కమాన్ కదలండి

2 May, 2015 00:07 IST|Sakshi
కమాన్ కదలండి

మనలో ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో నిస్పృహకు లోనవుతుంది. ఒంటరిగా ఫీలవుతాం. సమాజంతో వేరుగా ఉండిపోతాం. సంతోషమూ, విచారమూ లేని బండరాయిగా  మారిపోతాం. జీవితం అసలు కదలినట్లే ఉండదు. అప్పుడేం చెయ్యాలి?
 
 ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి

ఉదయాన్నే లేస్తారు. పనికి వెళ్తారు. తిరిగి ఇంటికి వస్తారు. భోం చేస్తారు. నిద్రకు ఉపక్రమిస్తారు. ఇన్ని పనులను క్రమబద్ధంగా చేస్తూ ఉన్నప్పటికి కూడా జీవితం కదలకుండా అలా నిశ్చలం అయిపోయినట్లు అనిపిస్తుంది. ఈ చట్రం నుంచి బయట పడితేకానీ జీవితం మళ్లీ కదలినట్లు ఉండదు. అందుకోసం రోజూ చేస్తున్న పనులను కొద్ది కొద్దిగా బ్రేక్ చేసుకుని, ఆ బ్రేక్‌లో కొత్త పని చేపట్టండి. ఏదో ఒక పని. పిల్లలకి క్లాస్ చెబుతారా? సమాజ సేవే చేస్తారా? లేదా కొత్తవాళ్లను కలుసుకుంటారా? ఏదైనా కొత్తగా. ఈ కొత్త ప్రయాణంలో మీతో మీరు ప్రేమలో పడిపోతారు. జీవితంలోకి వెలుగురేఖ ప్రసరిస్తుంది. జీవితంలోని నిస్పృహ వదిలిపోతుంది.
 
ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకోండి

మీ గురించి మీరు అత్యంత శక్తిమంతులని, అన్నీ చెయ్యగలనని అనుకోవచ్చు. కానీ ఎవరూ కూడా సొంతంగా అన్ని పనులూ చేసుకోలేరు. అందుకే సలహాలు తీసుకోండి. సహాయం అందుకోండి. మీ పనిని షేర్ చేసుకోనివ్వండి. అన్ని పనులూ మీరే చేసుకోవడం మీకు గొప్పగా అనిపించవచ్చు. కానీ తొందరలోనే మీరు ఆ స్థితి నుంచి నిస్పృహలోకి జారిపోతారు. మీ పనిలో మీకు వైఫల్యాలు ఎదురైనప్పుడు మీ మీద మీకు నమ్మకం తగ్గడం ఎంత వాస్తవమో, చిన్న చిన్న సహకారాలు పొందడం ద్వారా ఆ అపనమ్మకం నుంచి బయట పడి పునరుత్తేజితులు కావడం అంతే వాస్తవం.
 
ఎక్సర్‌సైజ్ చెయ్యండి


ఈ మాట ఇప్పటికే మీరు అనేకసార్లు విని ఉంటారు. ఎన్నిసార్లు విన్నా, ఎక్సర్‌సైజ్ తప్పనిసరి అనడానికి అన్ని కారణాలు ఉంటాయి. కానీ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలన్నది మీ ప్రశ్న కావచ్చు. ఆ ప్రశ్నకు జవాబుగా ఆ రోజు నుండే అనే నిర్ణయానికి రండి. ఎక్సర్‌సైజ్ ఏదైనా కావచ్చు. వాకింగ్, జాగింగ్, సిటప్స్. పులప్స్.. ఇలా ఏదైనా. వీటి వల్ల శరీరం అలసిపోయిన కొద్దీ మెదడు పదునెక్కుతుంది. స్వల్పమైన వ్యాయామాలే మీలో పెద్ద స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి తగ్గిస్తాయి. చక్కగా నిద్రపట్టిస్తాయి. పనులను చకచక చేయడానికి అవసరమైన కొత్త శక్తి మీలో చొరబడుతుంది. ముందైతే రోజుకి కనీసం 25 నిమిషాలైనా నడవడం ప్రారంభించండి.
 
మార్పులు చేసుకోండి... చిన్నవైనా, పెద్దవైనా...

జీవితం జడపదార్థంగా మారినట్లు అనిపించడానికి కారణాలు అనేకం ఉంటాయి. మీకు నచ్చని వ్యక్తి, మీరు నచ్చని ఉద్యోగం మీ జీవితంలోని సంతోషాన్ని తోడిపారేస్తాయి. నీరసం, నిస్సత్తువగా ఆవహించేలా చేస్తాయి. అందుకే ముందుగా మీరు... మీ ఉత్సాహాన్ని హరించి వేస్తున్న అంశాల గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించుకోండి. ఒక్కొక్క సమస్యనూ విశ్లేషించుకోండి. మీకు మీ ఉద్యోగం నచ్చలేదనుకున్నాం. అంతమాత్రాన ఉద్యోగం మానేయాల్సిన పనిలేదు. ఆఫీసు సమయానికీ, వ్యక్తిగత సమయానికీ కొత్త సరిహద్దులను ఏర్పచుకోండి. ఈ మార్పు మీలోని అసంతృప్తిని దూరం చేస్తుంది. ఉద్యోగం పట్ల కలుగుతున్న విముఖత వల్ల మీరు నష్టపోకుండా జాగ్రత్తపరుస్తుంది. అలాగే మీకు ఒక మనిషి నచ్చలేదనుకుందాం. ఆ నచ్చని మనిషిలోని మంచి విషయాలను మాత్రమే మీరు స్వీకరించండి. దాంతో మొదట ఆ వ్యక్తిపై ద్వేషభావం తగ్గుతుంది. ద్వేషం లేనప్పుడు మీరా మనిషి గురించి ఆలోచించడం తగ్గుతుంది. అది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
వ్యత్యాసం గమనించండి

 అవును గమనించండి. తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. జీవితాన్ని కదిలించుకునే ప్రయత్నం మిమ్మల్ని క్రియాశీలం చేసిందని గమనించగానే మీ ఐదో అడుగు బలంగా, స్థిరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, వేగంగా పడుతుంది. అది మీ చుట్టూ ఉన్న వారి నిస్తేజాన్ని కూడా పోగొట్టి వారిలోనూ కదలిక రప్పిస్తుంది.
 
 

మరిన్ని వార్తలు