నీటి కాపరి!

12 Feb, 2019 00:03 IST|Sakshi

40 ఏళ్లలో స్వశక్తితోనే 14 చెరువులు తవ్విన గొర్రెల కాపరి

కొండపైన చెరువులు తవ్వటం, మొక్కలు నాటడమే కెంపెగౌడ దినచర్య

మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తికి కెంపెగౌడ జీవితం గొప్ప నిలువుటద్దం. గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే ఈ సామాన్యుడు.. మూగ జీవాల దాహం తీర్చడానికి తన విశ్వరూపం చూపాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనంతట తానే కొండపైన చెరువును సృష్టించాడు. ఆ నీటితో జీవాలు దాహం తీర్చుకుంటూ ఉంటే ఆయన కడుపు నిండిపోతోంది. ఆ ఆనందమే అతనితో నలభయ్యేళ్లలో మరో 13 చెరువులు తవ్వించింది. ఒకటి తర్వాత మరొకటిగా 14 గొలుసు చెరువులు తవ్వాడు. అంతేకాదు ఇప్పుడు మరొకటి తవ్వే ప్రయత్నంలో ఉన్నాడు! సంకల్ప బలం, పట్టుదలతో కొండంత ఎదిగిన కెంపెగౌడ కథ ఇదీ..

బెంగళూరు–మాళవళ్లి–కొళ్లేగల్‌ రోడ్డు మీదుగా దేవాలయాలు సందర్శించేందుకు, చామరాజనగర్‌ జిల్లా ఎతై న కొండ ప్రాంతాలను చూసేందుకు వెళ్లే వారికి దారిలో  కెంపెగౌడ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అక్కడి అందరికీ ఆయన తలలో నాలుక వంటి వారు కావడమే అందుకు కారణం. ఆయన పేరు, కథ విన్నవారెవరైనా సెల్యూట్‌ చేసి తీరాల్సిందే. ‘మ్యాన్‌ ఆఫ్‌ లేక్స్‌’గా పేరుగాంచారు కెంపెగౌడ.  కర్ణాటకలోని మండ్య జిల్లా మాళవళ్లి తాలూకాలోని దాసనదొడ్డి అనే ఒక కుగ్రామంలో  కెంపెగౌడ పుట్టారు. ఆ గ్రామంలోని వారంతా గొర్రెల కాపరులే. 82 ఏళ్ల కెంపెగౌడను కలవాలంటే దాసనదొడ్డి గ్రామానికి వెళితే సరిపోదు.. ఆ గ్రామానికి శివార్లలో ఉన్న కుందినిబెట్టా అనే కొండ ప్రాంతానికి వెళ్లి చూడాలి.

ఎందుకంటే రోజులో 12 గంటలపాటు ఆయన అక్కడే ఉంటారు. అక్కడ తన 50 గొర్రెలను కాస్తూనో లేదా మొక్కలను నాటుతూనో లేదా చెరువులను తవ్వుతూనో కనిపిస్తారు. ఆయన కుమారులు పేదరికంతో ఆ కుగ్రామంలోనే నివసిస్తున్నారు. వారికున్న ఏకైక జీవనాధారం గొర్రెల పెంపకమే. కెంపెగౌడ సాదాసీదా రైతు, గొర్రెల కాపరిలాగే ఉన్నాడు. ఒకే చొక్కాతో ఆయన ఎప్పుడూ ఆ కొండపైనే ఉంటాడు, ఇతరులు ఇచ్చిన దుస్తులనే ధరిస్తూ ఉంటాడు. తనకంటూ కొత్త చొక్కాలు కొనుక్కోడు. చాలా అరుదుగా గడ్డం చేసుకుంటాడు. ఒక చేతి కర్ర సహాయంతో కెంపెగౌడ నడుస్తూ కనిపిస్తాడు.

కెంపెగౌడకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా రాగి ముద్ద, అంబలి, రొట్టె.. మొత్తంగా చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్నే భోజనంగా తీసుకుంటాడు. కుందినిబెట్టా కొండ ప్రాంతంలో కెంపెగౌడ ఇప్పటికి సొంత ఖర్చు, శ్రమతోనే 14 చెరువులను తవ్వాడు. 2017 వరకు మొత్తం 6 చెరువులు తవ్వాడు. కొండ మీదకు రోడ్డు వేసిన తర్వాత మిగిలిన 8 చెరువులను ఒక్క ఏడాదిలోనే తవ్వించాడు. గొర్రెలకు దాహం తీర్చడం ఒక్కటే లక్ష్యమైతే ఒకటి, రెండు తవ్వి ఆపేసేవాడే.

దాంతోపాటు ప్రకృతి చెట్టు చేమలతో పచ్చగా ఉండాలన్న ఉదాత్త లక్ష్యంతో చెరువులను తవ్వుకుంటూ వెళుతున్న ఆయనకు కెరే (చెరువులు) కెంపెగౌడ అని చుట్టుపక్కల వారు పేరు పెట్టారు. కెంపెగౌడ నిస్వార్థ సేవను గుర్తించి పలువురు నగదు బహుమతులు ఇస్తున్నారు. ఆ డబ్బును కూడా కెంపెగౌడ సొంత అవసరాలకు ఉపయోగించకుండా చెరువులు నిర్మించేందుకే వినియోగిస్తున్నాడు. చెరువులు తవ్వేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, కూలి ఖర్చులకు ఆ డబ్బునే వినియోగిస్తూ మరిన్ని చెరువులను తవ్వుతున్నాడు. 

గొర్రెలకు దాహం తీర్చేందుకు...
కెంపెగౌడ 40 ఏళ్ల క్రితం తొలి చెరువును నిర్మించాడు. గొర్రెలు, మేకలను మేపేందుకు తాను కొండపైకి తీసుకెళ్తుండేవాడినని, మేత మేసిన తర్వాత వాటికి తాగడానికి నీరు దొరికేది కాదు. చుట్టుపక్కల చెరువులు కానీ, కాల్వలు కానీ లేకపోవడంతో వాటి దప్పిక ఎలా తీర్చాలనే బెంగ కెంపెగౌడకు పట్టుకుంది. తాగు నీరు లేకపోవడంతో క్రూరమృగాల సంచారం కూడా చాలా తక్కువగా ఉండేది. పశువులు ఒకవైపు మేత మేస్తుంటే కెంపేగౌడ మాత్రం చెరువును తవ్వేవాడు. తొలినాళ్లలో అక్కడి స్థలాన్ని తవ్వేందుకు కట్టెనే  ఉపయోగించాడు. తొలిసారి నేలను తవ్వినప్పుడు అదృష్టం కొద్ది అడుగుల్లోనే నీరు బయటకు వచ్చింది. చెరువు తవ్వేందుకు తనకు నెలలకు నెలలు సమయం పట్టేది.

చెరువులో నీరు పడ్డాక వెంటనే దానికి అనుసంధానంగా మరో చెరువును తవ్వడం ప్రారంభించాడు. కట్టెతో తవ్వడం ఎంతో ఇబ్బందిగా ఉండి పని సరిగ్గా సాగకపోవడంతో, కొన్ని గొర్రెలను అమ్మేసి ఆ సొమ్ముతో ఇనుప పనిముట్టును కొనుగోలు చేశాడు. తొలి చెరువు తవ్వాక గొర్రెల దాహార్తి తీరడంతో చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత దాని వాలులో ఒక్కొక్కటిగా 14 చెరువులు తవ్వాడు. నిరక్షరాస్యుడైన కెంపెగౌడ చెరువులను నిర్మించే కొద్దీ వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతికతలు, నీటి ప్రవాహ తీరు తదితర వివరాలన్నీ అర్థమయ్యాయి. ప్రస్తుతం ఆ 14 చెరువులు ఎలా అనుసంధానమై ఉన్నాయి. ఒక చెరువు నిండితే మరో చెరువుకు నీరు ప్రవహిస్తుంది.
 
