అచీవ్‌మెంట్‌

5 Jul, 2018 00:17 IST|Sakshi
అఫ్షాన్‌ ఆషిక్‌.. నాడు, అఫ్షాన్‌ ఆషిక్‌.. నేడు

ఫుట్‌బాల్‌

మీదకు వచ్చిపడే రాళ్లతోనే తెలివైనవాళ్లు తమ చుట్టూ దుర్భేద్యమైన గోడను నిర్మించుకుం టారని పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో చెబుతుంటారు. అఫ్షాన్‌లాంటి అమ్మాయిలు మాత్రం అవసరమైతే ఇంటిగోడకు ఉన్న రాళ్లను కూడా పెకిలించి చేతిలోకి తీసుకుంటారు! 


ఇండియా ఆడడం లేదని ఇండియాలో ఆడే స్టార్‌లే లేకుండా పోతారా?! అఫ్షాన్‌ ఆషిక్‌ ఇప్పుడు ఫుట్‌బాల్‌లో రైజింగ్‌ స్టార్‌. అయితే కశ్మీర్‌లో రాళ్లు విసిరిన అమ్మాయిగానే అఫ్షాన్‌ దేశమంతటికీ తెలుసు. చేత్తో ఫుట్‌బాల్‌ పట్టుకుని ఆటకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని అఫ్షాన్‌లా అస్సలు ఊహించుకోలేం. ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకుని, నీలిరంగు చుడీదార్‌లో పోలీసుల మీదకు రాళ్లు విసురుతున్న అఫ్షాన్‌ గత ఏడాదికాలంగా అల్లరిమూకలంతటికీ ఒక ఫొటో ఐడెంటిటీ! నిరుడు ఏప్రిల్లో ఓ ఉదయం ఫుట్‌బాల్‌ ట్రైనింగ్‌కి వెళుతున్న కొంతమంది అమ్మాయిల టీమ్‌ని పోలీసులు అడ్డగించినప్పుడు ఆ టీమ్‌లోనే ఉన్న అఫ్షాన్‌ పోలీసులకు ఎదురు తిరిగింది. తన స్నేహితురాలిని ఓ పోలీసు అధికారి అసభ్యంగా మాట్లాడి, ఆమె చెంపపై కొట్టి జీపులో వెళ్లిపోతున్నప్పుడు ఆపుకోలేని కోపంతో పోలీసులపై అఫ్షాన్‌ రాళ్లు విసిరింది. అది చూసి దేశం నివ్వెరపోయి చూసింది. అప్పటివరకు.. అమ్మాయిల చేతుల్లో తుపాకుల్ని మాత్రమే చూసిన దేశం.. రాళ్లు విసురుతున్న ఒక అమ్మాయిని మొదటిసారిగా చూసింది! డెబ్భై ఏళ్లుగా జమ్మూకశ్మీర్‌లో యువకులు పోలీసులపైకి రాళ్లు విసిరే దృశ్యాన్ని ఈ దేశం చూస్తూనే ఉంది. అయితే వారిలో ఒక యువతిని చూడ్డం అదే తొలిసారి. ఎవరీ అమ్మాయి అని ఇంటిలిజెన్స్‌ ఆరా తీసినప్పుడు.. రాష్ట్రంలో ఉన్న బెస్ట్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌లలో అఫ్షాన్‌ ఒకరన్న విషయం బయటపడింది.

ఫుట్‌బాల్‌ని కాలితో ఒడుపుగా తన్నడానికి శిక్షణ కావాలి. రాయిని గురి చూసి కొట్టడానికి కశ్మీర్‌లాంటి చోట్ల చిన్న కవ్వింపు ఎదురైతే చాలు. ‘రాయి విసిరిన అమ్మాయి’గా అఫ్షాన్‌ నలుగురి కళ్లలో పడగానే జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అఫ్షాన్‌ కోచింగ్‌ తీసుకుంటున్న స్పోర్ట్స్‌ అకాడమీలో చేరడానికి వచ్చే అమ్మాయిల సంఖ్య రెట్టింపయింది. బాలీవుడ్‌ నుంచి ఓ నిర్మాత వచ్చి, ‘అథియాశెట్టిని హీరోయిన్‌గా పెట్టి నీ జీవిత కథ తీస్తానమ్మాయ్‌.. ఇంకెవ్వరికీ మాట ఇవ్వకు’ అని చెప్పి వెళ్లాడు కూడా! ఇప్పుడామె ‘ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌’లో ముంబై టీమ్‌కి ‘జమ్మూకశ్మీర్‌ ఉమెన్స్‌ స్క్వాడ్‌ అండ్‌ గోలీ’ కెప్టెన్‌.ఇవన్నీ మూమూలే. శబ్దం వస్తే ఎవరైనా తలతిప్పి చూస్తారు. అఫ్షాన్‌ వైపు దేశమంతా అలాగే తలతిప్పి చూసింది. అయితే కశ్మీర్‌ అమ్మాయిలు మాత్రం అఫ్షాన్‌ ఇన్‌స్పిరేషన్‌తో చేతుల్లోకి రాళ్లు తీసుకుంటున్నారు! జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు ‘స్టోన్‌ పెల్టర్స్‌’ అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా!! రాళ్లు విసిరే అమ్మాయిలను హ్యాండిల్‌ చెయ్యడానికి సెంట్రల్‌ పోలీస్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ 500 మంది మహిళా కమెండోలను జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే దింపబోతోంది. 

