‘క్షమాపణ’లో తడిసిముదై్దన యోసేపు!!

7 Oct, 2018 00:48 IST|Sakshi

సువార్త

యోసేపు చిన్నప్పటి నుండీ దేవుని భయం కలిగిన వాడు. దేవుని భయమంటే తెలియని అతని అన్నలు ఆ కారణంగా అతనిపై పగబట్టారు. అన్నల దుర్మార్గపు ప్రవర్తన గురించిన నివేదికలు యోసేపు తమ తండ్రియైన యాకోబుకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చిన కారణంగా అన్నలతనిపై మరింత కక్ష పెంచుకున్నారు. ముందతన్ని చంపుదామనుకున్నారు, ఆ తర్వాత మనసు మార్చుకొని ఐగుప్తు వర్తకులకు బానిసగా అమ్మేసి, అడవిలో యోసేపు క్రూరమృగం బారినపడి చనిపోయాడని తండ్రికి అబద్ధం చెప్పారు. అలా చిన్నతనంలోనే ఒక బానిసగా ఐగుప్తుకు వెళ్లిన యోసేపు మరెన్నెన్నో  శ్రమలనుభవించినా, అతని సత్ప్రవర్తనకు దేవుని అపారమైన కృప కూడా తోడైన కారణంగా, ఏడేళ్ల భయంకరమైన కరువుకాలంలో ఒక్క ఐగుప్తు దేశానికే కాదు పొరుగు దేశాలవాసులకు కూడా అన్నం పెట్టిన ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుని ద్వారా నియమించబడి ప్రఖ్యాతి చెందాడు. పొరుగునే ఉన్న అతని అన్నలు కూడా ఒకరోజున ధాన్యం కోసం అతని సమక్షానికి రావలసి వచ్చింది. యోసేపు వెంటనే వారిని గుర్తుపట్టాడు. కానీ దైవభయం, తన అత్యున్నత స్థితికి కారకుడు దేవుడేనన్న కృతజ్ఞత, నమ్రత, తగ్గింపు స్వభావం కల్గిన ఒక అసమాన విశ్వాసిగా, చేజిక్కిన అన్నలపై  పగ తీర్చుకోకుండా, వారిని హృదయపూర్వకంగా క్షమించాడు. పైగా మీరు నాకు అన్యాయమేమీ చెయ్యలేదు, అబ్రాహాము వంశంగా తనకోసం ప్రత్యేకించుకున్న మనల్నందర్నీ ఇలాంటి కరువులో పోషించి కాపాడటం కోసం దేవుడే ముందస్తు ప్రణాళికతో మీ ద్వారా ఐగుప్తుకు నన్ను ముందుగా పంపించాడంటూ దేవుని ప్రణాళికను వారికి వివరించాడు. వారిని క్షేమంగా ఇళ్లకు పంపి అన్నలను, వారి కుటుంబాలను, తన తండ్రిని కూడా సాదరంగా ఐగుప్తుకు రప్పించుకొని వాళ్లందరినీ పోషించాడు.

దేవుని అపారమైన ప్రేమకు, సిలువలో పరిమళించిన యేసుక్రీస్తు క్షమాస్వభావానికి యోసేపు నిలువెత్తు నిదర్శనం. యోసేపు నిజానికి ‘స్వయం సాధక వ్యక్తి’ గా తనను తాను శ్లాఘించుకోవచ్చు. అయితే తన జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి, చెడు, చిన్న, పెద్ద సంఘటన దేవుని సంకల్పం మేరకు తనకు, తన ద్వారా లోకానికి మేలు కలిగేందుకే జరుగుతుందని, జరుగుతోందని విశ్వసించిన యోసేపు పాతనిబంధన కాలంలో నివసించిన కొత్తనిబంధన కాలపు మహా విశ్వాసి(రోమా 8:28). పాతనిబంధన కాలంలో తరచుగా జరిగినట్టుగా, యోసేపు తమను, తమ కుటుంబాలను కత్తివాతకు గురి చేసి చంపుతాడేమోనని భయంతో బిక్కచచ్చిన అన్నలతో ‘భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ మీతోపాటు లక్షలాదిమందిని ఈ భయంకరమైన కరువులో చనిపోకుండా బతికేంచేందుకు దేవుడు మీ కీడును నాకు, లోకానికి కూడా మేలు గా మార్చాడు’ అంటూ వారికి కొత్తనిబంధన కాలపు క్షమాసిద్ధాంతాన్ని వివరించాడు. రాబోయే వేలసంవత్సరాల తర్వాత క్రీస్తు ద్వారా ఆవిష్కరించబడనున్న క్షమాయుగపు కృపాసువార్తను ముందే తెలుసుకొని దాన్ని అంగీకరించి, అనుభవించి, ఆచరించి, తద్వారా దేవుని ఆశీర్వాదాలు తనివితీరా పొందిన అసమాన విశ్వాసం యోసేపుది!! పాతనిబంధన వాడైనా క్షమాస్వభావిగా యోసేపు జీవితం చరిత్ర, బైబిల్‌ పుటలకెక్కితే, కొత్తనిబంధన విశ్వాసులమైన మనం మాత్రం పగలతో రగులుతూ, ప్రతీకారేచ్ఛలతో జీవితాలను అశాంతిమయం చేసుకొంటున్న పాతనిబంధన తాలూకు కరడుగట్టిన ప్రజలముగా మిగిలిపోతున్నాం. పగ, కోపం, ప్రతీకారేచ్ఛ శత్రువుకన్నా ముందుగా మనల్నే దహించి బూడిద చేస్తుంది. క్షమాస్వభావం హృదయాన్ని దూదికన్నా తేలికగా చేసి దేవుడు తెరిచిన ఆశీర్వాదాల ద్వారాల గుండా హాయిగా ఆనందంగా ఎగురుతూ, లోకానికి ఆశీర్వాదాలు పంచే పరిచర్యలో మనల్ని ప్రతిష్టిస్తుంది. విశ్వాసికి క్షమాపణ, ప్రేమ శ్వాసగా మారాలి, అప్పుడే అతనిలో, అతని కుటుంబంలో శాంతి, ఆనందం అపారంగా ప్రజ్వలిస్తాయి.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

మరిన్ని వార్తలు