ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని..

8 Sep, 2013 23:49 IST|Sakshi
ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని..

ఖైరతాబాద్ వినాయకుడి పేరు చెప్పగానే ఆకాశమెత్తు గణనాథుడు కళ్లముందు దర్శనమిస్తాడు. అంతెత్తు వినాయకుడిని చూడగానే ఆ విగ్రహానికి రూపాన్నిచ్చిన రాజేందర్‌ను చాలామంది తలచుకుంటారు. నిజమే మరి... మూడునెలలపాటు కృషి చేస్తేగాని ఆ బొజ్జగణపయ్య మన ముందుకు రాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలే ఈరోజు మన కళాత్మకం.
 
ప్ర: ఇప్పటివరకూ మీ చేతిలో ఎన్ని ఖైరతాబాద్ వినాయక విగ్రహాలు తయారయ్యాయి?
జ: ఇప్పటివరకూ నేను పాతిక విగ్రహాలు చేశాను. ప్రస్తుతం మన కళ్లముందున్నది 59 అడుగుల విగ్రహం. 1978 నుంచి నేను చేస్తున్నాను. మధ్యలో తొమ్మిదేళ్లు చేయలేకపోయాను. 1978కి ముందు ధూల్‌పేట్ నుంచి విగ్రహాన్ని తెచ్చిపెట్టేవారు. నా చేతిలో తయారైన పాతిక విగ్రహాలకు పాతిక రకాల రూపాలు ఇచ్చాను.
 
ప్ర: అన్ని విగ్రహాల్లోకి మీకు బాగా పేరు తెచ్చిన రూపం..?
జ: 1982వ సంవత్సరంలో ఎలుక రూపంలో తయారుచేసిన గణేశవిగ్రహం నాకు బాగా పేరు తెచ్చింది. దర్శకులు కె విశ్వనాథ్‌గారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు ఆయన దర్శకత్వం వహించిన ‘సాగరసంగమం’ సినిమా షూటింగ్ కూడా ఆ విగ్రహం ముందు తీశారు. కమలహాసన్ నృత్యం చేస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. అలాగే విశ్వరూపం ఆకారంలో చేసిన వినాయకుడికి కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. ‘ఆది నేనే... అంతం నేనే’ అనే అర్థం వచ్చేట్టు విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ విగ్రహం ప్రతిక్షణం నా కళ్లలోనే ఉంటుంది.
 
ప్ర: ప్రస్తుతం విగ్రహం రూపం ఏమిటి?
జ: గో నాగచతుర్ముఖ వినాయకుడు. ఈ వినాయకుడు విగ్రహం తయారుచేయడానికి మూడు నెలల సమయం పట్టింది. రూపం తేవడానికి ఎంత కృషి చేస్తామో రూపాన్ని ఎన్నుకోవడానికి అంతే ఆలోచిస్తాం. ఏటా ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రూపాన్ని నిర్ణయిస్తాం. ఈ ఏడాది గోవధ గురించి వచ్చిన వార్తలు మా మనసుని కలచివేశాయి. అందుకే ఆవుని రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈసారి గోనాగ చతుర్ముఖ విగ్రహాన్ని తయారుచేశాను. కనీసం ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని మా ఆశ.
 
ప్ర: ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ‘ఎత్తు’ సమస్య గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. మీరేమంటారు?
జ: 2000 సంవత్సరంలో 63 అడుగుల అతి ఎత్తై విగ్రహం తయారుచేశాం. కొన్ని ఇబ్బందుల కారణంగా తర్వాతి ఏడాది నుంచి పొడవు తగ్గించేశాం. ప్రస్తుత విగ్రహం పొడవు 59 అడుగులు. వచ్చే ఏడాదికి ఖైరతాబాద్ విగ్రహానికి 60 ఏళ్లు. అందుకే వచ్చే ఏడాది 60 అడుగుల విగ్రహం తయారుచేసి ఆ పై ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించి తయారుచేస్తాను. ఏటా ఒక అడుగు తగ్గించుకుంటూ అరవై ఏళ్లనాటికి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా ఇంట్లో వినాయకుడిలా ఒక్క అడుగులో దర్శనమివ్వాలనేది నా కోరిక.
 
ప్ర: వినాయకుడి ‘రంగుల’ మాటేమిటి
జ: వాతావరణాన్ని కలుషితం చేసే రంగులకి నేను వ్యతిరేకినే. పూర్వం వాడిన రంగులు నిజంగానే హానికరమైనవి. ఎప్పుడైతే వీటి గురించి ఆలోచించడం మొదలెట్టామో... అంటే... 2000 సంవత్సరం నుంచి కేవలం వాటర్‌పెయింట్స్ మాత్రమే వాడుతున్నాం.

- భువనేశ్వరి
 

మరిన్ని వార్తలు