పారహుషార్‌

10 Sep, 2018 00:57 IST|Sakshi

పల్లెటూళ్లో ఉన్న చెల్లెను చూడటానికి వచ్చింది అక్క.
పెద్దామె పట్నంలోని వ్యాపారిని పెళ్లాడితే, చిన్నామె రైతును చేసుకుంది. టీ తాగుతూ పట్టణ జీవితాన్ని వర్ణిస్తూ బడాయి పోయింది అక్క. వాళ్లు వేసుకునే బట్టల గురించీ, నాటకాలు, షికార్ల గురించీ చెప్పగానే చెల్లెకు కోపమొచ్చింది. ‘మేము సంపన్నులం కాకపోయినా తినడానికి ఇంత తిండి దొరుకుతుంది,’ అని జవాబిచ్చింది. దానికి పెద్దావిడ, ‘నీ మొగుడెంత కష్టపడి పనిచేసినా పేడలో పుట్టిన పురుగు పేడలోనే చచ్చినట్లు మీరూ ఈ మట్టిలోనే అణిగిపోతారు’ అంది. 
చిన్నామె భర్త పోఖోమ్‌ వీళ్ల మాటలు వింటూ అరుగు మీద పండుకుని ఉన్నాడు. ‘నిజమే కదా’ అనిపించింది. ‘నాకు సరిపడేంత భూమే ఉంటే సైతానుకు కూడా భయపడేవాణ్ని కాదు’ అనుకున్నాడు. ఆడవాళ్లు కాసేపు మాట్లాడుకుని, ఎక్కడివక్కడ సర్దుకుని, నిద్రకు ఉపక్రమించారు. కానీ పొయ్యి వెనుక సైతాను కూర్చుని ఈ సంభాషణంతా విన్నాడు. ‘అయితే నాకే భయపడవా? నీకు సరిపోయినంత భూమి ఇస్తాను; నా బానిసను చేసుకుంటాను చూడు’ అనుకున్నాడు.
∙∙ 
ఆ గ్రామానికి సమీపంలోనే ఒక ధనికురాలు నివసిస్తూండేది. రైతుల ఉమ్మడి భూమికి సరిహద్దుల్లోనే ఆమెకు మూడు వందల ఎకరాల భూమి ఉంది. పోఖోమ్‌ జాగ్రత్తగానే ఉండేవాడు. అయినా పండిన ఆమె చేలో అతడి గుర్రం పడి తినడమో, కూర పెరట్లోకి ఆవు తెంచుకుని వెళ్లి పాడుచేయడమో జరిగేది. దాంతో తరచూ జరిమానా కట్టాల్సివచ్చేది. అదల్లా ఉండగా ఆ ధనికురాలు భూమి విక్రయిస్తుందని పుకారు బయల్దేరింది. 
‘మనమూ ఓ ముప్పై ఎకరాలైనా కొనాలి. ఆ మాత్రమైనా లేకపోతే మనకు గడవదు’ అన్నాడు భార్యతో పోఖోమ్‌. ఇద్దరూ జాగ్రత్త పెట్టిన బాపతు ఓ వంద రూబుల్సు ఉన్నాయి. గుర్రపు పిల్లని అమ్మేశారు. తేనెపెట్టెల్లో సగం బేరం ఇచ్చేశారు. కొడుకుని పనికి కుదిర్చారు. కొంత అప్పు తెచ్చారు. ఎట్టాగయితేనేం సొంతభూమి సంపాదించాడు. కొత్త పొలం దున్ని విత్తనాలు చల్లాడు. మంచి పంట రాలింది కూడా. రుణ విముక్తుడైన పోఖోమ్‌ పెద్ద కమతానికి కామందు అయ్యాడు. తన సొంత బీళ్లలోనే గుర్రాల్నీ ఆవుల్నీ మేకల్నీ మేపుతున్నాడు. తన పొలంలోని ప్రతి మడి నవరత్న ఖండంలాగా అతని మనస్సును ఆకర్షిస్తూ వుంది.
∙∙ 
సుఖంగా పోఖోమ్‌ నూతన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఇప్పుడింకో రకం అవాంతరాలు రానారంభించేయి. ఏ రైతు పశువులో తన చేలో పడి మేసేవి. మరో నాడెవరో బీట్లో గడ్డి కోసుకుపోయేవారు. ఓ రాత్రి గుర్రాలు గోధుమ పొలంలో పడి తొక్కి పాడు చేసేవి. రైతుల్ని ఎన్నోసార్లు మందలిస్తున్నా లాభం లేకపోయింది. ఓరోజు చూసేసరికి చెట్లన్నీ నరికి పడివున్నాయి. ‘ఆ సైమన్‌గాడే ఈ పనిచేసివుంటాడు’! చివరకు అతనికి విసుగు పుట్టి, పట్టణంలోని కోర్టులో దావా పడేశాడు. యే ఆధారాలు లేకపోవడం వల్ల సైమన్‌ను కోర్టువారు నిర్దోషియని వదిలిపెట్టారు. పోఖోమ్‌ పొలం, పెరడు విశాలమైనవే అమరినాయిగానీ ప్రపంచంలో అతని స్థానం ఇరకాటం కాజొచ్చింది. 
∙∙ 
ఆ రోజుల్లోనే యింకో హడావుడి బయల్దేరింది. దూరంగా మరో ప్రాంతంలో కొత్త భూములు సాగులోకి వస్తున్నాయనీ, చాలామంది అక్కడికి వలస పోతున్నారనీ అంతా చెప్పుకుంటున్నారు.
ఓ రోజున పోఖోమ్‌ భోజనం చేసి, విశ్రాంతిగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాడు. పరదేశి ఒకడు వచ్చి భోజనం పెట్టమనడిగేడు. భోజనం అమర్చి, రాత్రికి వుండి వెళ్లమని మర్యాద చేశాడు. పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ అతని వృత్తాంతం అడిగాడు. తనది దక్షిణదేశమనీ, వోల్గానదీ తీరస్థుణ్ననీ చెప్పాడా పరదేశి. ‘అక్కడ భూమి ఎంత మంచిదనుకున్నారు? దున్ని విత్తులు చల్లుతామా! ఆహాహా! ఎంత ఏపుగా వస్తాయనుకున్నారు? గుర్రం మీద కూర్చున్న మనిషి కూడా ఆ చేలల్లో దాగుకోవచ్చు’. వింటూంటే పోఖోమ్‌ హృదయం ఉప్పొంగింది.
∙∙ 
ఆ వేసవిలోనే ప్రయాణమై కొత్త ప్రదేశాన్ని చూడ్డానికి పోయేడు పోఖోమ్‌. వోల్గా నదిలో స్టీమరు మీద సమరా పట్టణానికి వెళ్లి అక్కడి నుంచి కాలినడకన మూడువందల మైళ్లు ప్రయాణం చేసి, చిట్టచివరికి ఆ గ్రామం చేరాడు. పరిస్థితులన్నీ తను వినిన రీతిగానే ఉన్నాయి. రైతులంతా తలా ముప్పై ఎకరాలు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. ఎవరు కొత్తగా వచ్చినా కమ్యూన్‌లో చేర్చుకుంటున్నారు.
