తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది

30 Jul, 2013 02:59 IST|Sakshi
తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది
నేల మీద పడుకుని వజ్రాసనాన్ని ఆచరించే స్థితిని సుప్తవజ్రాసనం అంటారు.
 
 ఇలా చేయాలి
 ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. అదెలాగంటే... రెండు మోకాళ్ల మీద కూర్చుని రెండు అరచేతులను తొడలమీద బోర్లించాలి. ఈ స్థితిలో రెండు మడమల మీద పిరుదులు ఆనించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి.
 
 ఇప్పుడు నిదానంగా వెనక్కి వంగుతూ రెండు మోచేతులను ఒకదాని తర్వాత ఒకటి నేల మీద ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో రెండు పాదాల పక్కన రెండు అరచేతులను నేల మీద బోర్లించాలి.
 
 రెండు మోచేతుల సహాయంతో శరీరాన్ని నేలమీద ఉంచి రెండు చేతులను మడిచి తలకింద ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్ల మధ్య నాలుగు వేళ్ల ఖాళీ ఉండాలి. పిరుదులు రెండు మడమల మీద ఆని ఉండాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మోచేతుల సహాయంతో యథాస్థితికి రావాలి. 
 
 ఇలా ప్రతిరోజూ మూడునుంచి ఐదుసార్లు చేయాలి.
 
 ఉపయోగాలు
 తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది. 
 ఆస్తమా, బ్యాక్‌పెయిన్ నుంచి ఉపశమనాన్నిస్తుంది.
 మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
 థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు మంచి ఫలితాలనిస్తుంది.
 గొంతు సమస్యలు తొలగిపోయి స్వరంలో స్పష్టత వస్తుంది.
 
 జాగ్రత్తలు
 మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు చేయకూడదు.
 
 అధిక బరువు ఉన్నవాళ్లు, కొత్తగా చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
 
 మోడల్: ఎస్. దుర్గాహర్షిత 
 నేషనల్ యోగా చాంపియన్
 
>
మరిన్ని వార్తలు