ఖ్వాజా బందే నవాజ్ దర్గా గుల్బర్గా

19 Jul, 2016 22:55 IST|Sakshi
ఖ్వాజా బందే నవాజ్ దర్గా గుల్బర్గా

పుణ్య క్షేత్రం
 
ప్రతి మనిషీ దేవుని సంతానమే.
ప్రతి మనిషీ ఇంకో మనిషిని ప్రేమించాలి.
మతం ఏదైనా కులం ఏదైనా సమూహం ఏదైనా
మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం...
అని బోధించిన మహనీయుడు ఖ్వాజా బందే నవాజ్.
‘బందా’ అంటే ‘మనిషి’.
‘నవాజ్’ అంటే ‘ప్రియమైన’...
 ఆయన మనుషులకు ప్రియమైన వాడు.
మనుషులను ప్రియమైనవారిగా చూసేవాడు.
ఆయన మనుషులను అక్కున చేర్చుకునే మహనీయుడు.
 

గుల్బర్గా చీకూ చింతా లేని ఊరు.  ఎదగడానికి తొందరపడే ఊరులా కనిపించదు. ప్రశాంతమైన జనం... తీరిగ్గా ఉండే జీవనం. దిగిన వెంటనే మనకు ‘హాఫ్ ఆటో’ అనే మాట వినిపిస్తుంది. ‘షేర్ ఆటో’కు అది అక్కడ సమానార్థకం. ఆఫ్ ఆటోలో ఎక్కితే పది రూపాయలకు కావలసిన దూరంలో దింపుతారు. ‘ఫుల్ ఆటో’ అంటే మనకు మాత్రమే. అప్పుడు మనం బేరం చేసుకుని కావలసిన చోటుకు మాట్లాడుకోవాలి. నలభై రూపాయలకు చాలా దూరం వస్తారు. వంద రూపాయలకు దాదాపు ఊరు చుట్టేయొచ్చు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా 220 కిలోమీటర్ల దూరం. ముంబై వెళ్లే ట్రైన్లన్నీ ఇక్కడ ఆగుతాయి. మధ్యాహ్నం ‘పూణె శతాబ్ది’ ఉంది. ఎక్కితే మూడున్నర గంటల్లో శ్రమ లేకుండా దించుతుంది. స్టేషన్ నుంచి నాలుగడుగుల దూరంలోనే హోటల్స్ ఉన్నాయి. భారీ హోటల్స్ కాదు. మధ్యస్తంవి. ఉండొచ్చు. ఊళ్లో ఒక మంచి హోటల్ ఉంది. దానికి మాత్రం ముందే బుక్ చేసుకొని వెళ్లడం ఉత్తమం. లేకుంటే రూములు దొరకవు. హైదరాబాద్ నుంచి వెహికిల్ మాట్లాడుకుని వెళ్లేవాళ్లే ఎక్కువ. వికారాబాద్, వాడి మీదుగా శ్రమ లేకుండా చేరుకోవచ్చు.
 
కలబురగి....
గుల్బర్గా అసలు పేరు కలబురగి అని అంటారు. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఆ రాజ్యం కింద ఉంది. ఇక్కడ ఆ కాలం నాటి కోట ఉంది. గట్టి రాతితో కట్టిన కోటను ‘కలబురగి’ అన్నారు. అదే ఆ ఊరి పేరైంది. అయితే ఆ తర్వాత వచ్చిన బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. అప్పుడు వారు ఆ ఊరిని అధికారికంగా ‘ఎహసేనాబాద్’ అని పెట్టుకున్నా ‘గుల్’ అనగా పూలతోటలు ఉన్న ఊరు కనుక జనసామాన్యంలో ‘గుల్బర్గా’ అన్నారు. చాలా కాలం అదే పేరు కొనసాగినా తాజా కర్ణాటక ప్రభుత్వం మళ్లీ పాత పేరును అధికారిక పేరుగా మార్చింది. కనుక ఊళ్లో ప్రభుత్వ బోర్డులు కలబురగి అని, ప్రజల బోర్డులు గుల్బర్గా అని ఉంటాయి.

దర్గా...
గల్బర్గా- దేశం మొత్తానికి అక్కడ ఉన్న దర్గా వల్లే ప్రసిద్ధి. మన దేశంలో ఎక్కువ ప్రాముఖ్యం కలిగిన దర్గాగా రాజస్తాన్‌లో ఉన్న అజ్మీర్ దర్గాను భావిస్తారు. అక్కడ ఉన్న సూఫీ గురువును ఖ్వాజా గరీబ్ నవాజ్ అని పిలుస్తారు. గరీబ్ అంటే పేద. ఆయన పేదల పెన్నిధి. దక్షిణాదిన ఉన్న గుల్బర్గా దర్గాలో ఉన్న సూఫీ గురువును బందే నవాజ్ అని పిలుస్తారు.
 
