చేతిలో ఉంచండి

6 May, 2020 03:22 IST|Sakshi
బడిపిల్లల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రుల చేతిలో డబ్బులు పెడుతున్న కణ్ణగి మేడమ్‌

లాంగ్‌ బెల్‌ కొడితే స్కూల్‌ అయిపోతుంది. లాక్‌డౌన్‌లో ఇప్పుడు స్కూలే లేదు. కణ్ణగి మేడమ్‌ మనసు స్కూలు పిల్లల వైపు లాగుతోంది. పిల్లల్ని తప్ప బెల్‌ని చూసుకోలేదు తనెప్పుడూ. తిన్నారో లేదో! ఎలా ఉన్నారో ఏమో! అందరి తల్లిదండ్రులూ అంతంత మాత్రమే. పనులు ఉన్నప్పుడే పస్తులు తప్పనివాళ్లు. ఇప్పుడు పనులకీ పస్తులు పడి ఉంటారు. వాళ్లకేదైనా చేయాలనుకున్నారు.  ఇంటింటికీ తిరిగి వెయ్యి రూపాయలిచ్చి వెళ్లారు.

లాక్‌డౌన్‌లో పూట గడవని ఇళ్లు తుప్పాపురంలో చాలానే ఉండి ఉంటాయి. వాటిల్లో 41 ఇళ్లను మాత్రం ఎంపిక చేసుకోగలిగారు కణ్ణగి మేడమ్‌. అరియళూరు (తమిళనాడు) లోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌.ఎం. ఆమె. అరియళూరుకు దగ్గర్లోనే ఉంటుంది తుప్పాపురం. బడిలో చదువుతున్న మొత్తం 62 మంది పిల్లలూ ఆ 41 ఇళ్లవాళ్లే. అదే  బడిలో పరమేశ్వరీ వరదరాజన్‌ అనే టీచర్‌ పని చేస్తున్నారు. కణ్ణగి మేడమ్‌ అక్కడికి దగ్గర్లోని కొడంగుడి నుంచి, పరమేశ్వరి టీచర్‌ కళత్తూరు నుంచి రోజూ స్కూలుకు వచ్చి వెళుతుంటారు. కణ్ణగి మేడమ్‌ పన్నెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. పరమేశ్వరి టీచర్‌ రెండున్నరేళ్లుగా ఉన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి వారికి తెలుసు. అందుకే ఒక విద్యార్థి స్కూలుకు రాలేదంటే ఎందుకు రాలేదని కాకుండా, ఎందుకు రాలేకపోయారో తెలుసుకుంటారు.

ఇప్పుడు పిల్లలెవరూ రావడం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అడగడానికి ఎవరుంటారు? లాక్‌డౌన్‌ పరిస్థితుల్ని కళ్లారా చూస్తూ ఉన్నారు కనుక అడిగే అవసరం లేదు. పనుల్లేవు కాబట్టి పస్తులే. పిల్లల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నారు కణ్ణగి మేడమ్‌. ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని అనుకున్నారు. ‘‘ఇద్దరం కలిసి తుప్పాపురం వెళ్లి ఒక్కో ఇంటికి ఇచ్చి వద్దాం’’ అని పరమేశ్వరి టీచర్‌తో అంటే.. ‘‘మేడమ్‌.. నేను కూడా కొద్దిగా డబ్బు ఇస్తాను’’ అన్నారు. అక్కరలేదని సున్నితంగా చెప్పినా వినలేదామె. ఐదు వేలు తెచ్చిచ్చారు. మేడమ్‌వి 36 వేలు, టీచర్‌వి 5 వేలు కలిపి 41 వేలు నలభై ఒక్క ఇళ్లకూ వెళ్లి ‘చేతిలో ఉంచండి’ అని పంచిపెట్టారు. వాళ్లకు సహాయంగా పాఠశాల సిబ్బంది ఒకరిద్దరు ఉన్నారు.

డబ్బులు చేతిలో పెడుతున్నప్పుడు చూడాలి ఆ తల్లిదండ్రుల సంతోషం. పిల్లలకు చదువు చెప్పి జీవితాన్నిచ్చే టీచర్లు పెద్దలకు బతుకునివ్వడానికి ఇంటికొచ్చారు. దండం పెట్టి, కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆ పేదలు ఏం చెయ్యగలరు? ‘‘నాకూ ఈ ఆలోచన రాకపోయేది. మా అబ్బాయే అన్నాడు.. ‘మమ్మీ మీ స్కూల్లో అందరూ పేద పిల్లలే అన్నావు కదా.. వాళ్ల పేరెంట్స్‌కి ఈ లాక్‌డౌన్‌లో పనులు దొరకవు. మనం డబ్బులు ఇవ్వొచ్చు కదా’ అని. మంచి ఆలోచన అనిపించింది’’ అంటారు నవ్వుతూ కణ్ణగి మేడమ్‌. 

మరిన్ని వార్తలు