ఆ మరుసటి వేసవిలో తన భూమంతా అమ్మేశాడు. గ్రామ పంచాయితీలో తన పేరు తీయించేసుకుని, డబ్బంతా చేత పట్టుకుని, సకుటుంబంగా కొత్త ప్రదేశానికి వచ్చి చేరేడు. ఒక పెద్ద గ్రామంలో తన పేరు నమోదు చేయించుకున్నాడు. విందు ఏర్పాటు చేశాడు. అతని కుటుంబంలోని ఐదుగురికి నూటయాభై ఎకరాల భూమి దఖలు పడింది. చక్కని చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మొదటి ఏడాది గోధుమలు చల్లేడు. మంచి పంట రాలింది. పది మైళ్లలో ఉన్న పట్నానికి గోధుమ బళ్లు తోలుకెళ్లినప్పుడు షాహుకార్ల భవంతులూ, వాళ్ల దర్జా జీవితం చూసి పోఖోమ్‌ భుజాలెగరేశాడు. ‘అలాంటి ఇళ్లలో ఉండాలి’ అనుకున్నాడు.
∙∙ 
మూడేళ్లు గడిచిపోయాయి. మాంచి దర్జాగా బతుకుతున్నాడు. అయితే ప్రతి ఏడూ భూమిని మక్తాకు తీసుకోవడం, అందులో మొదటినుంచీ వ్యవసాయం ప్రారంభించడం కష్టంగానే ఉండింది. భూమి ఎక్కడేనా దొరుకుతుందా? అనే ధ్యాసతో నిద్రాహారాలు రుచించడం లేదు. 
అయితే ఓ రైతు చిక్కుల్లో పడి తన భూమి 1300 ఎకరాలూ అయినకాడికి తెగనమ్ముకుంటున్నాడు. అతనితో బేరమాడి, పీడించి 1500 రూబుల్సుకి దాన్ని స్థిరపరుచుకున్నాడు. సగం వెంటనే ఇచ్చి, సగం తర్వాత చెల్లించేట్టుగా ఒప్పందం చేసుకున్నాడు. 
పెద్ద భూకామందు కాబోతున్న సమయంలో ఓ రోజు ఆ గ్రామానికో వర్తకుడు వచ్చేడు. అతని భోజనానికి పోఖోమ్‌ తన ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. ఆ వర్తకుడు తాను బాష్కీర్ల దేశం నుంచి వస్తున్నాననీ, 13000 ఎకరాల భూమిని వెయ్యి రూబుళ్లకే కొన్నాననీ చెప్పాడు. బాష్కీర్ల దేశంలో ప్రజలు అమాయకులనీ, అక్కడ కావాల్సినంత భూమి ఉందనీ, వాళ్ల పెద్దల్ని సంతోషపెడితే చాలుననీ చెప్పాడు. పోఖోమ్‌ మనస్సులో ఆశ తుఫానులా విజృంభించింది.
∙∙ 
మర్నాటి నుంచే పోఖోమ్‌ ప్రయాణ సన్నాహాలు ఆరంభించేడు. ఇంటి పని అంతా భార్యకు వప్పజెప్పి, ఓ నౌకరును మాట్లాడుకుని ప్రయాణమయ్యేడు. దారిలో పట్టణంలో ఓ పూట ఆగి, తనకు కావాల్సిన అంగీలు, కోట్లు, తలగుడ్డలు, తివాచీలు, తేయాకు, సారాయి కొన్నాడు. ఆఖరి రైలు స్టేషనులో దిగి నాటుదారిన వారం రోజులు నడక సాగించి, బాష్కీర్ల దేశం చేరారు. ప్రజలంతా నాలుగు, మూడు చక్రాల బళ్లలోనే నివసిస్తున్నారు. ఇళ్లూ గ్రామాలూ వేరే ఉండవు. నదీతీరాల్లో, పచ్చిక మైదానాల్లో మందల్ని తోలుకుంటూ సంచారం చేస్తుండే ప్రజలకు భూమిని దున్నడం, విత్తడం తెలియదు. గోధుమ రొట్టెలు ఎరుగనే ఎరుగరు. రష్యన్‌ భాష మాట్లాడటం కూడా తెలియదు. 
పోఖోమ్‌ను చూడగానే బాష్కీరులు బళ్లు దిగి చుట్టుముట్టేరు. దుబాసీ ఒకణ్ణి పట్టుకున్నారు. పోఖోమ్‌ వచ్చిన వైనం తెలుసుకున్నారు. అతణ్ని కౌగిలించుకుని, ఓ విశాలమైన శకటంలోనికి ఆహ్వానించి, గొర్రె మాంసం తెచ్చి ముందుంచారు. తినడం త్రాగడం అయ్యాక పోఖోమ్‌ తాను తెచ్చిన బహుమతులను ఒక్కొక్కరికే సమర్పించాడు. ‘మీ భూమిలో కొంతభాగం నాకిస్తే చాలా సంతోషిస్తా’ అన్నాడు పోఖోమ్‌. ‘మీరు ఫలానా భూమి కావాలని చూపిస్తే అది మీదే అయిపోతుం’దని వాళ్లన్నారు.
‘అయితే ధర నిర్ణయం ఎట్లా?’
‘ధరకేముంది? రోజుకు వేయి రూబుల్సు’ అన్నాడు కులపతి.
భూమిని కొలవడానికి ‘రోజు’మానం ఎట్లా అవుతుంది? 
‘మాకు కొలతలేమీ తెలియవు. ఒక దినంలో ఎంత ప్రదేశం చుట్టి వస్తారో అంతా మీదవుతుంది’
పోఖోమ్‌ ఆశ్చర్యపడ్డాడు. ఒక్కరోజులో చుట్టి రాగల ప్రదేశం బోలెడంత అవుతుంది! 
కులపతి నవ్వుతూ, ‘అదంతా మీదే అవుతుంది, ఒక్క షరతు మీద. బైలుదేరిన రోజు సూర్యాస్తమయం కాక పూర్వమే మీరు బైలుదేరిన చోటుకు రాజాలకపోతే భూమి మీది కాజాలదు; మీ సొమ్ము మాకు చెందుతుంది’ అన్నాడు.
∙∙ 
పోఖోమ్‌కు నిద్రపట్టలేదు. ఎన్ని ఎకరాల భూమి! తెల్లవారుఝామున మాత్రం చిన్న కునుకు పట్టింది. కన్ను మూసేడో లేదో పీడకల. పకపకా నవ్వు వినిపిస్తే తొంగి చూసేడు. కులపతి. ఎందుకో అడుగుదామని సమీపించగానే ఈ సంగతి చెప్పిన వర్తకుడయ్యాడు. అంతలోనే వోల్గా రైతుగానూ, సైతానుగానూ మారిపోయాడు. కాళ్ల దగ్గర బోర్లాపడినట్టుగా తన శవం కనబడి, భయభ్రాంతుడయ్యాడు.

