సమాజ వ్యక్తిత్వ వికాసం మొగిలయ్య

19 Jan, 2020 00:18 IST|Sakshi

ఈ దేశంలో సామాన్యుల గరుకు జీవితాలన్నీ మహోన్నత వ్యక్తిత్వాలే. అలాంటి ఎందరెందరో సామాన్యులలో నిలిచిన ఒక సామాజిక పాఠం ఘంటా మొగిలయ్యది. 80 ఏళ్లకుపైగా జీవించి, జనవరి 10న కన్నుమూసిన ఘంటా మొగిలయ్య తన చుట్టుపక్కల సమాజాన్ని తన రెండు చేతులా ఒడిసిపట్టి కాలచక్రం వెంట కదిలాడు. మొగిలయ్యకు 9 ఏళ్లు వచ్చేసరికి తను పుట్టి పెరిగిన కరీంనగర్‌ జిల్లాలోని ధూళికట్ట వూరును వదిలివెళ్లాడు. తర్వాత దాస్వాడకు ఇల్లరికం వచ్చాడు. మానేరు ఒడ్డున 50 ఏళ్లున్నాడు. మానేరు డ్యామ్‌ నిర్మిస్తుంటే తన ఊరంతా ముంపునకు గురైతే మళ్లీ తన కుటుంబాన్ని, తన ఊరివారిని వెంటేసుకుని మూడో ప్రవాసానికి వెళ్లాడు. ఇదంతా పంబాల కులంలో పుట్టిన ఒక సాధారణ మనిషి జీవనయానం. తన మనవళ్లు, మనుమరాళ్ల వరకు పదుల సంఖ్యలో అందర్నీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.

ఘంటా మొగిలయ్య ఊరు రక్షకునిగా ఎదిగి తన బిడ్డల్ని రాష్ట్రానికి మానవ వనరుగా అందించారు. మొగిలయ్యలో అట్టడుగున పడి కన్పించని చైతన్యం ఉంది. తన కుటుంబాన్ని, తన వూరును కంటిపాపలా కాపాడుకునేందుకు కావాల్సినంత ధిక్కారం మొగిలయ్యకు గుండె నిండా ఉంది. మనుషులంటే బోలెడు ప్రేమ. పంబాలకులం పతన్‌ దారీగా ఉన్న మొగిలయ్య గ్రామ సప్తదేవతల పూజారిగా జీవి తాన్ని ప్రారంభించి తను ఎదుగుతూ చివరకు జ్ఞాన జ్యోతిని చేతబట్టి నడిచిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ధూళికట్టకు, ధూళికట్ట నుంచి తిరిగి మల్లాపూర్‌కు వచ్చి ఒక బౌద్ధభిక్షువుగా సంచరించి మానేరు నది ఒడ్డున పుట్టి తిరిగి మానేరు నది ఒడ్డుకే చేరాడు.

రేపటి పాఠం
అడుగుల్లో అడుగులు వేయిస్తూ
చిటికెన వేలుతో ఈ ప్రపంచంలోకి
నడిపించిన బాపు
ఇంటి సింహద్వారం
సంకురాతిరి ముగ్గులాగా
అమ్మ నుదుటి బొట్టులా
మెరిసిన బాపు
పాదముద్రలను వదిలి వెళ్ళిపోయిండు
బాపూలేని ఇంటికి వెళ్ళిన చక్రపాణీ..
తలుపు తెరిచి చూడు
బిడ్డల కోసం అనుభూతుల ముల్లెను
మొగిలయ్య దాచి వుంచిండు చూడు
ఇదే రేపటి పాఠం.. అదే ప్రపంచం
(నేటి మధ్యాహ్నం కరీంనగర్‌ పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఘంటా మొగిలయ్య సంస్మరణ సభ)
– జూలూరు గౌరీ శంకర్‌
కవి, ప్రముఖ సామాజిక వ్యాసకర్త

మరిన్ని వార్తలు