లోకజ్ఞానంతో కాదు... దైవజ్ఞానంతో ఆంతర్యాన్ని నింపుకోవాలి!

2 Apr, 2017 00:40 IST|Sakshi
లోకజ్ఞానంతో కాదు... దైవజ్ఞానంతో ఆంతర్యాన్ని నింపుకోవాలి!

యేసు ఎంతోమందికి తన శిష్యులుగా తర్ఫీదునిచ్చి దేవుని రాజ్య రాయబారులుగా తీర్చిదిద్దాడు. తన నామంతో మహాద్భుతాలు చేసే అధికారాన్ని వారికిచ్చాడు. అయితే ఇస్కరియోతు యూదా అనే శిష్యుడొక్కడే ఆ శిక్షణలో ఫెయిల్‌ అయ్యాడు. నిజానికి శిక్షణలో అగ్రస్థానం పొందే ఎన్నో విశేషాలు అతనికున్నాయి. అతను మేధావి. యెరికోలోని ఒక గొప్ప వ్యాపారస్తుని కొడుకు. బహుశా అందుకే మిగిలిన వారితో సరిగా కలిసేవాడు కాడేమో. ధనిక నేపథ్యమున్న వాడు గనుక డబ్బుకు కక్కుర్తి పడడని అతనికి డబ్బు సంచి ఇచ్చారు. కాని ఏం లాభం? ముప్ఫై వెండినాణేలకు యేసును యూదు మత పెద్దలకు అప్పగించాడు.ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు.

మనిషి ఆంతర్యం ఒక మహా అగాధం. దాన్ని లోకజ్ఞానంతో నింపే కొద్దీ, మురికికూపంగా మారుతుంది. ఒక కరడుగట్టిన పాపి విశ్వాసిగా మారే ప్రయాణం పొడవునా ఆత్మ ప్రక్షాళన అనివార్యమవుతుంది. మూడున్నరేళ్ల తమ శిక్షణకాలంలో శిష్యులు తమ ఆంతర్యాన్ని దేవుని సహచర్యంలో పొందిన ఎన్నో దివ్యానుభవాలతో నింపుకున్నారు. అలా వాళ్లంతా దైవజ్ఞాన ఖజానాలు, దేవుని ప్రేమ పండించే పరమ క్షేత్రాలయ్యారు. ఇలా ఎక్కడ ఇతరులు లాభపడ్డారో అక్కడ యూదా విఫలమయ్యాడు. దేవునితోనే తిరిగిన మేధావి, కాని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని అజ్ఞానం, దౌర్భాగ్యం అతనిది. అందుకే ఆంతర్యాన్ని లోకజ్ఞానంతో కాదు, దైవజ్ఞానంతో నింపుకోవాలి. చౌకబారు వినోదంతో కాదు, నిరుపేదల సేవలో తరించే అనిర్వచనీయమైన ఆనందంతో నింపుకోవాలి.

అది దేవుని సన్నిధిలో మోకరించి గడిపే ఏకాంత ప్రార్థనలో, బైబిలు పఠనలో మాత్రమే విరివిగా దొరుకుతుంది. గతంలో విలువైన బైబిలు జ్ఞానంతో మహాభక్తులు పునాది వేసిన చర్చిలే దేవుని ప్రేమను అద్భుతంగా ప్రకటించాయి. అయితే అవాస్తవాలను, సగం వాస్తవాలను కూడా నమ్మలేని నిజాలుగా చలామణి చేసే ‘ఇంటర్నెట్‌’ ఇపుడు చాలామంది బోధకుల జీవితాల్లో ‘బైబిల్‌’కు ప్రత్యామ్నాయమైంది. అలా దైవజ్ఞానానికి బదులు నకిలీ దైవజ్ఞానంతో నిండుతున్న చర్చిలకు, విశ్వాసులకు నిరుపేదల ఆకలికేకలు వినలేని ‘చెవిటితనం’ వినబడ్డా పాకులాడలేని ‘ఆత్మీయ అవిటితనం’ ఆవహించింది!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు