సావిత్రి కీర్తి

15 Apr, 2018 01:32 IST|Sakshi

‘మహానటి’ మూవీ ఇన్‌సైడ్‌ స్టోరీ

సావిత్రిని ప్రేమించాలా? గౌరవించాలా?అప్పటి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగినవాళ్లకు ఎప్పటికీ ఉండే సందిగ్ధమే ఇది.అవేం కాదు కానీ సావిత్రిని కీర్తించాల్సిందే.సజీవంగా ఇంకో సావిత్రిలా నటించడం, పాత్రలో జీవించడం ఆల్మోస్ట్‌ ఇంపాజిబుల్‌. అయినా ‘మహానటి’... సావిత్రి ‘కీర్తి’కి అద్దం పడుతుంది.

‘మహానటి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది?
‘ఎవరీ నాగ్‌ అశ్విన్‌’? ‘ఎవడే సుబ్రమణ్యం’ రిలీజ్‌ తర్వాత చాలామంది అడిగిన ప్రశ్న ఇది. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలా లేదే? కాన్సెప్ట్‌ వండర్‌ఫుల్‌. ‘ఎవడే.. ’ సినిమాని చూసినవాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ఫస్ట్‌ మూవీకే ఒక మంచి కాన్సెప్ట్‌ తీసుకున్న నాగ్‌ అశ్విన్‌ వెంటనే మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ తీస్తాడని చాలామంది ఊహించి ఉంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా మహానటి సావిత్రి బయోపిక్‌ తీస్తున్నట్లు ప్రకటించారు. అసలీ ఆలోచన నాగ్‌ అశ్విన్‌కి ఎప్పుడు వచ్చింది? అంటే.. ‘ఎవడే సుబ్రమణ్యం’ తీస్తున్నప్పుడే. నెక్స్‌›్టసినిమా ఏంటి? అని చిత్రనిర్మాత స్వప్నా దత్‌ అడిగితే.. సింపుల్‌గా సావిత్రిగారి లైఫ్‌ హిస్టరీ అన్నారు నాగ్‌. అంత పెద్ద ప్రాజెక్ట్‌ని తలెత్తుకోవడం అంటే తల పండిపోయిన దర్శకుల వల్లే సాధ్యం. అందుకే స్వప్న షాకయ్యారు. నాగ్‌కి కూడా సెకండ్‌ థాట్‌ లేకపోలేదు. ‘మన అనుభవం, వయసు సరిపోతుందా?’ అని ఆలోచించారు. ఎంతగా ఆలోచించారంటే దాదాపు రెండేళ్లు. ఫైనల్లీ ఈ మూవీ తీయాలని ఫిక్సయ్యారు.

నాగ్‌ అశ్విన్‌కి సావిత్రి గురించి ఏం తెలుసు?
చిన్నప్పుడు చూసిన విషయాలు, జరిగిన సంఘటనలు మనసులో నిలిచిపోతాయ్‌. అలా చిన్నప్పుడు అమ్మమ్మతో పాటు చూసిన సావిత్రి సినిమాలు నాగ్‌ అశ్విన్‌కి ఆమెను పరిచయం చేశాయి. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ.. చిత్రాలు చూసిన నాగ్‌ అశ్విన్‌కి సావిత్రి ఎంత గొప్ప నటో అర్థమైంది. పెద్దయ్యాక సావిత్రి జీవితం గురించి తెలుసుకుని చాలా ఇన్‌స్పైర్‌ అయ్యారు. ఫైనల్లీ తన రెండో సినిమాకి ఆమె జీవిత కథనే ఎంచుకున్నారు. కొన్ని పుస్తకాల రిఫరెన్స్, కొందరు దర్శకులు చెప్పిన విశేషాలు, సావిత్రి సినిమాలు చూసి... ఎంతో రీసెర్చ్‌ చేసి, ఈ కథ తయారు చేసుకున్నారు.

నేను సావిత్రిగారిలానా..? భయపడ్డ కీర్తీ
స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నప్పుడు సావిత్రి క్యారెక్టర్‌కి ఏ హీరోయిన్‌నీ అనుకోలేదు. పూర్తయ్యాక ‘కీర్తి సురేష్‌’ అయితే బాగుంటుందని దర్శకుడికి అనిపించింది. కానీ ప్రియాంకా దత్, స్వప్నా దత్‌కి మాత్రం కీర్తీ్త సూట్‌ అవుతుందా? అని డౌట్‌. అయితే వైజయంతీ మూవీస్‌ అధినేత (ప్రియాంక, స్వప్న, స్రవంతిల తండ్రి) అశ్వనీదత్‌కి మాత్రం డౌటే లేదు. ‘కీర్తీ యాప్ట్‌’ అన్నారు. సో.. సావిత్రిగా కీర్తీయే అని ఫిక్సయ్యారు. కీర్తీకి కథ చెప్పడానికి వెళ్లారు. కథ విన్నప్పుడు అంత పెద్ద హీరోయిన్, మహానటి పాత్రను నేను పోషించగలనా? అని డౌట్‌ పడ్డారు కీర్తీ్త. అయితే ‘మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు చేయగలుగుతారు’ అని ఆమెను ఒప్పించారు. 

‘దేవదాసు’లోని పార్వతి గెటప్‌లో టెస్ట్‌ షూట్‌
ఏదైనా క్యారెక్టర్‌కి ఒక హీరోయిన్‌ని అనుకున్నాక లుక్‌ టెస్ట్‌ చేశాక కానీ పూర్తి సంతృప్తి లభించదు. వన్‌ ఫైన్‌ డే కీర్తీకి సావిత్రిలా మేకప్‌ చేసి, టెస్ట్‌ షూట్‌ చేశారు. మేకప్‌ వేసుకుని కీర్తీ బయటకు రాగానే ‘పర్ఫెక్ట్‌ చాయిస్‌’ అని టీమ్‌ ఫిక్సయింది. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు ఆశ్చర్యపోయారట. ఫస్ట్‌ టెస్ట్‌ షూట్‌కి ‘దేవదాసు’ చిత్రంలో సావిత్రి చేసిన పారు గెటప్‌ని ప్లాన్‌ చేశారు. ఆ ఫొటోషూట్‌ చూసి ‘అదుర్స్‌’ అననివాళ్లు లేరు.

ఫోర్‌ ఏజ్‌ గ్రూప్స్‌లో సావిత్రి క్యారెక్టర్‌
ఒకటి కాదు.. రెండు కాదు.. వందకు పైగా గెటప్స్‌లో కీర్తి సురేష్‌తో ఫొటోషూట్‌ చేశారు. ఇంతకీ సినిమాలో సావిత్రి క్యారెక్టర్‌ ఏయే ఏజ్‌లో కనిపిస్తుంది? అంటే.. మొత్తం నాలుగు దశలలో కనిపిస్తారు. టీనేజ్, యంగ్‌ ఏజ్, మిడిల్‌ ఏజ్, ఓల్డేజ్‌లో ఈ పాత్ర ఉంటుందని తెలిసింది. అంటే.. సినిమాల్లోకి వచ్చిన కొత్త, స్టార్‌డమ్‌కి చేరుకున్న దశ, సినిమాలకు దూరం కావడం, ఆ తర్వాతి దశను చూపిస్తారని ఊహించవచ్చు. మెయిన్‌ షూట్‌ మొదలయ్యాక సావిత్రిలా తయారవ్వడానికి కీర్తీకి సుమారు రెండు గంటలు పట్టేది. సావిత్రి ఫొటో పక్కన పెట్టుకుని అది చూస్తూ రెడీ అయ్యేవారట.

అందుకే ఫొటోలు లీక్‌ కాలేదు
జన్రల్‌గా పెద్ద సినిమాలకు సంబంధించి తమంతట తాము అధికారికంగా ఫొటోలు విడుదల చేసేవరకూ అవి బయటకు లీక్‌ కాకూడదనుకుంటారు. దర్శకుడు శంకర్‌ అయితే షూటింగ్‌ లొకేషన్‌లోకి ఎవరూ సెల్‌ఫోన్‌ తీసుకు రాకూడదని నిబంధన విధించారు. అయినా ‘2.0’ ఫొటోలు లీకయ్యాయి. అయితే ‘మహానటి’ ఫొటోలు చిత్రబృందం విడుదల చేసేవరకూ బయటకు రాకపోవడం విశేషం. పైగా సినిమాకి పని చేసిన అందరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లేవారట. అయినా ఎవరూ దొంగచాటుగా ఫొటోలు లీక్‌ చేయకపోవడానికి కారణం సావిత్రి మీద ఉన్న గౌరవం అని యూనిట్‌ సన్నిహిత వర్గాల్లో ఒకరు తెలిపారు. అందరూ ఎంతో ప్రేమించి, ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని పేర్కొన్నారు. దీన్నిబట్టి యూనిట్‌ మెంబర్స్‌ సినిమాని ఓన్‌ చేసుకుంటే ‘లీక్‌’ అనేది ఉండదని అర్థం చేసుకోవచ్చు. అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌ అప్పుడు యూనిట్‌కి తిప్పలు తప్పలేదు. ఎవరో చాటుమాటుగా ఫొటోలు తీయడానికి ప్రయత్నించడం, వాళ్లను వారించడం జరిగేది. 

అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ‘మాయాబజార్‌’ సెట్‌లో తీసిన అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు పాటలు హైలైట్‌గా నిలుస్తాయట. ఈ సెట్‌ని క్రియేట్‌ చేయడానికి సుమారు 100 మంది 20 రోజులు వర్క్‌ చేశారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఆర్టిస్టులు వచ్చారట.

97 ఏళ్ల పెయింటర్‌.. నారాయణ 
ఇప్పుడు ఏదైనా డిజిటల్‌లో సులువుగా చేసుకోవచ్చు. అయితే న్యాచురాల్టీ కోసం మ్యానువల్‌ వర్క్‌ చేయించడం కూడా జరుగుతుంటుంది. అలా ఈ సినిమాలో కనిపించే మబ్బులు, చెట్లను పెయింటింగ్‌ వేయించారట. బాలీవుడ్‌ చిత్రాలు ‘మొఘలీ ఆజామ్, ప్యాసా’ వంటివాటికి హ్యండ్‌ పెయింటింగ్స్‌ చేసిన నారాయణ ‘మహానటి’కి పెయింటర్‌గా చేశారు. ఆయన వయసు 97. ఆ వయసులో ఆయన 20 అడు గుల నిచ్చెన ఎక్కి పెయింటింగ్స్‌ వేయడం యూనిట్‌లో ఉన్న చిన్నవాళ్లకు ఇన్‌స్పిరేషన్‌. ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నప్పుడు గతంలో తాను ఒక సావిత్రి సినిమాకి వర్క్‌ చేశానని, ఆ సినిమా పేరు గుర్తు లేదని నారాయణ అన్నారట. నారాయణకు ఇదే చివరి సినిమా. మొన్నీ మధ్యనే ఆయన మరణించారు. 

అక్కడక్కడా బ్లాక్‌ అండ్‌ వైట్‌.. మిగతాది కలర్‌..
మహానటికి హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ డానీ సంచెజ్‌ లోపెజ్‌ని తీసుకున్నారు. ఆయన ప్రొఫైల్‌ చూసి, నాగ్‌ అశ్విన్‌ ఇన్‌స్పైర్‌ అయ్యారట. ఇండియా మీద డానీకి ఉన్న  గౌరవం చూసి, ఈ సినిమాకి కెమెరామేన్‌గా తీసుకున్నారట. సినిమా ఆల్మోస్ట్‌ కలర్‌లో ఉంటుంది. అక్కడక్కడా బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్స్‌ కనిపిస్తాయి. కెమెరా వర్క్‌ ఐఫీస్ట్‌గా నిలుస్తుందట. అందుకు శనివారం రిలీజైన టీజర్‌ ఓ ఉదాహరణ.

నాలుగు రకాల బొట్లు
సావిత్రిని గుర్తు చేసుకోగానే ఆమె చక్కని ముఖారవిందం మన  కళ్ల ముందు మెదులుతుంది. అలాగే ఎక్కువగా నిలువు బొట్టులో గుర్తొస్తారు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ మొత్తం నాలుగు రకాల బొట్లు వాడారని తెలిసింది. రకరకాల సైజ్‌లో నిలువు బొట్టు, గుండ్రని బొట్టు వాడారట. మామూలుగా సావిత్రి మిడిల్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒకలాంటి బొట్టు, పెద్ద వయసులో ఇంకో రకం బొట్టు, ఇంట్లో ఉన్నప్పుడు విభూది పెట్టుకునేవారట. ఆ విషయాలను ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి దగ్గర తెలుసుకుని, అలానే ఫాలో అయ్యారట. అప్పట్లో కళ్లకు కాటుక వాడేవారు. ఈ సినిమాలో కీర్తీ కూడా కాటుక దిద్దుకున్నారు. పై రెప్పలకు మాత్రం ఐలైనర్‌ వాడారట.

చెన్నై నుంచి సవరాలు
సావిత్రి జుత్తు కొంచెం వంకీలు తిరిగి ఉంటుంది. కీర్తి సురేష్‌ హెయిర్‌ కూడా దాదాపు అలానే ఉన్నప్పటికీ ఇంకొంచెం కర్లీగా చేయించుకున్నారట. జడ, ముడి.. ఇలా రకరకాల స్టైల్స్‌లో ఆమె కనిపిస్తారట. పొడవాటి జుత్తు కోసం చెన్నై నుంచి సవరాలు తెప్పించుకున్నారట. అలాగే, ముంబై నుంచి హెయిర్‌ స్టైలిస్ట్‌ని పిలిపించుకున్నారట. ఇవన్నీ కూడా కీర్తీ తనంతట తాను ఎక్కువ కేర్‌ తీసుకుని, ప్లాన్‌ చేసుకున్నారట. 

