వచ్చెయ్‌నా అమ్మా?

22 Jan, 2020 02:22 IST|Sakshi

ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాళ్లకు స్నేహితుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లో ఉంటుంది. శత్రువుల సంఖ్య క్యాలిక్యులేటర్‌తో లెక్కేయాల్సినన్ని నెంబర్‌లలో ఉంటుంది. కంగనా రనౌత్‌ గురించి మీకు తెలియందేముందీ..! ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డమే కాదు, తను ఉండాలనుకున్నట్లు ఉంటుంది. ఏ ఫీల్డులోనైనా పురుషులకు నచ్చని క్వాలిటీ ఇదే కదా.. ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గా ఉండటం! వెంటనే ఏదో ఒకటి అనేస్తారు. కంగన ఊరుకుంటుందా.. కంటికి కన్ను.. పంటికి పన్నులా.. తగిన సమాధానమే చెబుతుంది. ఇక అక్కడి నుంచి శత్రుత్వం మొదలు! ఈ మధ్య  కంగనను వాళ్ల అమ్మగారు ముంబై వచ్చినప్పుడు అడిగారు.

‘‘ఎందుకు తల్లీ.. నీకు అంతమంది శత్రువులు ఉన్నారు?’’ అని! ఆవిడ ఉండేది మనాలిలో (హిమాచల్‌ ప్రదేశ్‌). ఆ మాటకు కంగన నవ్వింది. ‘‘అమ్మా.. నీతో పాటు నేనిప్పుడు బట్టలు సర్దుకుని పర్మినెంట్‌గా ఉండిపోడానికి మనాలి వచ్చాననుకో.. అప్పుడు ఈ శత్రువులందరూ నాకు వెంటనే స్నేహితులైపోతారు’’ అని చెప్పింది. విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. సక్సెస్, శత్రువు.. తోబుట్టువులు అని కంగన చెప్పదలచుకున్నారు. కంగనకు ఉన్నట్లే మీకూ శత్రువులు ఉన్నారా.. అయితే ఆ శత్రువుల వెనుక మీరు సాధించిన విజయం ఉంటే ఉంటుంది చూసుకోండి. 

మరిన్ని వార్తలు