కరీమ్‌ భాయ్‌ చాయ్‌

16 Feb, 2019 00:31 IST|Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

ప్రతి ఊరిలోను ఎన్నో కొన్ని కాకా హోటళ్లు ఉంటాయి. అలాగే ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చే హోటళ్లు ప్రత్యేకంగా ఉంటాయి.  జగిత్యాల జిల్లా ధర్మపురిలోని అబ్దుల్‌ కుటుంబీకులకు చెందిన హోటల్స్‌కు అటువంటి ప్రత్యేకత ఉంది. అబ్దుల్‌ కరీం పేరు చెబితే పంటి కింద కరకరలాడే శబ్దాలు చేసే చేకోడీలు, ఉఫ్‌ ఉఫ్‌ అంటూ ఊదుకుంటూ తాగే టీలు గుర్తుకు వస్తాయి. ఆయన సోదరులైన అబ్దుల్‌ మునీర్‌ పేరుచెబితే నోటికి ఘాటుగా తగిలే మిరపకాయ బజ్జీల ఘుమఘుమలు అటుగా అడుగులు వేయిస్తాయి.

ప్రస్తుతం మునీర్, ఇక్బాల్‌ సోదరులు నడిపిన హోటల్స్‌ లేకపోయినా,  కరీమ్‌ చేగోడీ సెంటర్‌ మాత్రం దిగ్విజయంగా నడుస్తోంది. బియ్యప్పిండి, నువ్వులతో తయారు చేసే కరకరలాడే పల్చని గారెల వంటి పదార్థాన్ని కరీమ్‌ భాయ్‌ చేకోడీ అంటారు. ఈ వంటకం కరీమ్‌ ప్రత్యేకత. ధర్మపురి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం కరీమ్‌ని పలకరించకుండా ఉండలేరు. ఆయన చేకోడీల మహిమ అలాంటిది. గత 60 సంవత్సరాలుగా ధర్మపురిలో కరీమ్‌ చేకోడీలతోపాటు అటుకులు, గుడాలు కూడా అందిస్తున్నారు. ఆయన చేతిలో ఏం మహత్యం ఉందో గాని, అక్కడకు వచ్చినవారు ఆయన చేతి టీ తాగకుండా ఉండలేరు. 

కరీమ్‌ బ్రాండ్‌గా..!
ధర్మపురిలో చేకోడీలంటే కరీమ్‌ చేకోడీలే అనేంత గుర్తింపు పొందారు. కరీమ్‌ మరణించినా, హోటల్‌ రూపు మారిపోయినా కరీమ్‌ చేకోడీలంటే అందరూ గుర్తుపడతారు. ప్రస్తుతం ఆయన మనమడు (కూతురు జహీదా కుమారుడు) అస్లాం ఈ హోటల్‌ను నడుపుతున్నారు. టీ మినహా మిగతా తినుబండారాలను ఇప్పటికీ ఇంటి దగ్గర తయారుచేసి అంగడికి తీసుకువస్తారు. ఆరు దశాబ్దాలుగా ఈ హోటల్‌లో దొరికే చేకోడీలు అదే రుచితో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశవిదేశాలలో స్థిరపడ్డ ఈ పట్టణ వాసులు ఇప్పటికీ ధర్మపురి వస్తే కరీమ్‌ చేకోడీ తినకుండా వెళ్లరు. స్వస్థలానికి వచ్చిన వారందరికీ ఈ స్టాల్‌ ఒక మీటింగ్‌ పాయింట్‌. మిత్రులతో కలిసి బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, ఇక్కడ టీ తాగి, చేకోడీలు తిని వెళ్తారు. కరీం చేకోడీ, టీ, అటుకులు, గుడాలు తినేందుకు ఈ హోటల్‌కు రాకుండా వెనక్కు వెళ్లరు.

అదే తీరు...
ధర్మపురి నడిబొడ్డున ఉన్న ఈ హోటల్‌ను ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఒక బల్ల మీద 60 ఏళ్ల కిందట ప్రారంభించారు. 2007లో అబ్దుల్‌ కరీమ్‌ మరణించారు. దీంతో కరీమ్‌  రెండవ కుమారుడు నయీమ్‌... తన తండ్రి హోటల్‌ను కొనసాగించారు. నయీమ్‌ అనంతరం అస్లాం 12 సంవత్సరాలుగా ఈ హోటల్‌ను నడుపుతూ, సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. తమ వంటకాలలో దహీ వడను చేర్చారు అస్లాం.

ఇక్కడి దహీ వడ కొద్దిగా కారంగా ఉండటం వీరి ప్రత్యేకత.హోటల్‌పై థియేటర్‌ ప్రభావం...గతంలో థియేటర్‌ నడిచిన సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం నుంచి రాత్రి ఇలా రెండు పూటలు నడిచేది. ప్రస్తుతం కొద్దిగా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ అదే గుర్తింపు ధర్మపురి ప్రజల్లో ఉంది. ఈ హోటల్‌లో టీ కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచి స్వయంగా పాలు  తీసుకు వచ్చేవారు. ప్రస్తుతం ప్యాకెట్‌ పాలను కూడా వాడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అదే టీ పొడిని వాడటం వీరి ప్రత్యేకత. 

ఆనందంగా ఉంటుంది ...
మా క్యాంటీన్‌కి ఎక్కువగా యువకులు వçస్తూంటారు. ఈ గ్రామంలో చదువుకుని పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవులకు తల్లిదండ్రులను చూడటానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మా దగ్గరకు వచ్చి, మా చేకోడీ తిని, టీ తాగి వెళ్తూంటారు. ఒకరితో ఒకరు వారు పంచుకునే అనుభవాలను నేను ఆనందంగా వింటుంటాను. 

మరిన్ని వార్తలు