‘కల్పవృక్షం’ లాంటి కథాసంపుటి

19 Nov, 2017 00:15 IST|Sakshi

సత్‌గ్రంథం

వాల్మీకి రామాయణాన్ని ఎన్నో భాషలలో అనువదించారు.  కథల రూపంలో చెప్పారు. గేయరూపంలో గానం చేశారు. ప్రశ్నోత్తరాలుగా పొందుపరిచారు. ఎవరు, ఎన్నివిధాలుగా చెప్పినా, అందులో ప్రతిసారీ కొత్తదనం కనిపిస్తుంది. కారణం రామాయణానికున్న రమ్యత. అలాంటి రామాయణ గాథను కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’గా కొన్ని తరాలవారు చదువుకుని ఆనందించేంతటి అద్భుతమైన రచన చేశారు. ఆ ‘జ్ఞానపీఠం’ బాటలోనే నడుస్తున్నారు ఆయన సోదరుని కుమారుడు విశ్వనాథ శోభనాద్రి. దాదాపు రెండు దశాబ్దాలుగా ‘నమామి వేదమాతరం’ అనే మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తూ, ఆ అనుభవంతో రామాయణ గాథలను, అందలి రమణీయమైన ఘట్టాలను సులభ శైలిలో సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా చక్కటి కథలుగా మలిచి ‘కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు’ అనే పుస్తకరూపంలో అందించారు విశ్వనాథ.

అందమైన హార్డ్‌బౌండ్‌ ముద్రణలో, ఆకట్టుకునే చిత్రాలతో 180 కథలున్న ఈ ఉద్గ్రంథం ఎంతో బాగుందని ముందుమాటలో ఎందరో పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు పేర్కొన్నారు. చెరుకు తీపి గురించి వినడం కన్నా, రుచి చూస్తే కానీ తెలియనట్టే, ఈ గ్రంథాన్ని స్వయంగా చదువుకుంటే కానీ, ఆస్వాదించలేం. పెద్దలు పిల్లలకు కథలుగా చెప్పుకోవడానికి, బహుమతిగా ఇచ్చుకోవడానికి ఉపకరించే ఈ పుస్తకం పారాయణకూ పనికొస్తుంది.
కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు
రచన: విశ్వనాథ శోభనాద్రి; పుటలు: 330; వెల రూ. 600
ప్రతులకు: విశ్వనాథ శోభనాద్రి చారిటబుల్‌ ట్రస్ట్‌
16–2–836/బి/3, ఎల్‌.ఐ.సి కాలనీ, సైదాబాద్,
హైదరాబాద్‌–59, ఫోన్‌:9440666669
– డి.వి.ఆర్‌

మరిన్ని వార్తలు