కూలీ ఎక్కడైతే అక్కడే స్కూలు

19 Oct, 2019 01:29 IST|Sakshi

భవన నిర్మాణ వలస కూలీలుగా వెళ్లడం అంటే ఉద్యోగంలో బదలీ మీద వెళ్లడం లాంటిది కాదు. పని తప్ప అక్కడ ఏమీ ఉండదు. పిల్లలకు బడి ఉండదు. చంటి పిల్లలకు అమ్మ ఒడి అందుబాటులో ఉండదు. భద్రంగా ఒక ఇల్లు ఉండదు. పెద్దవాళ్లు పని చేస్తున్నంత కాలం.. పని చేస్తున్నంత సేపూ.. పిల్లలు అలా గాలికి, ధూళికీ ఆ కొత్త   ప్రదేశంలో.. కొత్త వాతావరణంలో అలా తిరుగుతుండవలసిందే. అలాంటి వాళ్ల సంరక్షణ కోసం ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలకెత్తుకుంది.

ఇండియా అంటేనే నిర్మాణాలు జరిగే దేశం. ఈ మాట ఎక్కడో మీరు వినే ఉంటారు. వినడం ఏముందీ, నిత్యం ఎక్కడో ఒకచోట నిర్మాణాలు జరుగుతుండమూ మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఈ నిర్మాణాల దేశంలో బాలల భవిష్యత్తును నిర్మించే పనే.. భవన నిర్మాణాలంత భద్రంగా, వేగంగా జరగడం లేదన్నది నిజం! ఇందుకు పెద్దపెద్ద నిదర్శనాలు అక్కర్లేదు. భవన నిర్మాణాల కార్మికులను చూస్తే చాలు. ఉన్న ఊరిని వదిలేసి, పని వెతుక్కుంటూ పిల్లల్ని చంకనేసుకుని మహా నగరాలకు చేరుకుంటారు. ఆ కట్టడాలు పూర్తయ్యే వరకు.. ఆ కంకర, ఇటుకలు, సిమెంటు మధ్యనే వారి నివాసం. నిర్మాణానికి ఓ పక్కన గుడారం వేసుకుని ఎండకు, వానకు, చలికి ఆ గుడారాల్లోనే ఉంటారు.

పగలంతా సైట్‌లో రెక్కలు ముక్కలు చేసుకోవడం, రాత్రవగానే అక్కడే ఓ మూల పిల్లల్ని పక్కలో వేసుకుని తలదాచుకోవడం. మరి ఇటుకలు మోస్తున్నప్పుడు, తడి కంకర స్లాబు పైకి చేరుస్తున్నప్పుడు, బేల్దారి పర్యవేక్షణలో తల తిప్పేందుకైనా వీలు చిక్కని పనిలో ఉన్నప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఎక్కడుంటారు? అక్కడే ఒక చోట ఆడుకుంటూ ఉంటారు. వారు ఆడుకునే పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. ప్రమాదరహితంగా ఉండవు. అంతకన్నా కూడా.. భద్రంగా అసలే ఉండవు.

పని జరిగే చోటే క్రెచ్‌లు
బడిలో వదిలేస్తేనన్నా వాళ్ల గురించి చింత ఉండదు. కానీ ఈ కూలీలేమైనా ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చిన ఉద్యోగులా.. అక్కడి స్కూల్లో టీసీ తీసుకుని వచ్చి ఇక్కడిస్కూల్లో చేర్పించడానికి?! ఆంధ్రప్రదేశ్‌ అయినా, తెలంగాణ అయినా, ఇంకో ఇంకో రాష్ట్రం అయినా దేశం మొత్తమీద రాష్ట్ర రాజధానులకు వలస వచ్చి నెలలకు నెలలు ఉండిపోయే వలస కార్మికులు లక్షల సంఖ్యలోనే ఉంటారు. వారి పిల్లలందరూ నిర్మాణాలు పూర్తయ్యేవరకు తల్లిదండ్రుల కనుసన్నలలో ఆ చుట్టుపక్కలే గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా ఉండవలసిందే.

ఇప్పుడు ఇలాంటి పిల్లల కోసం కర్ణాటక కార్మిక శాఖ ప్రత్యేక శ్రద్ధను తీసుకుని తల్లి ఒడిలాంటి రక్షణను, శిక్షణను ఇవ్వబోతోంది! బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్, కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థలలో కాలం తీరిన కారణంగా షెడ్డులలో పడి ఉన్న బస్సులను నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి వాటిని పునరుద్ధరించి, మొబైల్‌ క్రెచ్‌లుగా తీర్చిదిద్దబోతోంది. ఆ క్రెచ్‌లు.. నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల దగ్గర వలస కార్మికుల పిల్లల కోసం నగరమంతటా తిరుగుతుంటాయి. క్రెచ్‌ల లోపల పిల్లలకు ఇష్టమైన తినుబండారాలు, పిల్లలకు నచ్చే ఆటబొమ్మలు, కథల పుస్తకాలు ఉంటాయి.

క్రెచ్‌ వాహనాలపై రంగు రంగుల పెయింటింగులతో పూల బొమ్మలు, పక్షుల బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉంటాయి. క్రెచ్‌ లోపల తాగేందుకు పరిశుభ్రమైన నీరు ఉంటుంది. తినుబండారాలు కూడా ఎదిగే వయసులో పిల్లలకు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి! ఈ ఏర్పాటు వల్ల పిల్లలు స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. వేళకు ఆహారం ఉంటుంది. బుద్ధీ వికసిస్తుంది. పిల్లలు తమ కళ్లెదుటే మంచి స్కూలు లాంటి పరిసరాలలో ఉన్నారన్న నిశ్చింత వారి తల్లిదండ్రులకూ ఉంటుంది.

దీపావళికి ముందే వెలుగు
క్రెచ్‌ల ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యులు జి.చంద్రశేఖర్‌ ఎంపీ నిధుల నుంచి ఇప్పటికే 25 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ డబ్బును బస్సులు కొనడానికి, వాటిని బాగు చేసుకోసుకుని పిల్లలకు ఇష్టమయ్యేలా మలచడానికి ఉపయోగిస్తారు. తర్వాత వాటిని ఎన్జీవో సంస్థలకు అప్పగిస్తారు. ప్రధానంగా బెంగళూరుతో పాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ క్రెచ్‌ల తయారీ కోసం కర్ణాటక ప్రధాన కార్యదర్శి టి.ఎం. విజయ భాస్కర్‌ తొలి విడతగా వంద బస్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. దీపావళి లోపు ఈ క్రెచ్‌లను ఆరంభించేందుకు అధికార యంత్రాంగం త్వర త్వరగా పనులు పూర్తి చేస్తోంది. పెద్దవాళ్లు వర్తమాన భారతాన్ని నిర్మిస్తుంటే.. వాళ్ల పిల్లల్ని భావితరం నిర్మాతలుగా మలిచేందుకు జరుగుతున్న ఈ కృషి ముందు.. ఎంత భారీ ప్రాజెక్టు నిర్మాణం అయినా కూడా చిన్నదిగానే కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు