సేవకుడి తప్పు

21 Dec, 2018 01:46 IST|Sakshi

ఖలీఫా ఉమర్‌ (రజి) కు చేపలంటే ఎంతో ఇష్టం. చేపలు తినాలన్న కోరికను తన సేవకుడి ముందుంచేవారు. సేవకుడు చేపలు తెస్తానని బయల్దేరితే మాత్రం ‘‘చేపలకోసం ఎనిమిది మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది’’ అని చెప్పి వారించేవారు. కానీ ఆరోజు సేవకుడు మాత్రం ఈ రోజెలాగైనా ఖలీఫాకు చేపలు వండి పెట్టాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. ఖలీఫా నమాజుకు వెళ్లడం చూసి రాజ్యంలోని మేలుజాతి గుర్రాన్ని ఒక్క దౌడు తీయించాడు. ఎనిమిది మైళ్ల దూరం ప్రయాణించి ఆరోజు చేపల గంపను తీసుకుని వచ్చాడు సేవకుడు. ఎనిమిది మైళ్ల దూరం వెళ్లి చేపలు తెచ్చాననే విషయం ఖలీఫాకు  తెలిస్తే తన పని అయిపోయినట్లేననే భయంతో అనుమానం రాకుండా  అశ్వానికి స్నానాల శాలలో స్నానం చేయించాడు.

గుర్రం సేదతీరేందుకు నీడన కట్టేశాడు. సాయంత్రం ఖలీఫా ఉమర్‌ ఇంటికొచ్చాక సంతోషంతో చేపల గంపను ఆయన ముందుంచాడు. ‘‘కాసేపట్లో రుచికరమైన చేపల కూరను మీముందుంచుతాను’’ అని ఎంతో ఆతృతతో చెప్పాడు. ఈ మాటలు విన్న ఖలీఫా వెంటనే గుర్రం దగ్గరకెళ్లి తన చేయిని గుర్రంపై నిమిరారు. కాళ్లకు మర్దన చేశారు. ఆ తరువాత గుర్రం చెవులను పరిశీలనగా చూశారు. గుర్రం చెవుల కింద చెమటలు పట్టి ఉన్నాయి. ‘‘గుర్రాన్ని చక్కగా స్నానం చేయించావు బావుంది కానీ గుర్రం చెవుల వెనుక పట్టిన చెమటను తుడవడం మర్చిపోయావు’’ అని సేవకుడిని సున్నితంగా మందలిస్తూ చెప్పారు.

ఆ మరుక్షణమే ఖలీఫా ఉమర్‌ (రజి) తన మోకాళ్లను నేలపై ఆనించి తన సేవకుడితో ‘‘ప్రళయం రోజున ‘ఓ అల్లాహ్‌ ఉమర్‌ చేపలు తినే కోరికను తీర్చుకునేందుకు నోరులేని నన్ను పదహారు మైళ్లు పరుగెత్తించాడు’ అని ఈ గుర్రం అల్లాహ్‌ కు ఫిర్యాదు చేస్తే నేనేం సమాధానం చెప్పుకోవాలి’’ అని సేవకుడిని నిలదీశారు. ‘‘మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకింత దుఖం కలగలేదు. ఈ రోజు నా దుఃఖానికి అంతులేకుండా పోయిందం’’టూ వెక్కి వెక్కి ఏడ్చారు. సేవకుడు చేసిన తప్పుకు దండించకుండా ఆ తప్పును తానే చేసినట్లు పశ్చాత్తాపం చెందారు. సేవకుడితో ‘‘గుర్రానికి ఈరోజు ఎక్కువ మేత పెట్టు. తెచ్చిన ఈ చేపల గంపను తీసుకెళ్లి పేద కుటుంబానికి ఇచ్చి ఉమర్‌ (రజి)కి క్షమాభిక్ష పెట్టమని అల్లాహ్‌ను వేడుకోమని చెప్పు’’ అని చెప్పారు. ఖలీఫా ఉమర్‌ (రజి) దైవభక్తికి, దైవ భీతికి మచ్చుతునక ఈ సంఘటన. 

– ముహమ్మద్‌ ముజాహిద్‌  

మరిన్ని వార్తలు