అంజూరపు చెట్టుకు యేసు శాపం!

11 Apr, 2017 00:33 IST|Sakshi
అంజూరపు చెట్టుకు యేసు శాపం!

యెరూషలేము వెళ్తూ ఆకలిగొన్న యేసు పండ్లు కోసుకొని తినేందుకు ఒక అంజూరపు చెట్టు వద్దకు వెళ్లాడు. నిండా ఆకులే తప్ప ఒక పండూ లేని ఆ చెట్టును యేసు శపించగా అది వెంటనే వాడిపోయింది. ‘పరిశుద్ధ వారం’లో ఈ ఉదంతాన్ని ధ్యానిస్తూ ఉంటాము. మానవుడు మంచి పనులు చేసినందుకు మెచ్చి దేవుడు రక్షణనివ్వడు. దేవుడు తన ఉచితమైన కృపతో రక్షించిన మానవుడు విశ్వాసిగా దేవుని విశ్వాసం, సహవాసం, ప్రేమలో ఎదుగుతూ సత్కార్యాలు చేస్తేనే దేవుడు మెచ్చి ఆశీర్వదిస్తాడని బైబిలు చెబుతోంది.

 దాన్నే యేసు ప్రభువు ఫలించడం అన్నాడు. అంజూరపు చెట్టు ఆకులు అత్యంత ఆకర్షణీయమైనవి, దాని పళ్లు మాత్రం అంత అందంగా ఉండవు. ఆకులతో ఆకర్షించిన అంజూరపు చెట్టు బాటసారికి పళ్లివ్వకపోతే దానికసలు విలువేముంది? క్రైస్తవమంటే ప్రసంగాలు, నీతి బోధలు చేయడం, సిద్ధాంతాలు వల్లించడం కాదు. తనను వలే తన పొరుగు వారిని ప్రేమించడమని యేసు చాలా స్పష్టంగా బోధించాడు. స్వార్థానికి దురాశకు, అసూయకు, దుర్మార్గతకు, కుతంత్రాలకు విశ్వాసిలో చోటు లేదు.

 ప్రభువులో వేరు పారి ఎదుగుతూ, పొరుగువారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ వారి పక్షంగా నిలబడటమే నిజమైన క్రైస్తవమని, అలా ఫలించని చెట్టులాంటి విశ్వాసులకు చాలా ‘కఠినమైన తీర్పు’ తప్పదని యేసు బోధించాడు (యోహాను 15:1–11). యేసు తన ముప్ఫై మూడున్నరేళ్ల ఈ లోకజీవితంలో ప్రసంగాల ద్వారా కన్నా తన జీవితం ద్వారానే అందరినీ ప్రభావితం చేశాడు. తన ప్రేమనంతా ఆచరణలోనే చూపించాడు.
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు