దేవుని కోసం బతికి, దేవుని కోసమే చనిపోయిన స్తెఫను!

29 Jan, 2017 00:35 IST|Sakshi
దేవుని కోసం బతికి, దేవుని కోసమే చనిపోయిన స్తెఫను!

సువార్త

నమ్మిన సత్యాన్ని ఆచరించి నిర్భయంగా ప్రకటించకపోతే దానికి విలువేముంది? స్తెఫను అనే దైవ పరిచారకుడు తన విశ్వాసాన్ని ఆచరించి ప్రకటించి హతసాక్షి అయ్యాడు. ప్రత్యేకంగా సామాజిక సేవ కోసం ఆదిమ అపొస్తలులు నియమించిన ఏడుగురు పరిచారకుల్లో స్తెఫను ప్రధముడు (అపొ.కా. 6:5) అయితే స్తెఫను పరిచర్య, ప్రసంగాలు, అద్భుతాలు ఛాందసవాదుల దృష్టిల్లో పడ్డాయి. వివరణ కోసం వారతన్ని సర్వోన్నత యూదు మహాసభకు పిలిచారు. లోతైన విశేషణతో స్తెఫను ఆనాడు చేసిన ప్రసంగం ఒక మచ్చుతునకగా మిగిలింది (అపొ.కా. 7). దేవుని కన్నా మిన్నగా మారిన దేవాలయం, దాని విధి విధానాలను, యూదుల ఆ మత మౌఢ్యాన్ని స్తెఫను నిర్భయంగా ఎండగట్టాడు. మోషే కాలపు ప్రత్యక్ష గుడారమైనా, సొలొమోను నిర్మించిన యెరూషలేము దేవాలయమైనా, ఆయా దశల్లో అప్పటి ప్రజల ఆత్మీయావసరాలు తీర్చినవే తప్ప, దేవదేవుని సర్వసంపూర్ణ ప్రత్యక్షతను నిరూపించినవి కావని, అందుకవి సరిపోవని స్తెఫను తేల్చి చెప్పాడు. అది విని యూదులు అట్టుడికిపోయారు.

కాని దేవుని సర్వోన్నత సంపూర్ణ ప్రత్యక్షతను తాను ఆకాశంలో దేవునికి కుడివైపున కూర్చున్న యేసుక్రీస్తులో ఇపుడు చూస్తున్నానంటూ స్తెఫను ఆత్మవశుడై పలికిన చివరి మాటతో రెచ్చిపోయి అతని వాదనతో ఏకీభవించలేక, విశ్లేషణను జీర్ణించుకోలేక ఆయన్ను రాళ్లతో కొట్టి చంపారు. దైవద్రోహం చేసిన వారికి విధించే మరణశిక్షను అలా ఒక దైవపరిచారకునికి వారు అన్యాయంగా విధించి చంపారు. అయితే స్తెఫను మరణం వృధా కాలేదు. దీనంతటికీ సారథ్యం వహించిన సౌలు అనే మరో యూదు ఛాందసుని అంతరంగంలో స్తెఫను కనపర్చిన అచంచల విశ్వాసం, అతనిలో గుభాళించిన సైద్ధాంతిక విశ్వేషణ, స్పష్టత, మృత్యుముఖంలో కూడా అతనిలో చెదరని ఆత్మీయానందం, వాడని క్షమా పరిమళం సౌలుపై చెరగని ముద్ర వేసింది. అతని అంతరంగంలో కల్లోలం రేపింది. ఫలితంగా కొన్నాళ్లకే అతను పౌలుగా క్రీస్తు పరిచారకుడుగా మారి అద్భుతమైన సేవ చేసేందుకు బీజాలు వేసింది.

దేవుని కోసం నిర్భయంగా బతికేవారే, నిర్భయంగా దేవుని కోసం చనిపోగలరు. అలా కేవలం రెండధ్యాయాల్లో ముగిసిన స్తెఫను ఉదంతం ఈ రెండు వేల ఏళ్లుగా క్రైస్తవోద్యమానికి స్ఫూర్తినిస్తూనే ఉంది.
– రెవ.డాక్టర్‌ టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు