స్త్రీలోక సంచారం

28 Dec, 2018 01:23 IST|Sakshi

బ్రిటన్‌: రాజకుటుంబపు తోడికోడళ్లు కేట్‌ మిడిల్టన్, మేఘన్‌ మార్కెల్‌ మధ్య కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తాయని, పైకి ఎలా ఉన్నా లోలోపల వారికి ఒకరంటే ఒకరికి పడటం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రిస్మస్‌ రోజున ఇద్దరూ కలివిడిగా నవ్వుకుంటూ సెయింట్‌ మేరీ మగ్దలీనా చర్చికి వెళ్లి వస్తూ కనిపించడం ఆ దేశంలో పెద్ద విశేషం అయింది.
 
బెంగళూరు: ఇంటి పనిమనిషితో చేతులు కలిపిన ముఠా ఒకటి తన ఫొటోలతో మార్ఫింగ్‌ వీడియోను తయారుచేయించి, తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలను తన నుంచి బలవంతంగా వసూలు చేయడమే కాక, తన కూతుర్నీ డబ్బు కోసం వేధిస్తోందని బిజినెస్‌మన్‌ భార్య ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మదురై: రక్తహీనత ఉన్న ఒక గర్భిణికి ఎక్కించిన రక్తంలో హెచ్‌.ఐ.వి. ఉన్నట్లు నిర్ధారణ అవడంతో బాధితురాలు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై  న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆమెకు ఎక్కించిన రక్తం ఒక రక్తదాన శిబిరంలో 17 ఏళ్ల యువకుడు ఇచ్చినదిగా గుర్తించిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. 

విమర్శ: మమతాబెనర్జీ, తనకు ముందుండి పోయిన సీపీఎం ప్రభుత్వం మాదిరిగానే ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ విమర్శించారు.

తగ్గుదల: భారతదేశంలో ఉద్యోగాలకు, ఉపాధి పనులకు వెళ్లే మహిళల సంఖ్య పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే బాగా తగ్గిపోయినట్లు ‘ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌’ 2017 నివేదిక వెల్లడించింది. 

మరిన్ని వార్తలు