బండి తెర తప్పించి బైటికి చూసేడు. తెల్లవారే సమయం. చిన్నసంచిలో రొట్టెలు వేసుకుని, మంచినీటి తాబేటికాయను కట్టుకుని, పెద్ద బూట్లు తొడుక్కుని, డబ్బుమూట టోపీమీద పెట్టుకుని, పార భుజాన వేసుకుని బయల్దేరాడు. ముందు మెల్లగా నడిచాడు. ఒక చోట గుర్తు కోసం పారతో మట్టి తవ్వి పెళ్ల తిరగేశాడు. రెండు మూడు ఫర్లాంగుల కొక చోట ఆనవాలు పెడుతూ పోయాడు. ఎండెక్కుతూంది. చొక్కావిప్పి నడిచాడు. ఇంకొంచెం దూరం పోయాక బూట్లు బరువుగా తోచి, నడుం పటకాకు తగిలించుకున్నాడు. వెళ్లినకొద్దీ భూమి బంగారమే. పెద్ద కొండ కనబడింది. ఆ దిశలో ఆగి, మంచినీళ్లు తాగి, ఎడమవైపు తిరిగాడు. గడ్డి ఎత్తుగా పెరిగివుంది. అలసటగా తోచింది. రొట్టె తిని, నీళ్లు తాగాడు. మధ్యాహ్నమైంది. ఎండ నిప్పులు చెరుగుతూంది. ఆగకుండా నడుస్తున్నాడు. ఆ దిశలో ఇక మలుపు తిరుగుదామనుకునేలోపు తేమ భూమి కనబడింది. నార బాగా పెరుగుతుంది. అవతలి కొనకు వెళ్లి, చిన్న గొయ్యి తీసి, ఎడమకు మరలాడు.

