క్రియలు లేని విశ్వాసం మృతం

1 May, 2016 01:57 IST|Sakshi
క్రియలు లేని విశ్వాసం మృతం

దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17).

నీకిష్టమైతే నన్ను బాగుచేయమంటూ ఒక కుష్ఠురోగి యేసుక్రీస్తును ప్రాధేయపడ్డాడు. దానికిష్టమేనంటూ ప్రభువతన్ని బాగుచేశాడు. ఎన్నో ఏళ్ల అతని శాపగ్రస్థమైన జీవితానికి దేవుని కృపవల్ల కొన్ని క్షణాల్లో అలా తెరపడింది. అయితే ఆ వెంటనే అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరికను ప్రభువు జారీ చేశాడు. ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. కానీ సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపర్చుకొని మోషే నియమించిన కానుక చెల్లించు’ అన్నాడు యేసుప్రభువు (మత్తయి 8:1-4).

 దేవుని అద్భుతాన్ని చవిచూసినవాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో యేసు  తెలిపిన ఉదంతమిది. దేవుడు అద్భుతం చేశాడని చెప్పుకోవాలనుకోవడం సహజమే! కాని ఆ ‘కృతజ్ఞతాభావం’ విశ్వాసి మాటల్లో కాదు చేతల్లో లోకానికి వెల్లడి కావాలన్నది ప్రభువు మాటల తాత్పర్యం. కుష్ఠురోగం అంతకాలంగా అతన్ని లోకానికి, దేవునికి కూడా దూరంగా ఉంచింది. కాబట్టి అతను ముందుగా దేవాలయానికి వెళ్లి, యాజకునికి కనబర్చుకొని దేవుని ఆరాధించాలి. ఆ తర్వాతే సమాజంలోకి వెళ్లాలి. దేవుడు అద్భుతం చేసి గండం గట్టెక్కించే వరకూ దేవుని ప్రాధేయపడటం, ఉపవాస ప్రార్థనలు చేయడం షరా మామూలే!

అద్భుతం జరిగి గండం గడిచాక దేవుని మాటల్లో స్తుతించడమే తప్ప దేవునికి మరింత దగ్గరై జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచనే లేకపోవడం విషాదకరం. మార్పు లేకుండా జీవించే వాడు ఎంత మాట్లాడినా దేవునికి మహిమ కలగదు. మన పెదాలు దేవుని స్తుతిస్తుంటే, మన జీవితం నిండా దైవవ్యతిరేకత అనే దుర్గంధముంటే, అది దేవునికెంత అవమానకరం? జీవితాన్ని పూర్తిగా మార్చేదే నిజమైన కృతజ్ఞత! మాటల్లో, పాటల్లో, ప్రసంగాల్లో టన్నులకొద్దీ కుమ్మరిస్తున్నాం కానీ చేతల్లో అణుమాత్రం కూడా చూపడం లేదు. దేవుని పట్ల కృతజ్ఞతతో మనం మారితే ఆ మార్పును లోకం స్తుతిస్తుంది. ఆ పెనుమార్పుకు కారణమేమిటో, దేవుడు చేసిన అద్భుతమేంటో దేవుడెవరో అలా మనం చెప్పకుండానే లోకం తెలుసుకుంటుంది.

అందుకే ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు’ అన్నది ప్రభువు అతనికిచ్చిన ఆజ్ఞ. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపర్చబడతాడన్నాడొకసారి యేసుప్రభువు (యోహాను 15:8). చెట్టెప్పుడూ తన గొప్పదనాన్ని చెప్పుకోదు, ప్రసంగాలు చేయదు, పాటలు పాడదు. లోకానికి తియ్యటి తన ఫలాలనిస్తుందంతే! దేవునికోసం ఫలించడమంటే లోక కల్యాణార్థం, దీనుల సహాయార్థం మౌనంగా సత్కార్యాలు చేయడమే! తన సమస్యల్లో ఆదుకొని అద్భుతాలు చేసిన దేవుని పట్ల నిజంగానే కృతజ్ఞత కలిగిన విశ్వాసి, తోటి మానవుల సమస్యల పట్ల స్పందించకుండా ఉండలేడు.

దేవునికోసం నేనేం మాట్లాడాలి? అని కాక దేవుని పేరిట దీనులకోసం నేనేం చేయాలి? అన్న ధ్యాసతో విశ్వాసి నిరంతరం రగిలిపోవాలి. అయితే దేవునికోసం ఏదైనా చేయమని హృదయం చెబుతుంటే, అది చేయకుండా ఉండేందుకు మెదడు రకరకాల సాకులు చూపెడుతుంటుంది. సాకులు తయారు చేసే మహాయంత్రమైన మన మెదడే మనకు ప్రధానమైన అవరోధమవుతుంది. మండుటెండకు కాగుతున్న వ్యక్తికి గిన్నెడు చల్లటి నీళ్లిచ్చినా అది అద్భుతమైన పరిచర్య అంటాడు ప్రభువు (మత్తయి 10:42). ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనమిచ్చే గిన్నెడు చల్లనీళ్లే, సముద్రమంత దేవుని ప్రేమను పరిచయం చేస్తాయి.  - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా