తిక్కన సినిమా శ్రీశ్రీ తీస్తే!

2 Dec, 2019 01:03 IST|Sakshi

అలనాటి వ్యాసం

1969 ఫిబ్రవరి 16. నెల్లూరు టౌన్‌హాల్లో వర్ధమాన సమాజం ఏర్పాటు చేసిన తిక్కన జయంతి సభ. ‘మహాత్మ కథ’ కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరిని గాంధీజీ శతజయంతి సందర్భంగా తిక్కవరపు రామిరెడ్డి సన్మానిస్తున్నారు. ఈ సభాధ్యక్షులెవరనుకున్నారు? విప్లవ కవి శ్రీశ్రీ! విచిత్రంగా లేదూ!

నెల్లూరు పత్రికలు శ్రీశ్రీ ఉపన్యాసాన్ని వివరంగా రిపోర్టు చేశాయి. తిక్కనను ప్రజాకవిగా శ్రీశ్రీ అభివర్ణించాడు. ప్రజాకవి కనుకనే ‘ఆంధ్రావళి మొదముం బొరయ’ మహాభారతం రచించానని తిక్కన అనగలిగాడన్నాడు. నన్నయ శైలితో భారతానువాదం ఆరంభించి క్రమంగా తిక్కన శైలిలాగా పరిణమించేటట్లు ఎర్రన భారతశేషం పూరించాడని, ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్‌ ఫీట్‌ అని శ్రీశ్రీ మెచ్చుకొన్నాడు.

తిక్కన అనువాదంలో 75 శాతం తెలుగు పదాలే వాడాడని, నన్నయ అర్జునుణ్ణి ఇంద్రనందనుడు, శ్వేతవాహనుడు, సక్రందన నందనుడు అని పేర్కొంటే, తిక్కన కవ్వడి, వివ్వచ్చుడు, కర్రి వంటి తెలుగు పదాల్లో చెప్పాడని శ్రీశ్రీ అన్నాడు. పద్మవ్యూహాన్ని ‘తమ్మిమొగ్గరం’ అని తిక్కన మాత్రమే అనగలడని, తిక్కన వాడిన తెలుగు పదాలు పరిశీలిస్తే ఎంత క్లిష్టమైన భావాన్నయినా తెలుగులో చెప్పవచ్చని, తెలుగు పదసంపద గొప్పదని శ్రీశ్రీ అన్నాడు.

నన్నయది పొయెట్రీ దట్‌ ఈజ్‌ సంగ్‌ అని, తిక్కన్నది పొయిట్రీ దట్‌ ఈజ్‌ స్పోకెన్‌ అని శ్రీశ్రీ వర్ణించాడు. తిక్కనలో నన్నయ కవితలోని చమత్కృతులు, తళుకుబెళుకులు ఉండవు. తిక్కన కవిత్వంలో డ్రమెటిక్‌ ఇన్‌సైట్‌ ఉంటుంది. కృష్ణుడు రాయబారం వెళ్లే సమయంలో తన తలవెంట్రుకలను చూపి, ‘‘ఇవి దుస్ససేను వ్రేళ్ళం/ దవిలి సగము త్రెవ్విపోయి తక్కినయవి’’ అని ద్రౌపది అంటుంది.

ఈ ఘట్టంలో తిక్కన ఎక్స్‌ట్రీమ్‌ క్లోజప్‌లో ఆమె కురులను చూపుతాడు. విరుద్ధభావాల సంఘర్షణ లోంచి వెలువడిన ఒక సమన్వయభావాన్ని తిక్కన తన కవిత్వంలో ప్రతిపాదించాడని శ్రీశ్రీ భావించాడు. హరిహరుల నిద్దరినీ కలిపి ఒక కాంపోజిట్‌ ఇమేజ్‌గా– హరిహరనాథ స్వామిగా రూపకల్పన చేయడంలో ఈ ప్రక్రియ తనకు గోచరించిందన్నాడు.

శ్రీశ్రీ తన ఉపన్యాసంలో తిక్కన జీవితం మీద తాను రాసిన స్క్రీన్‌ప్లే గురించి వివరించాడు. మనుమసిద్ధి మహారాజు భారతానువాదం పూర్తి చేయించాలనే దీక్షతో, నన్నయ పద్యాన్ని ఒక తాటాకు మీద రాయించి, అటువంటి పద్యమే ఇంకొకటి రాయమని కవులందరికీ పంపాడట. వెలయాలి ఇంట్లో ఊయల మీద కూర్చొని విలాసంగా తాంబూల చర్వణం చేస్తున్న తిక్కన వద్దకు ఈ తాళపత్రాన్ని తెచ్చి చూపించారట.

తిక్కన పద్యం రాసి పంపకుండా ఆ తాళపత్రం మీద తాంబూలం వేసుకొన్న నోటితో ఉమ్మి వేశాడట! భటులు ఆ పత్రాన్ని మనుమసిద్ధికి చూపించారు. ఆగ్రహంతో ఉన్నపళంగా తిక్కనను పిలిపించి సంజాయిషీ అడిగాడు రాజు. నన్నయ్య ఉచ్చిష్టంతోనే కదా భారతం పూర్తిచెయ్యగలిగేది, నేను తాంబూల రాగంతో కాస్త మెరుగులు దిద్దగలనని సూచించాను తప్ప, అవమానించడానికి కాదని తిక్కన అన్నట్లు శ్రీశ్రీ ఆ దృశ్యాన్ని రాశాడట. తిక్కన సంసార జీవితాన్ని త్యాగం చేసి జీవితాన్ని భారతానువాదానికే వినియోగించినట్లు, వృద్ధాప్యంలో భారతం పూర్తయిన తర్వాత, ఆ రాతప్రతిని భార్య చేతిలో పెట్టి ‘దీన్ని నీ బిడ్డగా భావించు’ అని తిక్కన అనివుంటాడని శ్రీశ్రీ ఊహ చేశాడు.


-కాళిదాసు పురుషోత్తం (సౌజన్యం: పెన్న ముచ్చట్లు)

మరిన్ని వార్తలు