విలువైన వజ్రాన్ని చినిగిన బట్టలో కట్టి దాస్తారా..?

15 Jul, 2018 00:52 IST|Sakshi

సూఫీ జ్ఞాని జలాలుద్దీన్‌ రూమీని ఒకరడిగారు... ‘‘ఫలానా మతగ్రంథం చదవడం మంచిదేనా’’ని. ఈ ప్రశ్నకు రూమీ ‘దానిని చదవడం వల్ల మంచి మార్గంలో నడిచే స్థితిలో నువ్వున్నావా అనేది ముందుగా తెలుసుకోవాలి’’ అని అన్నారు. ఆ మాటకొస్తే ఏ పుస్తకంలోనైనా మంచి విషయాలుండొచ్చు. కానీ ఏం లాభం... ఆ మంచిని ఉపయోగించుకోవడంలో మంచితనం ఉంటుంది. లేకుంటే ఎన్ని పుస్తకాలు చదివినా ఏం లాభం... చెవులేవీ పనిచేయనప్పుడు అతనికి మధురమైన సంగీతమైనా ఒకటే. రణగొణధ్వనైనా ఒకటే. కంటి చూపులేని వ్యక్తికి రవివర్మ పెయింటింగ్‌ చూపించినా, పికాసోది చూపించినా ఒకటే.

భావం, చిత్రం ఎంత గొప్పవైనా ఉన్నతమైనదైనా అంతకన్నా ముఖ్యం. వాటిని చదివి చూసి ఆస్వాదించే మనసు లేకుంటే నిష్పయ్రోజనమే. ఉదాహరణకు ఓ కుక్క ఓ కొబ్బరిబొండాం నోట కరచుకుని పరిగెత్తుతుండొచ్చు. ఆ బొండాకు కన్నం చేస్తేనే, అందులోని నీరు తాగగలం. కానీ దానిని బద్దలు కొట్టే శక్తికి కుక్కకు లేదు. అప్పుడది ఎంత దూరం దాంతో పరుగెత్తినా లాభమేంటి? ఆత్మజ్ఞానంలో అంతరంగం అనేదే ముఖ్యం. విలువైన వజ్రాన్ని ఎవరైనా ఓ చినిగిన బట్టలో కట్టి దాస్తారా... మనసుకి పరిపక్వత లేనప్పుడు జ్ఞానాన్వేషణకోసం ఎన్ని ప్రదేశాలు, ఎన్ని ఆలయాలు సందర్శించినా ఫలితముండదు. తన లోపల సమస్యలుంచుకొని వాటిని కాదని ఎక్కడ తిరిగితే ఏం లాభం.

కనుక మనసుకి స్వీకరించే శక్తి ఉంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఈ స్థితికి చేరాలంటే మనలో ఎంతో కొంత చైతన్యమనేది ఉండాలి. పువ్వు వికసించినప్పుడేగా అందులోని మకరందం వినియోగానికి వస్తుంది. అంతేకాదు, దానిపై సీతాకోకచిలుకో తుమ్మెదో వాలుతుంది. తన దాహం తీర్చుకుంటుంది. అలా కాకుండా పువ్వు వికసించకుండా మొగ్గగానే ఉంటే అది ఎవరిని ఆకర్షిస్తుంది. ఏ సీతాకోకచిలుక దానిమీదకు వాలుతుంది.

అందుకే అంటారు, మనసు వికసించి పరిపక్వతనేది కలగాలని. లేకుంటే ఎంత మంచి పుస్తకం చదివినా ఎంత మంచి బొమ్మను చూసినా ఎంత మంచి పని చేసినా ఆనందం కలగదు. పువ్వు వికసిస్తేనే మొక్కకు అందం. కంటిచూపుకీ ఆహ్లాదం. కనుక చైతన్యవంతులు కావడానికి మనసుని ఖాళీగా ఉంచుకోకుండా సన్మార్గంలో చక్కటి ఆలోచనలతో, సత్కార్యాలతో ముందుకు సాగాలి. అప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది. లేకుంటే ఏదైనా బూడిదలో పోసిన పన్నీరే సుమా.

– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు