దశను మార్చనున్న ‘ఇంగ్లిష్‌’ హామీ!

8 Apr, 2019 00:16 IST|Sakshi

విశ్లేషణ

ప్రైవేట్‌ విద్యా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్న నారాయణ, శ్రీచైతన్య అధినేతలు టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వాళ్ల దోపిడీని నివారించాలంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం ఒక్కటే మార్గం. గ్రామాల్లోని ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలు తమ పిల్లలను నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు పంపలేకపోవడంతో వెనుకబడిపోతున్నారు. 2006లో 64వేల ప్రభుత్వ పాఠశాలల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అనే హామీ జగన్‌ను అమరావతిలోని ముఖ్యమంత్రి పీఠంపైకి నేరుగా చేరుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడి యం ప్రవేశపెడతామంటూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టించటం ఖాయం. అదేసమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామని కూడా జగన్‌ తన పథకాన్ని వివరించారు. పైగా తమ పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులందరికీ రూ.15,000లను విద్యా సహాయకంగా అందిస్తామని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంపై వైఎస్‌ జగన్‌ ప్రకటన ఎంతో ఆహ్వానించదగిన విషయం.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించేవారు తెలుగు దేశం పార్టీలో చాలామంది ఉన్నారని తెలిసిందే. ప్రైవేట్‌ విద్యా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్న నారా యణ, శ్రీచైతన్య అధినేతలు టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వాళ్ల దోపిడీని నివారించాలంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం ఒక్కటే మార్గం. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడతాం అనే హామీ ఇవ్వడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాష బోధించే విధానం వల్ల భాషా సమానత్వం, పోటీతత్వం కొరవడుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ కారణంగా ప్రపంచ స్థాయికి ఎదగడానికి యువ తకు ఉండే అవకాశాలను పాలకవర్గాలు నిరాకరించ డమే ఇందులో కీలక అంశం. వీళ్లు ఉద్దేశపూర్వకం గానే ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో బోధనను కొనసాగించారు. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ప్రపంచంతోనూ, దేశంతోనూ ఏ మాత్రం సంబంధం లేని హిందీ భాషను హిందీయేతర ప్రాంతాల్లోని గ్రామీణ విద్యా ర్థులపై బలవంతంగా రుద్దారు. కేవలం తమిళనాడు మాత్రమే ఈ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించింది. గ్రామాల్లోని పిల్లలు సైతం తమిళంతో పాటు ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వాళ్లు యోచించారు. అందుకే దేశీయ, ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో తమిళుల ప్రాబల్యం కొనసాగుతోంది.

గ్రామాల్లోని ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలు తమ పిల్లలను నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల లకు పంపలేకపోవడంతో వెనుకబడిపోతున్నారు. మంచి ఇంగ్లిష్‌ మాట్లాడగలగడం, రాయడంతో పాటు లెక్కలు, సైన్స్‌లో ప్రాథమిక అవగాహన ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అంది పుచ్చుకోగలుగుతారని పాలకులకు తెలియని విష యం కాదు. అయితే, తమ పిల్లలకు ఊరి యువత గట్టిపోటీనివ్వకుండా తప్పించేందుకే అలా చేశారు.సమాన విద్య, విషయాలతో కూడిన పాఠశాల విద్యపై గత పాతికేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ, స్వార్థ ప్రయో జనాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వీటిని ఎదుర్కొని 2006లో 64వేల ప్రభుత్వ పాఠశాలల్లో వై.ఎస్‌.రాజ శేఖరరెడ్డి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. పలు స్వార్థపర శక్తులు దానిని అడ్డుకోవాలని ప్రయత్నిం చాయి. కానీ, ఆయన దాన్ని సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది గ్రామీణ విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియం ఎంపిక చేసుకున్నారు. ఆంగ్లభాషా బోధన ప్రామాణిక స్థాయిలో లేకపోయినప్పటికీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం స్థాయి పెరిగింది. అది వైఎస్‌ఆర్‌ తీసు కున్న సాహసోపేత చర్య.