వందకు పైగా చీరలు..
సావిత్రి కట్టూ బొట్టూ అందరికీ ఇష్టం. నిజానికి ఇప్పుడు ‘డిజైనర్‌ శారీస్, బ్లౌజెస్‌’ అంటున్నారు కానీ అవి అప్పటి ఫ్యాషనే. అప్పటి చీరలను, జాకెట్టులను తయారు చేయించడానికి బాలీవుడ్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షాని పిలిపించారు. ‘మహానటి’ కథ విన్నాక ‘నేనీ సినిమాని కచ్చితంగా చేస్తా’ అన్నారట. అప్పట్లో సావిత్రి కట్టిన చీరలను తయారు చేయడానికి ఆయన బోలెడంత రీసెర్చ్‌ చేశారు. పది మంది టీమ్‌తో నాలుగు నెలల పాటు రీసెర్చ్‌ చేసి, ‘స్పె షల్‌ ఫ్యాబ్రిక్‌’ తెప్పించి, చీరలు డిజైన్‌ చేశారు. ఒక్క ‘మాయాబజార్‌’ ఘట్టంలో వచ్చే చీర నేయడానికే మూడు నెలలు పట్టిందట. ఇక, నగల తయారీకి ఆరు నెలలు పట్టింది.

అచ్చంగా జెమినీలా..
సావిత్రి జీవితంలో తమిళ నటుడు జెమినీ గణేశన్‌ కీలక వ్యక్తి. ఆయన్ను ప్రేమించి, పెళ్లాడారామె. జెమినీ తమిళీయుడు కాబట్టి, ఆ పాత్రను వేరే భాషకు చెందిన నటుడితో చేయించాలనుకున్నారు. మమ్ముట్టి తనయుడు, హీరోగా దూసుకెళుతోన్న దుల్కర్‌ సల్మాన్‌ అయితే బాగుంటుందని తనని అప్రోచ్‌ అయ్యారు. దుల్కర్‌ సెకండ్‌ థాట్‌ లేకుండా సినిమా ఒప్పుకున్నారట. ఆయన కాస్ట్యూమ్స్‌ని అర్చనా రావ్‌ డిజైన్‌ చేశారు.

నైన్టీన్‌ఎయిటీస్‌లో మధురవాణి క్యారెక్టర్‌
ఇందులో సమంత జర్నలిస్ట్‌ మధురవాణిగా కనిపించనున్నారు. ఈ పాత్ర నైన్టీన్‌ఎయిటీస్‌లో ఉంటుంది. అంటే.. సావిత్రి కెరీర్‌ ఎండింగ్‌లో వచ్చే పాత్ర అని ఊహించవచ్చు. సో.. సావిత్రి లైఫ్‌ స్టోరీ గురించి తెలుసుకోవాలనో, ఆమె జీవితం గురించి రాయాలని ఆరాటపడే జర్నలిస్ట్‌గానో సమంత కనిపిస్తారని ఊహించవచ్చు. వాస్తవానికి టైటిల్‌ రోల్‌ చేసింది కీర్తి సురేషే అయినా సినిమాని లీడ్‌ చేసేది మాత్రం మధురవాణి పాత్రే అట. మిడ్డీస్, చుడీదార్స్, శారీస్‌లో సమంత కనిపిస్తారని తెలిసింది. ఫొటో జర్నలిస్ట్‌గా విజయ్‌ దేవరకొండ కనిపిస్తారట.

అలనాటి కారు.. కెమెరా
‘మహానటి’ టీజర్‌లో అలనాటి కారు కనిపించడం గమనించే ఉంటారు. అప్పటి కెమెరాలు, గ్రామ్‌ఫోన్‌ ఇలా.. ఎన్నో వస్తువులు మనకీ సినిమాలో కనిపిస్తాయి. ఇప్పటికీ అవి లభ్యమవుతున్నాయి. దొరకనవి చేయించారు. కొన్ని రెంట్‌కి తీసుకున్నారు. షూట్‌ మొదలుపెట్టక ముందే ఒక బ్యాంక్‌ తయారు చేసుకున్నారట. కావాల్సిన వస్తువులన్నీ సేకరించాకే షూట్‌ మొదలుపెట్టారని సమాచారం.

మాయాబజార్‌ ప్రియదర్శిని
మాయాబజార్‌లో ప్రియదర్శిని హైలైట్‌. ఈ పెట్టె తయారీకి 15 రోజులు పట్టిందట. మూడుసార్లు తయారు చేయించినా సంతృప్తిగా అనిపించలేదట. నాలుగో ప్రియదర్శిని పర్ఫెక్ట్‌గా కుదరడంతో దాన్ని ఓకే చేశారు. ‘శివమ్, ఘాజీ’ సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా చేసిన అవినాష్‌ కొల్లా వర్క్‌ చేశారు. సీనియర్‌ ఆర్ట్‌ డిజైనర్‌ ‘తోట తరణి’ ఇన్‌పుట్స్‌ కూడా తీసుకున్నారు.

మరిన్ని వార్తలు