కన్యాదానం... కాదు సమంజసం

9 Mar, 2018 00:57 IST|Sakshi

సర్వహక్కులు

వస్తువును దానం చేస్తారు... కన్యను దానం చేయడం ఏమిటి? స్త్రీ ప్రాణం లేని వస్తువా దానం చేయడానికి? దానం పొందిన వస్తువు మీద సర్వహక్కులు దానగ్రహీతకు ఉంటాయి. స్త్రీ మీద సర్వహక్కులు ఆమెను పెళ్లాడిన పురుషుడు కలిగి ఉన్నాడని చెప్పడానికి సంకేతంగా ఈ తంతును వివాహంలో పెట్టారా? పెళ్లిలో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమే. పరస్పర సహకారంతో వారు  ముందుకు సాగాలి. కాని మగవాడిని అధికంగా స్త్రీని అల్పంగా చేసే కన్యాదానం పద్ధతి సరికాదని అంటున్నారు కలకత్తాకు చెందిన పురోహితురాలు నందిని భౌమిక్‌.

కలకత్తా నగరంలో నందిని భౌమిక్‌ పౌరోహిత్యం నిర్వహిస్తున్నారు. సాధారణంగా పౌరహిత్యం మగవారి చేతుల్లో ఉంటుంది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం తక్కువ. కాని నందిని భౌమిక్‌ పట్టుదలగా ఈ రంగంలోకి వచ్చారు. వృత్తిరీత్యా జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖ అధ్యాపకురాలుగా పని చేస్తున్న భౌమిక్‌ తనలాంటి భావాలు కలిగిన ఇద్దరు ముగ్గురు స్త్రీలతో కలిసి ఒక బృందంగా ఏర్పాటయ్యారు. రుమా రాయ్, సీమంతి బెనర్జీ, పైలమీ చక్రవర్తి... అనే ఈ ముగ్గురితో కలిసి నందిని నిర్వహించే పౌరహిత్య కార్యక్రమాలు ఫేమస్‌ అయ్యాయి. ఇటీవల ఈమె నిర్వహించిన ఒక వివాహం కూడా వార్తలకు ఎక్కింది.

కలకత్తాకు చెందిన అన్వితా జనార్దన్, అర్కా భట్టాచార్య  ఫిబ్రవరి 24న వివాహం చేసుకున్నారు. నందిని పౌరోహిత్యం వహించారు. వరుడు భట్టాచార్యకు నందిని బృందమంటే అపారమైన గౌరవం. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. తన పెళ్లి జరిపించమని కోరాడు. పెళ్లి జరిపిస్తున్న నందిని సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాలకు ఆంగ్ల, బెంగాలీ భాషలలో అర్థవివరణ ఇవ్వడం ఆహూతులను ఆకర్షించింది. అయితే ఈ పెళ్లిలో ‘కన్యాదానం’ తంతును తాను నిర్వహించబోవడం లేదని నందిని ప్రకటించి అందరినీ ఆలోచనలో పడేశారు.  పురాతన హిందూ గ్రంథాలలో కన్యాదానం లేకుండానే వివాహ క్రతువు నడిచేదని ముఖ్యంగా ఋగ్వేదం ఈ విషయం రూఢీ పరిచిందని ఆమె తెలిపారు. స్త్రీ వస్తువు కాదని ఇంత ఆధునిక సమాజంలో ఆమెను దానంగా ఇవ్వడం, దానంగా తీసుకోవడం వెనుకబాటుతనానికి చిహ్నం అని చెప్పారు.

వధువరులు నందిని మాటలకు సమ్మతించి కన్యాదానం తంతు లేకుండానే వివాహం చేసుకోవడం వార్తగా మారింది. స్త్రీలు పౌరహిత్యం చేయడం ఏమిటని కలకత్తాలో కొంతమంది నొసలు చిట్లించినా  ఆడవారు పౌరోహిత్యం వహించడం దోషం కాదని మరికొందరు పండితులు సమర్థన తెలిపారు.  మహిళల పౌరోహిత్యం గురించి వేదాలలో చాలా పెద్ద వేదాంత చర్చ జరిగిందని కూడా వారు తెలియచేశారు. మొత్తానికి నందిని బృందం స్త్రీల తరఫున ఆలోచిస్తూ స్త్రీలకు అపసవ్యమైన తంతులను పరిహరిస్తూ శుభకార్యాలు నిర్వర్తించడం అందరినీ ఆకర్షిస్తోంది. 

మరిన్ని వార్తలు