సినిమా విడుదలయ్యాక

10 Feb, 2020 09:10 IST|Sakshi
థియేటర్‌లో మండిపడుతున్న ప్రేక్షకురాలు,  ‘షికారా’ చిత్రంలోని ఒక సన్నివేశం 

శుక్రవారం బాలీవుడ్‌ చిత్రం ‘షికారా’ విడుదలైంది. రివ్యూలలో ఐదు స్టార్‌లకు రెండున్నర స్టార్‌లు వచ్చాయి. సినిమా పేలిపొద్ది అనుకున్నారు. తేలిపోయింది. ‘‘రిలీజ్‌కు ముందు ఎవరో కోర్టులో కేసు వెయ్యబోయీ ఆగిపోయారని తెలిసింది’’ అని విధు వినోద్‌ చోప్రా ట్వీట్‌ కూడా పెట్టారు. ‘షికారా’ సినిమా దర్శకుడు ఆయన. ఇస్లాం తీవ్రవాదుల అమానుష కాండ నుంచి తప్పించుకునేందుకు 1990లలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కోల్పోగా,  కశ్మీర్‌లోయను వదిలిపోయిన లక్షల మంది కశ్మీరీ పండిత్‌ల కథ ఇది. సినిమా కాబట్టి కొంచెం ప్రేమను చొప్పించారు. అదే దెబ్బ కొట్టేసినట్లుంది! ఎక్కడైనా ప్రేమ కానీ, ఒక జాతి జాతి ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జన్మభూమిని వదిలి పరుగులు తియ్యడం ఎంత దయనీయమైన కథాంశం! ఆ దైన్యాన్ని చూపించలేక చేతులు ఎత్తేసినట్లున్నారు చోప్రా.

‘‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు. నువ్వు మారణహోమాన్ని చూపించలేదు. మా కుటుంబాలు మొత్తం ఇస్లాం తీవ్రవాదానికి తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’’ అంటూ ఓ ప్రేక్షకురాలు థియేటర్‌లో లేచి నిలబడి పెద్దగా అరుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. థీమ్‌ ఏదైనా ఓ చుక్క ప్రేమ కలిపి సేల్‌ చేసుకోవాలని చూస్తే ఇలాగే అరకొర రివ్యూ స్టార్‌లు, ప్రేక్షకుల ఆగ్రహాలు మిగులుతాయని చోప్రా లాంటివాళ్లు ఎప్పటికైనా గ్రహిస్తారా?!  

మరిన్ని వార్తలు