తొలి చెరువు ‘గోకర్ణ’...

గత ఏడాది ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌ ఆయన సమాజ సేవను గురించి తెలుసుకొని నగదు అందజేశాడు. ఆ డబ్బుతోనే కొండపైకి రోడ్డును నిర్మించాడు కెంపెగౌడ. ఆ రోడ్డు వేసిన తర్వాత సులువుగా మరికొన్ని చెరువులు తవ్వానన్నాడు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు వెళ్లడం వల్ల అన్ని చెరువులకూ జల కళ వచ్చింది. ఈ ఏడాది ఆ కొండపైనే 2 వేలకు పైగా అరటి మొక్కలు నాటాడు. కెంపెగౌడ చదువుకోలేదనే మాటే కానీ పురాణాలపై మంచి పట్టు ఉంది. ఆయన తవ్విన తొలి చెరువుకు ‘గోకర్ణ’ అని పేరు పెట్టుకున్నాడు. ఇక చెరువులను కలుపుతూ నిర్మించిన రోడ్డుకు రామలక్ష్మణ అని పేరు పెట్టాడు. 

82 ఏళ్లలోనూ పూర్తి ఆరోగ్యం...
82 ఏళ్ల వయసులోనూ కెంపెగౌడ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. చాలా ఉత్సాహంగా వేగంగా కొండ ఎక్కుతూ, దిగుతూ కనిపిస్తాడు. ఉదయం 8 గంటలకు తన దినచర్యను ప్రారంభిస్తాడు. ఇటీవలే కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. గత 40 ఏళ్లుగా కెంపెగౌడ రోజుకి 12 గంటల పాటు కొండపైనే గడుపుతున్నాడు. ఉదయం కొండపైకి వెళితే తిరిగి రాత్రికే ఇంటికి తిరిగి వచ్చేవాడు. ప్రభుత్వం ఆ కొండను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని పలువురు సామాజిక కార్యకర ్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 

రాజ్యోత్సవ పురస్కారం...
ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కెంపెగౌడకు ప్రముఖ రాజ్యోత్సవ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. గతేడాది నవంబర్‌ 1న రాజ్యోత్సవ పురస్కారాన్ని కెంపెగౌడకు ప్రభుత్వం అందజేసింది. ఈ అవార్డు కింద అందజేసిన రూ. లక్ష నగదును సైతం కొత్త చెరువు తవ్వేందుకే ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 15వ చెరువును త్వరలోనే పూర్తి చేస్తానంటూ అమాయకంగా బోసి నవ్వులు నవ్వుతున్నాడు కెంపెగౌడ! 

మేకలు, గొర్రెల పెంపకం, యాజమాన్యంపై డిప్లొమా
మేకలు, గొర్రెల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్‌ తదితర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు లక్‌నవూ(ఉత్తరప్రదేశ్‌)లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గోట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ‘డిప్లొమా ఇన్‌ లైవ్‌స్టాక్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. ఇది 6 నెలల డిప్లొమా కోర్సు. ఫీజు రూ. 50 వేలు. ప్రతిభావంతులకు ఫీజు సగం వరకు తగ్గింపు అవకాశం ఉంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు. ఏప్రిల్‌ 15 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు.. +91 86018 73054/55/60/63, ఠీఠీఠీ.జీజీజఝ్చ.ఛిౌ.జీn

23న కరీంనగర్‌లో ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. సేంద్రియ రైతు సమ్మేళనం
కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్‌.సి.ఓ.ఎఫ్‌.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్‌ (కలెక్టరేట్‌ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. – సా. 5 గం. వరకు రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్‌ డీ కంపోజర్‌ టెక్నాలజీతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, పిజిఎస్‌ ఇండియా సర్టిఫికేషన్, సేంద్రియ మార్కెట్‌ అనుసంధానంపై సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. డైరెక్టర్‌ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. వూట్ల ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. వివరాలకు.. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు సముద్రాల జనార్దన్‌రావు– 93969 69217, 84640 09350. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు