కరౌకేయుడు ఏ పాటైనా.. ఎవరితోనైనా..

16 Oct, 2013 00:46 IST|Sakshi
కరౌకేయుడు ఏ పాటైనా.. ఎవరితోనైనా..
 వరంగల్ జిల్లా  హన్మకొండకు చెందిన డాక్టర్ కె.ఎ.గౌస్ హైదర్ వృత్తిరీత్యా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు. ప్రవృత్తి రీత్యా కరౌకే కళాకారులు. గత పద్దెనిమిది ఏళ్లుగా కరౌకే సంగీతంలో ప్రయోగాలు చేస్తూ వస్తున్న హైదర్ సొంత ఇంటిని కరౌకే అకాడమీగా మార్చేసి ఆ కళకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూ... 
 
 కరౌకే మీకు  ఎలా పరిచయమైంది?
 1992లో కాకినాడ ఫెర్టిలైజర్స్‌లో పనిచేసేటప్పుడు నా సహాధ్యాయి కరౌకేట్రాక్‌లతో ఎంజాయ్ చేసేవాడు. నాకు ఒక కరౌకే డెక్‌ను బహుమతిగా ఇచ్చాడు. అలా మొదలైన పరిచయం కరౌకేతో విడదీయలేని బంధంగా మారింది
 
 కరౌకే మ్యూజిక్ అంటే..?
 కరౌకే అంటే అన్ని రకాల సంగీత వాయిద్యాలతో పూర్తిస్థాయిలో ఒక పాట ట్యూన్ ఉంటుంది. సింగర్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ పాట పాడాలో గ్రహిస్తూ మ్యూజిక్‌కు అనుగుణంగా గాత్రం ఇవ్వడం. నేపథ్య సంగీతంతో పాటు వచ్చే పాట చరణాలు పక్కాగా ఆర్కెస్ట్రాలో పాడినట్టుగా ఉండడమే కరౌకే ప్రత్యేకత. జపాన్‌లో ఆదరణ పొందిన సంగీత కళ ఇది.
 
 కరౌకే ప్రాచుర్యానికి మీరేం చేస్తున్నారు?
 ‘అన్‌మోల్ కరౌకే మ్యూజికల్ అకాడమీ’ నెలకొల్పి కరౌకేను వ్యాప్తి చేసే పనిలో ఉన్నాను. వరంగల్, హైదరాబాద్‌లల్లో ఇప్పటి వరకు దాదాపు 400 షోలు ఇచ్చాను. ఎన్నో ఆల్బమ్‌లు తెచ్చాను. దుబాయ్‌లో సైతం కరౌకే మ్యూజిక్ ఇష్టపడే అభిమానులు పెరిగారు. అక్కడి నుంచి సీడీలు కావాలని మా అకాడమీకి ఫోన్లు వస్తుంటాయి.
 
 కరౌకేలో మీ ప్రత్యేకత ఏమిటి?
 ప్రతి ప్రోగ్రాంలో ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాను. అంధబాలలు, మానసిక వికలాంగులతో సైతం కరౌకే ట్రాక్‌లతో పాటలు పాడిస్తున్నాను. హన్మకొండలోని  ‘అతిథి’, ‘మల్లికాంబ’ మానసిక వికలాంగుల పాఠశాల  విద్యార్థులతో ఎక్కువగా పాడిస్తుంటాను. సాధారణంగా పిల్లలతో స్టేజి మీద పాటలు పాడించటమే కష్టం. అలాంటిది కరౌకే ట్రాక్‌లో పాడించాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. రెండురోజుల్లో ఎవరికైనా సులభంగా పాడడం నేర్పిస్తాను.
 
 సామాజిక సేవలో మీ పాత్ర  ?
 నా తల్లిదండ్రుల పేరిట ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ‘వలీహైదర్ మెమోరియల్’ పేరిట పేద కళాకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇప్పటివరకు రాష్టంలో వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది అంధులకు కరౌకేలో శిక్షణ ఇచ్చాను. హిందీ, తెలుగు భాషలలోని మంచి పాటలను నేను పాడి కరౌకే ట్రాక్‌లో సీడీలు చేశాను. వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నా. ఇప్పటికీ 20 వేలకు పైబడి పంపిణీ చేశాను. 
 
 హైదర్ సాధించిన అవార్డులు
 2002లో మిలీనియం అవార్డు. 2003లో లతామంగేష్కర్ అవార్డు. 2004 జూన్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మిలీనియం అవార్డు. 2005లో హైదరాబాద్ సమాజ సేవ సొసైటీ అవార్డు. 2013లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు.
 
 - కోన సుధాకర్ రెడ్డి
 
మరిన్ని వార్తలు