తోబుట్టువులకు తల్లీదండ్రీ

10 Jun, 2020 08:36 IST|Sakshi
నాయనమ్మ, ముగ్గురు చెల్లెళ్లతో జ్యోతి

వాళ్లు నలుగురు అక్కా చెల్లెళ్లు. లోకం తెలియకముందే తల్లీ, తండ్రీ కన్నుమూశారు. నాయనమ్మ పంచన చేరారు. కానీ, ఆమెకు వయసు మీద పడింది. బయటి పనులకు వెళ్లలేదు. ఇంట్లో ఐదుగురు బతకాలి. పెద్ద అమ్మాయి జ్యోతి ఆ కుటుంబానికి ఆసరా కావాలనుకుని ఐదోతరగతితో చదువు మానేసింది. నాయనమ్మ బీడీలు చుడుతుంటే తనూ నేర్చుకుంది. కూలిపనులకు వెళుతూ ఇంటికి పెద్ద దిక్కైంది. ముగ్గురు చెల్లెళ్ల పెంపకం బాధ్యతను భుజాన వేసుకుంది. ముగ్గుర్నీ చదివించి, పెళ్లిళ్లు చేసి అత్తారిళ్లకు పంపింది. నాయనమ్మను పసిపాపల చూసుకుంటోంది. కష్టాలు ఉన్నాయని కలవరపడకుండా కుటుంబానికి చుక్కానిలా మారిన జ్యోతి అందరి అభినందనలు అందుకుంటోంది.

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన బ్యాగరి బుచ్చి రాజయ్య, భారతి దంపతులకు జ్యోతి, లావణ్య, రాజేశ్వరీ, మమత.. నలుగురు కూతుళ్లు. భార్యా, భర్తలిద్దరూ కూలీనాలీ చేసుకుని బతికేవారు. పాతికేళ్ల్ల కిందట రాజయ్య, భారతి అనారోగ్యంతో చనిపోయారు. అప్పుడు ఆ నలుగురు పిల్లలకు నాయనమ్మే దిక్కైంది. తను కూలీనాలీ చేసి నాలుగేళ్లు పిల్లల్ని సాకింది. తరువాత పెద్ద అమ్మాయి జ్యోతి ఇంటి బాధ్యతలు భుజానేసుకుంది.

కోరుకున్న జీవితాన్నిచ్చి...
పెద్ద చెల్లెలు లావణ్యను పదోతరగతి వరకు చదివించింది జ్యోతి. తరువాత ఏఎన్‌ఎం కోర్సు చేయించి, పెళ్లి చేసింది. ఆమె భర్త హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. లావణ్య కూడా అదే హాస్పిటల్‌లో పనిచేస్తోంది. రెండో చెల్లెలు రాజేశ్వరీ ఎమ్మెస్సీ చదివింది. నిజామాబాద్‌కు చెందిన ఇంజినీరింగు గ్రాడ్యుయేట్‌తో పెళ్లి చేసింది. మూడో చెల్లెలు మమత డిగ్రీ చదివింది. ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఆమెకు కూడా శాబ్దిపూర్‌కు చెందిన యువకుడితో పెళ్లి జరిపించింది. ముగ్గురు చెల్లెళ్లు, వాళ్ల భర్తలతో కలిసి సంతోషంగా ఉన్నారు.

జ్యోతి మాత్రం పెళ్లి లేకుండా ఇంతకాలం చెల్లెళ్ల చదువులు, పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతోంది. కస్తూర్బా స్కూల్లో వంట పనికి వెళ్లిన జ్యోతి పొగ కారణంగా ఊపిరితిత్తులకు సమస్య రావడంతో అక్కడ పని మానేసింది. కొన్నాళ్లు కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేసి రైతుగా మారింది. పెట్టుబడే తప్ప రాబడి లేకపోవడంతో ఆ పని మానుకుంది. ఇప్పుడు ఇంటి దగ్గరే బీడీలు చుడుతూ, కూలీ పనులకు వెళుతోంది. 

బీడీ ఆకు కత్తిరిస్తున్న జ్యోతి

నాయనమ్మ సేవలో...
వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మ ఆలనాపాలనా జ్యోతి చూసుకుంటోంది. ఉదయాన్నే ఇంటి పని, వంట పనులు ముగించుకుని నాయనమ్మ అవసరాలు చూసుకొని సద్ది గట్టుకుని కూలీ పనులకు వెళుతోంది. ఉపాధి హామీ పనులు నడిచినన్ని రోజులు ఆ పనికి వెళుతున్న జ్యోతి ఇంటికి వచ్చిన తరువాత బీడీలు చుడుతోంది. చెల్లెళ్ళ పెళ్లిళ్లు అయ్యే దాకా తాను చేసుకోనని చెప్పిన జ్యోతి, ఇప్పుడు తాను పెళ్లి చేసుకుంటే నాయనమ్మ అనా«థ అవుతుందని అంటోంది. ‘చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోసింది మా జ్యోతమ్మ’ అని మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది నాయనమ్మ.

తీరని అప్పులు
జ్యోతి తన చెల్లెళ్ల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు ఆమెకు భారంగా మారాయి. తండ్రి పేరిట ఉన్న మూడు ఎకరాల భూమికి పాసుపుస్తకం వచ్చినా అది చేతికి వచ్చే జాడే కనపడటం లేదు. ఎనిమిదేళ్లుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయింది. ఉన్న అప్పులే ఇబ్బంది పెడుతుంటే ఈ భూమి సమస్య మరింత కష్టంగా మారింది అంటోంది జ్యోతి. ‘నాయనమ్మకు వచ్చే పెన్షన్‌తోపాటు కూలి ద్వారా వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. అప్పులు తీరే మార్గమే దొరకడం లేదు. భూమి సమస్య ఓ కొలిక్కి వస్తే మా కుటుంబం ఓ గాడిన పడుతుందని నా ఆశ’ అంటోంది జ్యోతి. 
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

ఊహ తెలియకముందు నుంచే మా అక్క మాకు అమ్మానాన్న అయ్యింది. నాయనమ్మ తప్ప మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మా అక్క మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. మేం ఎంత చదువుకుంటే అంత చదివిస్తానని చెప్పేది మా అక్క. మా చదువులు, పెళ్లిళ్ల కోసం చాలా కష్టపడింది. పెళ్లి చేసుకోమని మేము అక్కను అడిగితే ఒప్పుకోవడం లేదు. మాకోసం చేసిన అప్పులు ఉద్యోగాలు చేస్తూ మేం తీరుస్తాం అని చెబితే ‘ఇప్పుడిప్పుడే మీరు కుదరుకుంటున్నరు. ఇది నేను తీసుకున్న బాధ్యత. నేనే తీర్చాలి. మీ జీవితాలు బాగుండేలా మీరు చూసుకోండి. అదే నాక్కావాల్సింది’ అంటుంది. మా అక్క త్యాగం చాలా గొప్పది.  
– లావణ్య, రాజేశ్వరి, మమత (జ్యోతి చెల్లెళ్లు)

మరిన్ని వార్తలు