దీనులకోసం యేసు కొండమీది ప్రసంగం

13 Jan, 2019 02:04 IST|Sakshi

కష్టాలు, కన్నీళ్లు, ఓటములు, భరించలేని బాధల ‘లోయల్లో’ నలుగుతున్న ఎంతోమంది అభాగ్యుల సాంత్వన, ఆదరణ కోసం యేసుప్రభువు ‘కొండమీద’ ప్రసంగం చేశారు(మత్తయి 5–7 అధ్యాయాలు). ఆత్మలో దీనులు, దుఃఖపడేవారు, సాత్వికులు, నీతిని ప్రేమించేవారు, నీతికోసం హింసించబడేవారు, కనికరం గలవారు హృదయ శుద్ధిగలవారు, సమాధానపర్చేవారు ధన్యులు అంటూ ఎంతో విలక్షణంగా  ఆరంభమై ఆత్మీయంగా అత్యంత విప్లవాత్మకంగా సాగిన ఆయన ప్రసంగం విన్న తర్వాత బోలెడు జనసమూహం ఆయన్ను వెంబడించారు కాని, వారిలో కేవలం ఒక కుష్టురోగి మాత్రమే ఆయనకు మొక్కి తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాడు (8:1,2). కుష్టురోగం మనిషిని నిలువెల్లా గుల్ల చేసి, రసి కారే దుర్గంధపూరితమైన గాయాలతో నింపి అతన్ని వికృతంగా మార్చితే, సమాజం అతన్ని  వెలివేసింది.

కాని యేసుప్రభువు మాత్రం అతన్ని రోగవిముక్తుని చేసి అక్కున చేర్చుకున్నాడు. తాను బోధించేవాడిని మాత్రమే కాదని, తన బోధల్ని జీవితంలో ఆచరించి చూపిస్తానని ప్రభువలా రుజువు చేసుకున్నాడు. నా మాటలు వినే వాడు కాదు, విని వాటి చొప్పున చేసేవాడే బుద్ధిమంతుడన్న తన ప్రసంగవ్యాఖ్యల్ని తన ప్రేమభరితమైన చర్యతో ఆచరించి చూపించాడు( 7:24)దేవుడు తన ధర్మాన్ని, విధివిధానాలను యూదులద్వారా లోకానికి అందించినా, అవి యూదులకే కాదు మొత్తం మానవాళికోసం నిర్దేశించినవని రుజువు చేస్తూ, తాను ప్రసంగించిన వెంటనే అన్యుడు, గ్రీసు దేశస్థుడైన ఒక శతాధిపతి కుటుంబంలో యేసుప్రభువు ఒక అద్భుతం చేశాడు. స్త్రీని ఏవగించుకొని ఎంతో చిన్నచూపు చూసే నాటి యూదు సమాజంలో, రోగపీడితురాలై మంచానికి అంటుకు పోయిన పేతురు అత్తగారిని కూడా ఆ వెంటనే బాగుపర్చి ‘సర్వమానవ సమానత్వాన్ని’ చాటిచెప్పాడు(మత్తయి 8 వ అధ్యాయం)

. లోకంలో ఎంతో  సులభమైన పని బోధించడం, కాని చాలా క్లిష్టమైన విషయం వాటిని ఆచరించి చూపించడం. యేసుప్రభువు మాత్రం ఆ పనిని అవలీలగా చేసి తన బోధలు సంపూర్ణంగా ఆచరణీయమైనవని రుజువు చేశాడు. అయితే ఆ రోజు ఆయన కొండమీది ప్రసంగం విన్న చాలామంది ఎంతో కలవరంతో తమ ఇళ్లకు వెళ్లారు. దేవుడు తన ధర్మాన్ని తన ప్రజలకందిస్తే, శాస్త్రులు, పరిసయ్యులు వాటిని ‘చేయకూడని, చేయదగిన నియమావళి’ తో కూడిన ఒక శాస్త్రంగా దాన్ని మార్చి, దాని వెనుక ఉన్న ‘దేవుని హృదయాన్ని’ విస్మరించారు. ధర్మశాస్త్రాన్ని అక్షరాలా ఆచరిస్తే చాలు పరలోకానికి వెళ్తామన్న నాటి పరిసయ్యులు, ఉపదేశకుల బోధలు విని అలా చేస్తూ తాము చాలా నీతిమంతులమన్న భావనతో ఉన్నవారి ఆశలన్నింటినీ యేసు ప్రసంగం వమ్ము చేసింది.

అలాగే, తన సహోదరుని ద్వేషించేవాడు కూడా నరహంతకునితో సమానమేనన్న నాటి యేసు బోధ వారిని కలవరపరిచింది (5:21–25). పరస్త్రీతో శయనిస్తే అది వ్యభిచారమని ధర్మశాస్త్రం చెబుతుండగా, అలా కాదు పరస్త్రీని మోహపు చూపుతో చూసినా అది వ్యభిచారమేనని ప్రభువు అన్నాడు. ఆదిమ ధర్మశాస్త్రపు పరిధిని అలా విస్తరిస్తూ యేసు చేసిన కొండమీది ప్రసంగం నాటి ప్రజల్లో కలవరాన్ని రేపి ఆత్మావలోకనానికి పురికొల్పింది. పరలోకానికి చాలా దగ్గర్లో ఉన్నామనుకున్న చాలామంది నిజానికి దానికి తామెంత దూరంలో ఉన్నామో ఆ రోజు గ్రహించారు. మనవల్ల లోకంలో ఎంత సంతోషం, శాంతి, సోదరభావం నెలకొన్నది, ఎంతమంది అభాగ్యుల కన్నీళ్లు మనం తుడిచామన్నదే దేవుణ్ణి ప్రసన్నుని చేసే ప్రధానాంశం. 
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు