నాటి కనటా.. నేటి కెనడా!

27 Sep, 2015 23:21 IST|Sakshi
నాటి కనటా.. నేటి కెనడా!

పేరులో నేముంది
 

ఫ్రెంచి అన్వేషకుడు జాక్విస్ కార్టియర్ సెయింట్ లారెన్స్ నది మీద ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో అందంగా, ప్రకృతి రమణీయతతో ఉన్న ప్రదేశం కనపడిందతనికి. పక్కనున్న వారిని ఇదేం ఊరని అడిగాడు. వారు అది ‘కనటా’ వెళ్లే మార్గమని చెప్పారు. నదీ ప్రవాహపు హోరులో జాక్విస్‌కి అది కెనడా అని వినిపించింది. దాంతో ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక అతను తన పుస్తకంలో దానిని కెనడా అని రాసుకున్నాడు. కాలక్రమేణా అది కెనడాగా ప్రసిద్ధికెక్కింది. మరో కథ ఏమిటంటే...స్పెయిన్ దేశస్థులు కొందరు తమ దేశాన్ని విడిచి, మరికొంత సంపన్న ప్రాంతానికి వలస వెళదామని వెతుకుతూ వెళుతున్నారు.

వారు అలా చాలాదూరం ప్రయాణించి, ఓ చోటికి చేరారు. అయితే ఆ ప్రదేశం తమ దేశం కన్నా డబ్బున్న ప్రదేశంగా ఏమీ కనిపించలేదు. దాంతో వారు దాన్ని ‘అక నాడ’ అని, క నడా అనీ తమలో తాము చెప్పుకున్నారు. అక నాడ అంటే స్పానిష్ భాషలో ఏమీ లేదు అని అర్థం. క నడా అన్నా అదే అర్థం ధ్వనిస్తుంది. మొదట్లో దానిని ఎగువ కెనడా, దిగువ కెనడా అని చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆ రెండు ప్రాంతాలూ కలిసి కాలక్రమేణా కెనడా అనే పేరు స్థిరపడింది.
 
 

మరిన్ని వార్తలు