తర్వాత ఆంధ్ర, తెలంగాణలో రెసిడెన్షియల్, మోడల్‌ పాఠశాలలు పరిస్థితిని మెరుగుపరిచాయి. కానీ, ఆ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను 6వ తర గతి నుంచి మాత్రమే బోధిస్తున్నారు. దీన్ని అధిగ మించి గ్రామీణ ప్రాథమిక పాఠశాలలను కలుపు కుంటూ తెలుగు, ఇంగ్లిష్‌తో కూడిన ద్విభాషా బోధ నను కిండర్‌ గార్డెన్‌ నుంచే ప్రారంభించాల్సి ఉంది. గ్రామాల్లో మూడు అంచెల పాఠశాల విధానం ప్రవేశ పెడితే మంచిది. ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి 4 వరకు, 5 నుంచి 8 వరకు మరో పాఠశాల, 9 నుంచి 12 వరకు హైస్కూల్‌గా విభజించాలి. ఇంట ర్మీడియట్‌ను ఎత్తివేయాలి. నారాయణ తరహా స్కూళ్లు, కాలేజీలు, శిక్షణా కేంద్రాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తొలగించాలి. మన యువత లోని సృజనాత్మకతను అవి నాశనం చేస్తున్నాయి.గ్రామాల్లోని ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రు లతో కలిసి జీవిస్తూ, వారి పనిలోనూ, కష్టసుఖా ల్లోనూ పాలుపంచుకుంటూ పాఠశాల విద్య పూర్తి చేయగలిగితే కొంతకాలం తర్వాత రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఎత్తివేయవచ్చు. ఇంటా, బయటా పని చేసే ఆ విద్యార్థికి శ్రమపట్ల గౌరవం ఏర్పడుతుంది. ఇంగ్లిష్, శ్రమపట్ల గౌరవం మన విద్యా వ్యవస్థలో విప్లవాన్ని తీసుకువస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పాలక ప్రతిపక్షాలు.. వివిధ వర్గాల వారికి అనేక ఆర్థిక పథకాలను హామీ ఇస్తు న్నాయి. అవి ప్రజలు ఇప్పుడు జీవించడానికీ, కొంత వరకు జీవన పరిస్థితులు మెరుగుపడటానికి ఉప యోగపడతాయి. కానీ, సమాన భాష, విషయాలు, నాణ్యమైన ఇంగ్లిష్‌ విద్య చాలా అసమానతలను తొలగిస్తాయి. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో యువత ప్రపంచ వ్యాప్తంగా తమ అవకాశాలను వెతుక్కో గలుగుతారు.
జనాభా రీత్యా తక్కువే అయినప్పటికీ కొంత మంది యూరోపియన్లు అమెరికా, కెనడా, ఆస్ట్రే లియా, ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లి సరికొత్త నాగరికతను నిర్మించగా లేనిది, భారతీయులు అదే పని భవిష్యత్‌లో ఎందుకు చేయకూడదు? వలసల నేవి పెరుగుతూనే ఉన్నాయిగానీ, తగ్గడం లేదు. తమ పిల్లలను అమెరికా, యూరోపియన్‌ యూనివ ర్సిటీల్లో చదివించి, తిరిగి ఇక్కడి రాజకీయాల్లోకి తీసుకువస్తున్న నేతలు ఎంతోమంది ఉన్నారు. అటు వంటప్పుడు గ్రామీణ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిష్‌ విద్యను అభ్యసిం చిన గ్రామీణ యువత గొప్ప నాయకులు ఎందుకు కాకూడదు?

సాధారణ ఎన్నికల్లో ఇది ఒక అంశమైతే అది ప్రతి ఇంటికీ చేరుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు దాని గురించి చర్చించుకుంటారు. తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు పంపలేక నూన్యతా భావానికి గురవుతున్న తల్లిదండ్రులంతా ఇంగ్లిష్‌ మీడియంలో పాఠశాల విద్యపై హామీ ఇచ్చిన పార్టీకి ఓటు వేయడమే కాదు, మంచి భవిష్యత్‌ను దర్శి స్తారు. గ్రామీణ నేపథ్యంలో నాణ్యమైన పాఠశాల విద్యను పొందిన విద్యార్థి విచక్షణా శక్తిని చక్కగా వినియోగిస్తాడు. ప్రకృతితో, జీవితంలో ఎదురయ్యే రోజువారీ సమస్యలతో పోరాడగలుగుతాడు. చదు వుకోవడం కోసం పట్నం వెళ్లేవారి సంఖ్య తగ్గు తుంది. దీంతో సరైన సామర్థ్యంలేని పాఠశాలలకు తమ పిల్లలను పంపుతున్న పేద రైతులు, కూలీలకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభిస్తుంది.

ప్రస్తుతం కట్టుబానిసల్లా ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో పని చేస్తున్న ఉపా«ధ్యాయు లకు ఇంగ్లిష్‌ బోధనలో ప్రావీణ్యం ఉండటం వలన ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. జగన్‌ ఇచ్చిన ఈ హామీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం మీద అనేక ప్రభావాలు చూపుతుంది. ఈ హామీ గనుక అమలైతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే తలమానిక మవుతుంది.అయితే, ఈ సందేశాన్ని పార్టీ ప్రతీ గ్రామీణ కుటుంబానికీ చేర్చాలి. ఈ ఒక్క హామీ జగన్‌ను అమరావతిలోని ముఖ్యమంత్రి పీఠంపైకి నేరుగా చేరుస్తుంది. నమూనా స్థాయిలోనే అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారానే ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి 2009లో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతి గ్రామంలోని, ప్రతి తల్లీ ఇంగ్లిష్‌ మీడియం గురించి కలలు కంటోంది. ఈ హామీ ఆ కలలను నెరవేరుస్తుంది.

కంచె ఐలయ్య
వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త,
సామాజిక కార్యకర్త, రచయిత

మరిన్ని వార్తలు