మీదకు వచ్చిపడే రాళ్లతోనే తెలివైనవాళ్లు తమ చుట్టూ దుర్భేద్యమైన గోడను నిర్మించుకుంటారని పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో చెబుతుంటారు. అఫ్షాన్‌లాంటి అమ్మాయిలు మాత్రం అవసరమైతే ఇంటిగోడకు ఉన్న రాళ్లను కూడా పెకిలించి చేతిలోకి తీసుకుంటారు! ఉన్నది అద్దాల మేడ అని కూడా చూసుకోకుండా రాయి విసురుతారు. అది తెలివిలేకపోవడం కాదు. తమాయించుకోలేకపోవడం. కశ్మీర్‌.. భారతదేశపు అద్దాల మేడ. అద్దాల మేడ కాబట్టి లోపల ఉన్నవాళ్లు రాళ్లు విసరలేరు అనుకోడానికి లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అఫ్షాన్‌ ఉంది. అఫ్షాన్‌ ఉన్నచోట ప్రతిఘటనా ఉంటుంది. ఆ రోజు ప్రశాంతంగా ఆమె ఫుట్‌బాల్‌ను అమెను ఆడుకోనిస్తే ఇప్పుడు కమెండోలు అవసరమయ్యేవారే కాదేమో?!అఫ్షాన్‌లానే మరో అమ్మాయి పదకొండేళ్ల నథానియా జాన్‌. ఇండియా ఫుట్‌బాల్‌ ఆడడం లేదని ఫుట్‌బాల్‌ టన్నెల్‌లోకి వెళ్లే అవకాశం ఇండియాకు లేకుండా పోతుందా? ఈ తమిళనాడు బాలిక భారతదేశపు తొలి అధికారిక మ్యాచ్‌ బాల్‌ క్యారియర్‌గా (ఒ.ఎం.బి.సి) రష్యాకు వెళ్లి వచ్చింది. ‘ఫిఫా’ ఆటోమోటివ్‌ భాగస్వామి కియా మోటార్స్‌.. 10–14 ఏళ్ల మధ్య వయసు గల  ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ నుంచి ఇండియా తరఫున ఒ.ఎం.బి.సి. విజేతగా గర్ల్స్‌లో నథానియాను ఎంపిక చేసింది. జూన్‌ 22న బ్రెజిల్‌–కోస్టారికా మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ 24వ మ్యాచ్‌లో నథానియా రెండు జట్ల ప్లేయర్‌లతో కలిసి ఫుట్‌బాల్‌ టన్నెల్‌ గుండా బరి వరకు వెళ్లి బంతిని అందించింది. వాళ్లతో ఫొటోలు దిగింది, వాళ్ల ఆటను చూసి ఆనందించింది. ఇండియా మురిసిపోడానికి ఫిఫాలో ఈ మాత్రం ‘ప్రాతినిధ్యం’ తక్కువేం కాదు. గ్రేట్‌ ఇండియన్‌ అచీవ్‌మెంట్‌! నథానియాలా ఫిఫాకు వెళ్లి రావడం మాత్రమే అచీవ్‌మెంట్‌ కాదు.. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ఎప్పటికైనా ఇంటర్నేషనల్‌ గేమ్‌లో ఆడాలని నథానియా అనుకుంటోంది. అదీ ఇండియా అచీవ్‌మెంట్‌! అఫ్షాన్‌ కూడా అంతే. కశ్మీర్‌ అమ్మాయే అయినా, రాళ్లు విసిరిన అమ్మాయే అయినా ఇండియాకు ఒక అచీవ్‌మెంట్‌. 
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు