ఎవరు చెబితేనేమిటి?

30 Jul, 2019 12:27 IST|Sakshi

చెట్టు నీడ

కంచి పరమాచార్య జీవితంలో ఇదొక సంఘటన. ఆయన ఎక్కడికైనా వెళ్లాలంటే పల్లకిని ఉపయోగించేవారు. అలాగే  ఓమారు ఆయన పల్లకిలో వెళ్తూ వెళ్తూ ఓ చోట పల్లకిని ఆపించి అందులో నుంచే ప్రసంగిస్తుండగా ఒకతను ఆయనను విమర్శించాడు. ‘‘ఇతరులు నలుగురైదుగురు మోస్తుండగా దర్జాగా పల్లకిలో కూర్చుని ప్రయా ణం చేస్తుంటారు. ఈయన సాధువేంటీ? ఓ మనిషిని మరొక మనిషి మోయడం తగునా! ఇది ఆయనకు తెలీదా? సాధువు అనే అతను అన్ని సుఖాలనూ త్యజించాలి కదా. ఎంత హీనమైన తంతిది. మరొకరి భుజాలపై ప్రయాణం చేసే ఈయనను సాధువని ఎలా అనుకోవాలి? ఈ పెద్దమనిషి మనకు హితవచనాలూ సామాన్య ధర్మాలు చెప్పడమా! అసలీయనకు ఏమర్హత ఉంది.. ఛీఛీ..’’ అని అన్నాడు.

ఈ మాటలన్నీ పరమాచార్య చెవిన పడ్డాయి. మరుక్షణమే పరమాచార్య పల్లకిని నేల మీదకు దింపించి పల్లకిలోంచి ఇవతలకు వచ్చారు. ‘‘ఆయన చెప్పినదాంట్లో తప్పేముంది. సబబే కదా..’’ అని తన వెంట ఉన్నవారితో అన్నారు. అయితే పల్లకీ మోసిన వాళ్లు.. ‘‘ఎవరో ఏదో అన్నారని మీరిలా దిగడం మాకు బాధగా ఉంది. వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోకండి. మిమ్మల్ని మా భుజాలమీద తీసుకుపోవడం మా భాగ్యం’’ అన్నారు. అయినా పరమాచార్య తన మాట కొనసాగిస్తూ.. ‘‘ఆ మనిషి చెప్పింది నిజమే. సుఖాన్ని త్యజించని వారు సాధువెలా అవుతారు. నాకీ పల్లకి వద్దు. ఇక మీదట నేనెక్కడికి వెళ్లి నడచిపోతాను’’ అని ఓ గట్టి నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగానే ఎక్కడి వెళ్లినా ఆయన నడిచే వెళ్తుండేవారు. పరమాచార్య చివరి వరకూ ఈ నిర్ణయం నుంచి తప్పుకోలేదు.    – జగద్రేణు

మరిన్ని వార్తలు