరు షో ఎంత బాగా సక్సెస్ అయిందనే పోటీ  ముఖ్యం కాదు. వచ్చిన వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతున్నామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ షో కన్నా మనం ఇంకా బాగా చేయాలి? అనుకోవడానికి ఇది నటన కాదు... జీవితం.
సుమలత: ఇలాంటి షోస్ ఎన్ని ఉన్నా చాలదు. ఎందుకంటే ప్రపంచంలో బోల్డన్ని సమస్యలున్నాయి. ఒకవేళ లేకపోతే వీటి అవసరమే లేదు. ఎవరి షో వాళ్లదే. న్యాయ నిర్ణేతల మధ్య పోలికలు పెడుతున్నారు. ఆవిడ ఇలా చేస్తోంది? ఈవిడ ఇలా చేస్తోంది? అని మాట్లాడు కుంటారు. అది సహజం. మా మధ్య పోటీ లేదు.

మీ భర్త రాజశేఖర్‌గారు మీ ప్రోగ్రామ్ చూస్తుంటారా?
ఆయన ప్రోత్సహించడంవల్లే చేస్తున్నాను. నాకూ వ్యక్తిగతంగా ఇష్టమే. షో చూసినప్పుడల్లా ‘నీ పెదరాయుడు తీర్పు ‘బతుకు జట్కా బండి’లో చూపించుకో. నా దగ్గర కాదు’ అని సరదాగా ఆటపట్టిస్తుంటారు. నా కూతుళ్లేమో ‘నువ్వేమైనా చేసుకో మమ్మీ. నువ్ మాత్రం మా బానిసవే’ అని నవ్వుతుంటారు. నేను కూడా ‘యస్.. నేను మీ బానిసనే’ అంటుంటాను. షో ఇంత సక్సెస్ అవు తుందని ఊహించలేదు. ఆ మధ్య ఓ పెళ్లికి వెళితే.. పెద్ద పోలీసాఫీసర్స్ ‘ఏమ్మా.. మా పని నువ్వే చేసేస్తున్నావ్. సమస్యలన్నీ తీర్చేస్తున్నావ్’ అని అభినందించారు.

ఒక్కోసారి సహనం కోల్పోయి తిట్టే స్థాయి వరకూ..?
జీవిత: ప్రతి షో గురించి ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకుంటారు. ఆ షోలో ఆ నటి కొట్టిందట.. మరో షోలో ఆ నటి బూతులు తిట్టిందట.. అని. జీవిత ఇలా మాట్లాడిందట అని తప్పు వెతికితే.. ఎవరో దగ్గర కాకుండా నేరుగా నా దగ్గరే ఆ మాట అంటే సమాధానం చెబుతా. మాస్, క్లాస్ విషయానికొస్తే.. నేను మాసే.
సుమలత: కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ, కోపాన్ని ప్రదర్శించి డ్రామా క్రియేట్ చేయడం నాకిష్టం ఉండదు. అలా చేస్తే ఎక్కువ మంది నా ప్రోగ్రామ్ చూస్తారు. మా లక్ష్యం అది కాదు. వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించగలం అని మాత్రమే ఆలోచిస్తాం. ఎవరినైనా తిట్టినా అది ఆపుకోలేని కోపమే గానీ వాళ్లను కించపరచాలని కాదు.
- శివ మల్లాల

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా