సంకల్పం లైసెన్స్‌ కోసం పోరాటం

13 Mar, 2020 10:48 IST|Sakshi
జిలిమోల్‌ మారియట్‌ థామస్‌

ఇరవై ఎనిమిదేళ్ల జిలిమోల్‌ మారియట్‌ థామస్‌.. కారు డ్రైవింగ్‌ లైసెన్సు కోసం వచ్చినప్పుడు ఆర్టీయే అధికారులు ‘‘నీకు లైసెన్స్‌ ఇవ్వలేమమ్మా’’అన్నారు.‘‘నాకు డ్రైవింగ్‌ వచ్చు సార్, కావాలంటే మీ కళ్ల ముందే కారు నడిపి చూపిస్తాను’’ అంది జలిమోల్‌. చక్కగా డ్రైవ్‌ చేస్తే ఎవరికైనా లైసెన్స్‌ ఇచ్చి తీరవలసిందే కానీ, ఆమెకు ఇవ్వడానికి మాత్రం అధికారులు నిరాకరించారు. కారణం.. ఆమె చేతులతో కాకుండా కాళ్లతో కారు నడిపింది.

జిలిమోల్‌కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. చేతులు లేవన్నది అధికారుల అభ్యంతరం. ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. ఏం చేయాలో తోచక ఆమె లైసెన్స్‌ విషయాన్ని అలా ఫైళ్లలో ఉంచేశారు.థలిడోమైడ్‌ సిండ్రోమ్‌ అనే జన్యు అపసవ్యత కారణంగా రెండు చేతులూ లేకుండా పుట్టింది జిలిమోల్‌. తన పనులైనా తను చేసుకోలేదు. కానీ కాస్త వయసు రాగానే జిలిమోల్‌ సొంతంగా  పనులు చేసుకోవడం నేర్చుకుంది. ఎవరిపైనా దేనికీ ఆధార పడకూడదు అని మనసులో గట్టిగా సంకల్పించుకున్నాక.. తనకు చేతులు లేవన్న భావను తుడిచిపెట్టేసింది. చురుగ్గా ఉండటం, చదువుల్లో రాణించడం ఆమెకు కష్టం కాలేదు కానీ.. ఆమెకు ఉన్న ఒక కోరిక తీరడానికి మాత్రం ఇంట్లోవాళ్లను ఆమె సంసిద్దులను చెయ్యాల్సి వచ్చింది.

కారు నడుపుతున్న జిలిమోల్‌
‘‘కార్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటాను నాన్నా’’ అంది ఓ రోజు. ఆ మాటకు తల్లిదండ్రులిద్దరూ సంశయంలో పడ్డారు. నాన్న థామస్‌ రైతు. అమ్మ అన్నాకుట్టి గృహిణి. ఆ వంశం లో డ్రైవింగ్‌ తెలిసినవాళ్లే లేరు. ‘అది కాదు తల్లీ..’ అనబోయారు కానీ, కూతురి పట్టుదల తెలిసి ఆమె ముచ్చట తీర్చారు. మారుతి సెలరో–ఆటోమేటిక్‌కి తనకు అనుకూలంగా మార్పులు చేయించుకుని (ఒక ఆర్టీయే అధికారి సూచనలతో) కాళ్లతో డ్రైవింగ్‌ నేర్చుకుంది జిలిమోల్‌. చాలా త్వరగా డ్రైవింగ్‌ వచ్చేసింది! అమ్మానాన్న, చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎర్నాకులంలో వాళ్లుంటున్న నివాసం పక్కన వైఎంసిఎ కాంపౌండ్‌లో డ్రైవింగ్‌ నేర్చుకుంది జిలిమోల్‌. కాళ్లతో కారు డ్రైవ్‌ చేసుకుంటూ ధైర్యంగా ఎర్నాకులం రోడ్లన్నీ తిరిగేస్తోంది కూడా. కానీ, ఆమెకు లైసెన్స్‌ ఇచ్చే చొరవనే అధికారులు చూపించలేకపోతున్నారు. తనకు లైసెన్స్‌ ఇప్పించమని జిలిమోల్‌ 2018లో హైకోర్టుకు కూడా వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే అంది. రాష్ట్ర ప్రభుత్వమే వెనకాడుతోంది. జిలిమోల్‌ మాత్రం లైసెన్స్‌ సాధించి తీరుతాను అంటోంది.

మరిన్ని వార్తలు