వేడిగాడ్పు కొడుతూంది. భూమికి రెండు వైపులు పొడవైపోయాయి. ‘భూమి నలుచదరంగా ఉండదు. ఏం చేస్తాను?’ మూడో దిశలో మైలు నడిచేప్పటికి సూర్యుడు వాలిపోతున్నాడు. నడక కష్టంగా ఉంది. చెమటతో తడిసి ముద్దయ్యాడు. విశ్రాంతి కావాలి. ‘కాని సూర్యుడు పోఖోమ్‌ కోసం అస్తమించకుండా ఉంటాడా? ఆ రెండు వైపులా అంతదూరం వెళ్లి తప్పు చేశాను’. చీరుకుని చినిగిన చొక్కా విప్పేశాడు. బూట్లు, తాబేటికాయ పడేశాడు. పరుగు మొదలుపెట్టాడు. ‘నా పని అయిపోయింది’. నోరు పిడచగడుతోంది. ఊపిరితిత్తులు బద్దలయ్యేట్టున్నాయి. చావడానికీ భయంగానే ఉంది. ‘ఇంత పరుగెత్తి ఆగితే చచ్చుదద్దమ్మ అనరూ!’ బాష్కీర్లు త్వరగా రమ్మని కేకలేస్తున్నారు. ‘నాకు చాలా భూమే ఉంది. కాని అనుభవించటానికి జీవించివుంటే గదూ!’ సూర్యుడు కుంగిపోతున్నాడు. శక్తి కూడదీసుకుని ఉరుకుతున్నాడు. ఆ వేగానికి కాళ్లు తట్టుకోలేకపోయాయి. ముందుకు పడిపోయాడు. ‘భేష్‌. నీకు మహామంచి భూఖండం దక్కింది’ అంటున్నాడు కులపతి. పడిపోయిన పోఖోమ్‌ను ఎత్తడానికి సేవకుడు పరుగెత్తాడు. సమయం మించిపోయింది. పోఖోమ్‌ రక్తం కక్కుకున్నాడు. బాష్కీర్లు విచారసూచకంగా తలలూపుతున్నారు. సేవకుడు సమాధి చేయడానికి పారతో గొయ్యి తీశాడు. కేవలం ఆరడుగుల స్థలం పోఖోమ్‌కు చాలింది.

మహా రచయిత లియో టాల్‌స్టాయ్‌ (1828–1910) ‘హౌ మచ్‌ లాండ్‌ డజ్‌ ఎ మాన్‌ నీడ్‌?’ కథ సారాంశం ఇది. 
రచనాకాలం: 1886. 
మహీధర జగన్మోహనరావు ‘ఎంత భూమి కావాలి’ పేరుతో దీన్ని తెలుగులోకి అనువదించారు.


లియో టాల్‌స్టాయ్‌

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాదం.. ఆరోగ్యవేదం!

గ్యాస్‌ ట్రబుల్‌ మందులతో కిడ్నీకి చేటు..

దీర్ఘాయుష్షుకూ క్రిస్పర్‌!

క్యాన్సర్‌ – చికిత్సలు 

పేరెంట్స్‌కూ పరీక్షే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!