తోట పనీ ధ్యానమే

3 Jun, 2018 00:42 IST|Sakshi

ఆ జెన్‌ గురువు ఓ పర్వతం పాదాలకింద ఓ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ఏళ్ళ తరబడి నివసిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఓ అందమైన పూలతోట కూడా ఉంది. ఆ తోటలో బోలెడన్ని పూలమొక్కలు. వాటి బాగోగులు పరిశీలించే పనులన్నీ శిష్యులకు అప్పగించారు సాధువు. వాళ్ళూ గురువుగారి మాట మీరకుండా పూదోటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

నిత్యమూ బోలెడు పువ్వులు వికసిస్తూ చూపరులను ఆకర్షించడమే ఆ పూలమొక్కల పని. సాధువుకు ఆ పూలవనం అంటే ఎంతో ఇష్టం. వాటిని శిష్యులు ప్రాణప్రదంగా చూసుకోవడం గురువుకెంతో నచ్చింది. అందుకే ఆయన ప్రతిరోజూ ఆ తోటలో కొన్ని గంటలు గడుపుతారు. అంతేకాదు, ఆయన కూడా కొన్ని మొక్కలకు నీరు పోస్తారు. పువ్వులతోనూ, మొగ్గలతోనూ, పచ్చని ఆకులతోనూ కబుర్లు చెబుతూనే, రాలిన ఆకులను సేకరించి తోటనంతా శుభ్రం చేస్తుంటారు.

గురువు తీరుని చూసి ఆశ్చర్యంతో ఒకరడిగారు... ‘‘అయ్యా, ఈ తోటలో చెత్తాచెదారం మీరు బాగు చేయాలా... మీరు ఏం చెప్తే అది చెయ్యడానికి శిష్యులు ఉన్నారు... ఒకవేళ శిష్యులు బద్దకించినా డబ్బులు వెదజల్లితే తోట పనులు చెయ్యడానికి మనుషులు ముందుకొస్తారు కదా’’ అని. సాధువు నవ్వి ‘‘ఎవరో ఎందుకూ... నేను ఈ తోట పని చేస్తే తప్పేంటీ...’’ అని ప్రశ్నించారు. ‘‘తప్పు లేదండి. కానీ మీరు మహాత్ములు. ఎన్నో ప్రసంగాలు చేసే గొప్ప ఆలోచనాపరులు. మీ అపూర్వమైన కాలాన్ని మీరు మరివేటికైనా ఉపయోగించుకోవచ్చు కదా’’ అని ఆయన మనసులోని మాట చెప్పాడు.

సాధువు ‘‘మిత్రమా, నేను ఒట్టి తోట పనే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను... ప్రతి రోజూ నేను ఈ సమయం కోసమే నిరీక్షిస్తుంటాను. తోటలోకెళ్ళి ఎప్పుడు శుభ్రం చేస్తానా అని. ఇక్కడే ఇతర ఆలోచనలేవీ మనసులోకి రానివ్వక మొక్కలతోనూ పువ్వులతోనూ నా సమయాన్ని గడుపుతాను. మొక్కలకు నీరు పోస్తూ, వికసించిన పువ్వులతో మాట్లాడుతూ పరవశించి నన్ను నేను మరచిపోతుంటాను. అలాంటి అమృతఘడియలు మరెక్కడా అంత అమోఘంగా అద్భుతంగా దొరకవు. కనుక నాకీ తోట పనీ ఓ ధ్యానమే‘‘ అని చెప్పారు.

– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు