వంటగదిని శుభ్రం చేశారా!

24 Oct, 2019 03:17 IST|Sakshi

తళ తళ

దీపావళి పండగకు ముందుగా ఇళ్లు మొత్తం శుభ్రం చేసుకోనిదే మనసుకు సంతోషం అనిపించదు. అమ్మ, బామ్మ.. ఇంట్లోని ప్రతీ గదిని వరసగా శుభ్రం చేసుకుంటూ దుమ్మ దులపడాన్ని మన చిన్ననాటి రోజుల నుంచి చూస్తున్నదే.

శుభ్రం చేసిన తర్వాత కొత్త హంగులతో అలంకారాలతో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఇంటి శుభ్రత లేకుండా పండగ పనులేవీ ముందుకు కదలవు. అన్ని గదుల కన్నా వంటగది శుభ్రత కష్టంగా అనిపిస్తుంటుంది. సులువుగా, మరింత శుభ్రంగా వంటగదిని ఎలా ఉంచాలో చూద్దాం...

బేకింగ్‌ సోడా, డిష్‌వాషింగ్‌ సోప్, వేడినీళ్లు, వెనిగర్, కిచెన్‌ను శుభ్రం చేసే టవల్‌.. ముందు వీటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో కిచెన్‌ జిడ్డును వదిలించడంలో పని సులువు అవుతుంది.

వంటగదిలో ఎప్పుడూ ఉండే సమస్య క్రిములు. అలాగే చిన్న చిన్న పురుగుల నుంచి బొద్దింకల వరకు అప్పుడప్పుడైనా కనిపిస్తుంటాయి. వీటికి విరుగుడుగా షాపుల్లో పెస్ట్‌ కంట్రోల్‌ స్ప్రే లభిస్తుంది. కిచెన్‌ షెల్ఫ్‌లో వంటసామానంతా పక్కన పెట్టేసి ఆ పెస్ట్‌ కంట్రోల్‌ స్ప్రే చేయాలి.

వెచ్చని నీటిలో వెనిగర్, డిష్‌వాషర్‌ సోప్‌ కలుపుకోవాలి. సిద్ధంగా ఉంచుకున్న టవల్‌ని ఆ నీళ్లలో ముంచి, నీళ్లు కారకుండా పిండి దాంతో షెల్ఫ్‌లు, కప్‌బోర్డ్స్‌ ఉంటే ఆ పై భాగాలను శుభ్రంగా తుడవాలి. దీంతో దుమ్ము, జిడ్డు మరకలన్నీ శుభ్రం అవుతాయి.

ఆ తర్వాత డబ్బాల్లో మూడు నాలుగు నెలలుగా ఉండిపోయిన దినుసులు ఉంటాయి. ముఖ్యంగా మసాలా దినుసులు.. మరికొన్ని డబ్బాల్లో వాడని, పురుగు పట్టినవి కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేయాలి.

స్టోర్‌ నుంచి తెచ్చి, ఇంకా వాడని సరుకుల ప్యాకెట్లపైన ఉన్న తేదీని బట్టి సరిచూసుకొని, షెల్ఫ్‌ల్లో సర్దుకుంటే వాడడమూ సులువు అవుతుంది.

ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం పెద్ద పని. వారానికి ఒకసారి శుభ్రం చేసినా లోపలిభాగంలో కొన్ని పదార్థాల మరకలు అలాగే ఉండిపోతుంటాయి. వెనిగర్‌ కలిపిన వెచ్చని నీటిలో టవల్‌ను ముంచి ప్రిజ్‌ లోపలి భాగం అంతా గట్టిగా రుద్దుతూ తుడవాలి. వెనిగర్‌ లేదంటే నిమ్మరసం కలిపిన నీటితో అయినా తుడిచి, మళ్లీ పొడి టవల్‌తో తుడవాలి.

ఉన్న వస్తువులన్నింటితో కిచెన్‌ షెల్ఫ్‌లను నింపేయకుండా అంతగా ఉపయోగించని వస్తువులను పైషెల్ఫ్‌లో సర్దేయాలి. ఏవి ఎంత వరకు అవసరమో ముందే అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ మేరకు మాత్రమే సర్దుకుంటే వంటగది పండగకు శుచిగా, అందంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు