మూగ గీతం

3 Dec, 2018 02:10 IST|Sakshi
‘‘నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే!’’ అని భార్య ముందు నేరస్తుడిలా నిలబడ్డాడు వెంకటప్పయ్య.

కథాసారం

రాజ్యానికి వొంటిమీద స్పృహ తప్పిపోయింది. వెంకటప్పయ్య పెళ్లాం మొహంలోకి చూశాడు. పెదిమలు కదులుతున్నాయి.
‘‘వొసే రాజ్యం!’’ ఆదుర్దాగా పిలిచాడు. పలకలేదు. మనోహరమైన తోడిరాగాన్ని తోడుపుచ్చుకుని అంబరవీధుల్లో విహరిస్తున్నాది.
వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు. ‘‘వెధవల్లారా ఏమిటా అల్లరి!’’ వెంకటప్పయ్య కసిరాడు.
‘‘అబ్బ తుళ్లిపడ్డానండీ! పిడుగు పడ్డట్టు విరుచుకు పడుతున్నారేం?’’ రాజ్యం తెలివి తెచ్చుకొని అడిగింది.

‘‘కసిరితే కసిరాను. వంట్లో ఎలాగుందో చెప్పు?’’
‘‘ఇప్పుడేమొచ్చిందని?’’ రాజ్యం నవ్వింది. నవ్వుమొహం చూడ్డానికి భయంకరంగా వుంది. పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్లు, పొడుచుకు కనబడుతున్న ముందు పళ్లు.
రాజ్యం టైఫాయిడ్‌ జ్వరంతో తీసుకొని కిందపెట్టవలసినంతా అయి బతికి బట్టకడుతున్నాది. పత్యం తింటూ ఇంకా వారం రోజులే అయింది. జ్వరం మూడు వారాలుగా పొక్కిపోసిన తరువాత దిగజారలేదు. మళ్లా తిరగబెట్టింది. ఏ క్షణంలోనైనా ప్రాణం గుటుక్కుమంటుందనే వాడి భీతి!

‘‘నా వంట్లో హాయిగా ఉంది. తింటున్నది అరుగుతున్నాది. అంత జబ్బు పడ్డాక నిలుచున్న పాళంలా మామ్మూలు మనిషిని కమ్మంటే అవుతానా?’’ అన్నాది రాజ్యం.
‘‘నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలార్చుకు పోయాయి’’ అన్నాడు.
‘‘ఈ యింటికి మారిన దగ్గరనుంచీ హాయిగా ఉంది. ఎటొచ్చి అద్దెకే బెంగగా ఉంది’’ అన్నాది రాజ్యం.
అంతకుముందు వాళ్లు ఇరుకు సందులో ఉండేవారు. ఇప్పుడు కొత్తగా కట్టిన డాబాలో రెండు చిన్న గదులూ, వసారా అద్దెకు తీసుకొన్నారు. చుట్టూ విశాలంగా పెరళ్లున్నాయి.
‘‘వెధవ డబ్బు. ఏదో కూడిక చేసుకొంటాము. నువ్వు బతికావు చాలు’’ అన్నాడు.

‘‘నా జబ్బుకి ఎక్కణ్ణుంచి తెచ్చారో, ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు’’ అన్నాది.
‘‘ఆ వూసు నిన్నెత్తొద్దన్నానా? ఆరోగ్యం చూసుకో. కావలసినంత ఓవల్టిన్ను తాగు. తెచ్చిన పళ్లన్నీ తినెయ్యి. పిల్లలకు కూడా పెట్టకు.’’
‘‘తినకేం చేస్తున్నాను? కాళ్లు జాపుకొని మీ చేత వండించుకొని మరీ తింటున్నాను. ఏదైనా అప్పు అప్పే కదా? మనకింకో విధం ఉంది కనకనా?’’

డబ్బు మాటెత్తగానే వాడికి గాభరా పుట్టింది. జీతం రెండు నెలలదీ కాక రెండువందలకి దాటి ఖర్చు అయిపోయింది. వాడికా సంభాషణ పెంచటం ఇష్టం లేదు. పెరట్లో కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కొని వచ్చాడు. 
రాజ్యం మళ్లా ఈ ప్రపంచంలో లేదు. మొహం మీదపడి బంగారపు పూత పూస్తున్నాది. కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండటం వెంకటప్పయ్య చూడలేదు. కాపరానికొచ్చిన తొలి సంవత్సరం కిలకిల నవ్వుతూ ఉండేది. సంవత్సరం తిరక్కుండా గుండెలికి చంటికుర్రాణ్ణి వప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకుంటూవెళుతూ, అవతలదరికి చేరమంది జీవితం! కాపరానికొచ్చి ఆరేళ్లయింది. ముగ్గురు కొడుకుల తల్లి అయి ఈదుతున్నాది.

అకస్మాత్తుగా రాజ్యం తల ఓ పక్కకు పెట్టి ఆడిస్తున్నాది. వెంకటప్పయ్య పకాలున నవ్వాడు.
‘‘ఎందుకూ అంత విరగబాటు నవ్వు?’’ మొగుణ్ణడిగింది.
‘‘ఏదీ, మళ్లా మెడవండి ఆడించు’’
‘‘అదా! ఎదురింటి పిల్ల పాడుతున్నాది, వినండి’’ అన్నాది. రాజ్యం చెప్పాక ఎదురింటి నుంచి సంగీతం వస్తున్నట్లు చెవులకు తెలిసింది.
‘‘ఓహో! అదియా సంగతి! చిన్నప్పుడు నువ్వు వాయులీన విద్వాంసురాలివి కదూ!’’ అన్నాడు. 

‘‘చీకటిపడుతూ ఉంటే ఇప్పుడెందుకూ వీధిలోకి? పెందరాళే అన్నం తినకూడదూ?’’ అన్నాది.
‘‘అనుకొంటూ ఉండగా ఆలస్యమైపోతున్నాది. ఇలాగ్గా ఇహనెళ్లి పాపపరిహారార్థం మంచిపని చెయ్యాలి’’ అన్నాడు.
‘‘పాపాలు కూడా చేస్తున్నారా?’’
‘‘పాపం చెయ్యందీ బతుకు వెళ్లలేదు.’’ వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు.

పిల్లలిద్దరూ సంగీతం వింటున్నారు. రాజ్యం మెల్లిగా లేచి స్విచ్చి నొక్కింది. గదినిండా కాంతి పడ్డాది. రాజ్యం ఫిడేలు మూలపడ్డాది. కమాను విరిగి పెంటకుప్పని చేరింది. జీవితంలోంచి సంగీతం తొలగిపోయినా ఎదురింటి అమ్మాయి పాడుతూవుంటే ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తున్నాది.

ఆరేళ్ల క్రితం రాజ్యాన్ని చూడడానికి పెళ్లివారు వచ్చారు. వాళ్లతో వెంకటప్పయ్య వచ్చాడు. రాజ్యాన్ని పాడమన్నారు. వాళ్ల నాన్న నాలుగేళ్లయి సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభముహూర్తం వచ్చింది. తోడిలో కీర్తన సిగ్గుపడుతూ అందుకుంది. గొంతుకెత్తేసరికి అపశృతి. ఉసిలోకి రావాలసిన తాళం వేలుమీదకొచ్చింది. వొళ్లంతా జలదరించి పాటంతా గాభరా అయింది. రాజ్యానికి ఏడుపు పర్యంతం అయింది. కాని పెళ్లిపెద్దలు సెహబాస్‌ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవనీ, వాళ్ల జీవితాలలో సంగీతం లేనేలేదనీ అమాయకపు పెళ్లికూతుళ్లకి ఏమి తెలుసు!

వెంకటప్పయ్య పెళ్లినాటికి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి పట్టభద్రుల్లో ఒకడు. చెన్న రాష్ట్ర ప్రభుత్వపు డెబ్బయి రెండు రూపాయల ఎల్‌.డి. గుమస్తాలలో ఒకడు. 
పెళ్లయిన కొత్తలో రాజ్యం మాబాగా పాడుతుందని ఊళ్లోవాళ్లు పేరంటానికి వెళితే పాడించేవారు. అత్తవారింట్లో నోరెత్తి పాడుకొనే సమయం రాకుండానే వేవిళ్లతో పుట్టింటి కెళ్లింది. వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు. 

‘‘తమ్ముడు నిద్రపోతున్నాడా??’’ అనడిగింది.
‘‘గుర్రు పెడుతున్నాడు’’ అన్నాడు పెద్దవాడు.
‘‘అల్లరి చేస్తే లేచిపోడూ. ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నాది. కూచుని వినండి’’ అన్నాది. ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది. రాజ్యానికి ఏనుగంత సత్తువ వచ్చింది. జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే.

పానకంలో పుడకలాగ ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు. ‘‘గిమపదని ఓజగ...’’ గొంతుక చించుకొని అపశృతిలో స్వరాలు వేశాడు. ఆ అమ్మాయి తంబూరా, పాటా ఆపేసింది.
‘‘వెధవా! సంగీతం నేర్చుకోమంటే రావుకానీ అల్లరికి సిద్ధం’’ అన్నాది.
‘‘ఇంక పాడదేంటమ్మా?’’ పెద్దకొడుకు అడిగాడు.

‘‘అదిగో మీలాంటి అల్లరి కుర్రవాడు వచ్చి కంగాళీ చేస్తే కోపం వచ్చి పాట మానేసింది.’’ 
‘‘నువ్వు పాడతావూ?’’
‘‘ఓ పాడతాను. నీకు చెప్పమన్నావా?’’
‘‘ఛీ! మొగాళ్లు పాడరు.’’

‘‘మొగాళ్లూ పాడతారమ్మా’’ అని రాజ్యం కాళ్లు జాపి గదిలో అడ్డంగా పడుకుంది. ‘‘ఒరే పెద్దాడూ! కాళ్లు పట్టుబాబూ’’ అంది. పెద్దవాడు మెల్లిగా కాళ్లు గుద్దుతూ కూచున్నాడు. 
‘‘నేను చేతులు గుద్దుతానమ్మా!’’ అంటూ రెండోవాడు చేతులు గుద్దుతూ కూచున్నాడు.
రాజ్యం కళ్యాణి కృతి అనుకొంటూ పడుకుంది. అంతా మరిచిపోయింది. సంగతులు చిక్కుపడ్డ కురుల్లాగ అవకతవక అయిపోయాయి.
‘‘నువ్వా పిల్లలాగ పాడ్డం లేదు’’ అన్నాడు పెద్దవాడు.

‘‘అంతా మరిచిపోయానురా!’’ పెరటి వసారా గూట్లోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడు.
‘‘కుక్క కాబోలు కొట్టండి. గూట్లో అన్నం మండబెట్టింది కాబోలు!’’ అన్నాది రాజ్యం.
కొడుకులు పరిగెట్టారు. ‘‘కుక్క కాదమ్మా పిల్లి. అన్నంగిన్నె మీదా సిబ్బి తిరగదోసింది’’ అన్నాడు పెద్దవాడు.

‘‘నయమే. మళ్లా వండుకోకుండా. కుక్క ముట్టుకున్న కూడూ తినవలసిన రోజులు. గడియ పెట్టి రావొద్దూ?’’ అన్నాది రాజ్యం.
వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు. ‘‘పెరట్లో వెన్నెలా, పువ్వువెలగ వాసన మహబాగున్నాయి’’ అన్నాడు.
‘‘అప్పడే వచ్చేశారేం? పాపపరిహారం అయిందా?’’

‘‘కొంచెం అయింది.’’ వెంకటప్పయ్య కండువాలో దాచి చంకక్రింద ఏదో పెట్టాడు. గుండ్రంగా పేపరు చుట్టి ఉంది.
‘‘ఏమిటిది?’’ అన్నాది రాజ్యం.
లోపల నాలుగువేళ్ల వెడల్పు చుట్టు జరీ అంచు చీర ఉంది. దానికి తగ్గ పట్టు రవికల గుడ్డా ఉంది.
‘‘కొన్నారా?’’
‘‘కొన్నాను. ఉన్నడబ్బు కాస్తా అయిపోకుండా కొనేశాను.’’
‘‘డబ్బెక్కడిది?’’
‘‘చెపితే నువ్వు నన్ను క్షమించవు.’’
‘‘ఏం చేశారండీ?’’
‘‘ఏమీ అననని చేతిలో చెయ్యివెయ్యి’’ అన్నాడు. ముందుకు చెయ్యి జాపాడు. వాడి చెయ్యి వణుకుతున్నాది. రాజ్యం చేతిలో చెయ్యి వేసింది.
‘‘అలాగ వొణికిపోతున్నారేం? దొంగతనం చెయ్యలేదు కదా?’’
‘‘అంతకన్నా హీనమైనదే. నీకు టైఫాయిడు మళ్లా తిరగబెట్టింది కదూ! నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి. స్నేహితుడొకడు ఇంటికివచ్చి చూసీచూడ్డంతో సలహా ఇచ్చాడు. తెగించి వాడికిచ్చేశాను.’’
‘‘ఏమిటిచ్చేశారు?’’

‘‘నీ కింకా తెలియలేదు. వాడే పట్టుకెళ్లి రెండువందల ఏభైకి అమ్మేశాడు. అంతడబ్బు వస్తుందని కలలోకూడా అనుకోలేదు. పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట!’’
రాజ్యానికి అర్థమైంది. గది నాలుగుపక్కలా కలియజూసింది.
‘‘ఇహ నువ్వు చూడనక్కర్లేదు.’’
‘‘వెళ్లిపోయిందా?’’ అని దీర్ఘంగా నిట్టూర్చింది.
‘‘నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే!’’ అని నేరస్తుడిలాగ మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనస్సు బాధపడుతున్నాదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగమింగుకుంది.
‘‘ఏ తప్పూ చెయ్యలేదు. ఏ సంసారైనా అదే చేస్తాడు. మీరేం తినేశారా?’’
‘‘మనకంతా మొగపిల్లలే కదా అని ధైర్యం చేశాను.’’

‘‘పోనియ్యండి, నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సర్వతీ కటాక్షం నా కంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లిగుణాన్ని చూపించుకొంది. నాకు ప్రాణం పోసింది. నాకో చీరా రవికలగుడ్డా పెట్టింది’’ అని గుడ్లనిండా నీళ్లు నింపుకొంది.
‘‘నాలుగు కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను’’ అని చీర సగం విప్పేసి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య.
‘‘జ్ఞాపకంగా ఉంటుంది లెండి!’’ అన్నాది రాజ్యం.

చాసోగా సుప్రసిద్ధులైన కథకులు, కవి చాగంటి సోమయాజులు (1915–1994) ‘వాయులీనం’ కథకు ఇది సంక్షిప్త రూపం. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్‌.

మరిన్ని వార్తలు