కేరళ పట్టు... ఈ కలరిపయట్టు!

31 Jan, 2014 00:24 IST|Sakshi
కేరళ పట్టు... ఈ కలరిపయట్టు!

భారతీయ అతి ప్రాచీన యుద్ధ కళ... కరాటే, కుంగ్ఫూ, సమురాయ్ అంటూ గొప్పగా చెప్పుకునే విదేశీయులంతా మన దేశంలోని సామాన్య సైనికుని ముందు తలవంచేలా నిలబెట్టిన కళ...  యుద్ధ చాతుర్యం గల శక్తిని ప్రసాదించగలిగిన కళ.... ‘కలరిపయట్టు.’
 
 ‘కలరి’ అంటే పాఠశాల,‘పయట్టు’ అంటే యుద్ధం. ప్రపంచంలోని అతి ప్రాచీన మార్షల్ ఆర్ట్‌గా ఈ కళకు గుర్తింపు ఉంది. అయితే శాస్త్రీయ సంగీతానికి, పాప్ సంగీతానికి ఎంత తేడా ఉంటుందో కలరిపయట్టుకు- ఇతర మార్షల్ ఆర్‌‌ట్సకు అంత వ్యత్యాసం ఉంటుంది.  

 ఆద్యుడు పరశురాముడు

 పరశురాముడిని ఈ విద్యకు ఆద్యునిగా భావిస్తారు. ఆ విధంగా కేరళీయుల యుద్ధక్రీడగా కలరియపట్టు పేర్గాంచింది. క్రీస్తుపూర్వం 15-16 శతాబ్దాలలో యోధుల మధ్య గొడవలను సద్దుమణిగేలా చేయడానికి ఈ యుద్ధ విద్యను అనుసరించేవారట. చోళరాజ్య సైనిక గురువు ఇలంకులం పిళ్లై కాలంలో ఈ విద్య పాఠశాలల్లో కలారిగా నేర్పబడేది. అప్పటి సైన్యాధ్యక్షతను, రాజ్యాధికారాన్ని కూడా ఈ విద్యే నిర్ణయించేది. పరీక్ష పద్ధతుల ద్వారా ఉత్తమ విద్యార్థులను ఎంచి రాజ్యసంరక్షణకు అవకాశం కల్పించేవారు. హిందూధర్మం ప్రకారం సమర్థుడు విద్యార్థిగా వస్తే విద్యను నేర్పించాలి. అలా బౌద్ధ సన్యాసులు ఈ విద్యను నేర్చారు. వారివల్ల పొరుగు దేశాలైన శ్రీలంక, మలేసియన్‌లకు ఈ కళ పరిచయం అయ్యింది. అటు విదేశాలకూ ఈ కళ గొప్పతనం తెలిసింది.  
 
యోగవిద్య ప్రముఖ పాత్ర...

 ఈ విద్యను నేర్పే గురువులను నాయర్ లేదా ఇలావార్ అంటారు. ‘కలారి పనికర్’ అనే తెగవారు ఈ విద్యను నేర్పుతారు. దీంట్లో మల్లయుద్ధం, కత్తి యుద్ధం, గదా యుద్ధం, ఉరుమి, కర్రసాము.. ముఖ్యమైనవి. ఆయుధాలు లేకుండాను, కత్తి-డాలుతోను, పరిగ లాంటి బరువైన వస్తువులతోనూ, కొరడా లాంటి లోహపదార్థ ఆయుధంతోనూ, కర్రలతోనూ శిక్షణ పొందుతారు. వీరి తర్ఫీదు లో యోగవిద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 
వాస్తుశాస్త్రం...

 కలరి నిర్మించేటపుడు వాస్తుశాస్త్ర పద్ధతులను కచ్చితంగా పాటించాలనేది గురువుల మాట. మంత్ర, తంత్ర, మర్మ శాస్త్రాలను కలరిలో శక్తులను బ్యాలెన్స్ చేయడానికి ఆశ్రయిస్తారు. ఈ కళ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇందులోని శరీర కదలికలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఇతర శిక్షకులెందరో ఇప్పుడు కలరిపయట్టు పట్ల ఉత్సాహం చూపుతున్నారు. అయితే శాస్త్రీయ సంగీతానికి కఠోర సాధన ఎంత అవసరమో కలరిపయట్టు ఒంటపట్టడానికి అంత సాధనా అవసరం.
 

మరిన్ని వార్తలు