ఇలాగైతే ఎలా?

19 Jun, 2020 08:20 IST|Sakshi

కర్ణాటక రాష్ట్రం హవేరీ పోలీసులు 69 మంది మీద ‘డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005, ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్, 1897’ చట్టాల కింద కేసులు పెట్టారు. వాళ్లందరూ ఒక ఊరి వాళ్లే. వారంతా ఊరి పండుగ చేసుకోవడానికి గుమిగూడారు. హవేరీ జిల్లా కర్జగి గ్రామంలో ఏటా జరిగే ‘కరా హున్నిమే’ ఉత్సవానికి యాభైవేల మంది హాజరవుతారు. ఎన్నోఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ‘ఎన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమైనప్పటికీ ఈ ఏడాది అన్ని ఏడాదుల వంటిది కాదు. ఉత్సవాలను పక్కన పెట్టండి’ అన్నారు పోలీసు అధికారులు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. దాంతో నిర్వహకులు ఇటు భక్తుల విశ్వాసాలకు, కోవిడ్‌ నిబంధనలకు మధ్య ఒక మధ్యే మార్గాన్ని ఆశ్రయించారు.

బ్రహ్మ లింగేశ్వరుడికి పూజలన్నీ యధావిధిగా జరుగుతాయి. ఎడ్లబండి ఊరేగింపు మాత్రం అతి కొద్దిమందితో నామమాత్రంగా నిర్వహించాలనుకున్నారు. ఆనవాయితీని కొనసాగించడం మాత్రమే జరుగుతుంది. వేడుక కాదు, కాబట్టి ఎవరూ పాల్గొనవద్దని ఊరంతటికీ చెప్పారు. విన్నట్లే తలూపారందరూ. గురువారం (11–06–2020) సాయంత్రం ఊరేగింపు మొదలవగానే జనం నేల ఈనినట్లు పోగయ్యారు. నిర్వహకుల మాట వినేవాళ్లు ఒక్కరూ లేరు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. భౌతిక దూరం పాటించలేదు, మాస్కులు ధరించనూ లేదు. మరీ ఈ రకంగా నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవడం కుదరదని తేల్చి చెప్పేశారు పోలీసులు. నిర్వాహక కమిటీసభ్యులతోపాటు మరికొందరి మీద కూడా కేసులు ఫైల్‌ అయ్యాయి. ఇది విశ్వాసాలకు విఘాతం కలిగించడం కాదు, సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే.

మరిన్ని వార్తలు