అసలు పేరు...
ఖ్వాజా బందే నవాజ్ అసలు పేరు సయ్యద్ ముహమ్మద్ హుసేని. భక్తులు ఆయనను ‘హజరత్ ఖ్వాజా బందే నవాజ్ గైసు దరజ్’ అని పిలుచుకుంటారు.‘ఖ్వాజా’ అంటే ‘గురువు’ అని అర్థం. బందే నవాజ్ 14-15 శతాబ్దాల కాలంలో జీవించారు. వీరి పూర్వికులది ఇస్లామీయ మహాపురుషులలో ఒకడైన హజరత్ అలీ వంశం అని భావిస్తారు. ఆ వంశానికి చెందినవారు ఢిల్లీకి వచ్చి స్థిరపడగా అక్కడ బందే నవాజ్ జన్మించారు. ఈయనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు వీరి కుటుంబం దౌలతాబాద్ వెళ్లిపోయింది. అక్కడే పదిహేనేళ్ల వరకూ ఉండి ఇస్లామీయ విద్యపై మక్కువతో ఢిల్లీలో ఉన్న సూఫీ గురువు హజరత్ నసీరుద్దీన్ చిరాగ్ దెహల్వి దగ్గర శిష్యరికానికి వచ్చారు. హజరత్ నసీరుద్దీన్ ప్రఖ్యాత సూఫీ గురువు హజరత్ నిజాముద్దీన్‌కు శిష్యులు.
 
ఆగని చదువు...
 బందే నవాజ్ తన గురువు నసీరుద్దీన్ దగ్గర విద్యను అభ్యసించారు. అది ఒక స్థాయికి చేరుకుంది. ఇక నేను చదువు ఆపవచ్చునా అని గురువును అడిగారట. నిజానికి అంతటితో ఆపితే నష్టం లేదు. కాని ఆ గురువు- లేదు.. కొనసాగించు నీ నుంచి నేను చాలా ఆశిస్తున్నాను అన్నారట. ఆ తర్వాత బందే నవాజ్ తన ఆధ్యాత్మిక చదువును మరింత లోతులకెళ్లి కొనసాగించారు. ఆయన 105 సంవత్సరాలు జీవించారు. తన జీవితకాలంలో 105 విశిష్టమైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. ఏవీ కలం పట్టి రాయలేదు. చెప్తూ ఉండగా సహాయకుడు రాసి పెట్టడమే. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేయనున్నాడని బందే నవాజ్ జోస్యం చెప్పినట్టుగా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేసి ఆ నగరాన్ని సర్వనాశనం చేసినప్పుడు బందేనవాజ్‌ను బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తన గుల్బర్గాకు వచ్చి ఉండిపోవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. అలా తన 76వ ఏట గుల్బర్గా వచ్చిన బందే నవాజ్ అక్కడే 105 సంవత్సరాల వరకూ జీవించి క్రీ.శ. 1422లో దైవ సన్నిధికి చేరుకున్నారు.
 
మనసును తాకే ప్రశాంతత...
గుల్బార్గా దర్గాకు స్టేషన్ నుంచి అరవై రూపాయలు ఆటో చెల్లించి చేరుకోవచ్చు. దర్గా ఊళ్లో కొంచెం లోపలి ప్రాంతంలో ఉంటుంది. దర్గా ఆవరణలో పూల దుకాణాల వారు పూల చాదర్‌లు అమ్ముతుంటారు. వాటిని కొని దర్గాలో సమర్పించవచ్చు. దేశంలో చాలా దర్గాలు ఉన్నాయి. కాని గుల్బర్గా దర్గా ఎంతో విశాలమైన ప్రశాంతమైన దర్గా అనిపిస్తుంది. గురుసమాధి ఉన్న టూంబ్ ఎంతో విశాలంగా ఏ.సిలు బిగించి తొడతొక్కిడి లేని దర్శనం కలిగి హాయిగా ఉంటుంది. మనసులో ఉన్నది నివేదించుకుంటే నెరవేరుతుందని నమ్మిక. అసలు హోటళ్లు అవసరం లేకుండా దర్గాలోనే నిద్ర చేసే వీలుంది. దర్గా ఆవరణలోని విశాలమైన షెడ్లు రాత్రిళ్లు నిద్రపోవడానికి వీలుగా ఉంటాయి. భక్తుల కోసం స్నానాల గదులు, టాయిలెట్లు ఉన్నాయి. చాలామంది భక్తులు హోటల్ గదుల జోలికి పోకుండా రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోతారు.
 
అన్ని మతాల కూడలి...
గుల్బర్గా దర్గాకి అన్ని మతాల వాళ్లు వస్తారు. ఖ్వాజా బందే నవాజ్ చెప్పినట్టుగా మనిషిని మనిషి ప్రేమించడానికి మతం అడ్డుకాదు అనే భావనకు ఆ తావు ఒక సాక్ష్యం పలికినట్టు ఉంటుంది. గుల్బర్గాలో బస చేసి తెల్లవారు జామున దర్గాను సందర్శించి చూడండి. మీ మనసుకు అమితమైన ప్రశాంతత చేకూరుతుంది. మీ ఆందోళనలన్నీ చెదిరి పోయి మీ ధైర్యం స్థిరపడి ముందుకు వెళ్లే స్థిమితత్వం వస్తుంది.  గురుమార్గం- తప్పక అనుసరణీయమైన మార్గం.  - కెవికె కుమార్
 
ఆయన మహిమను చూస్తారా..?

బందేనవాజ్ తన గురువుకు సేవ చేసే సమయంలో కురులను పొడవుగా పెంచారట. ఒకసారి గురువును పల్లకీలో మోసుకుంటూ వెళుతూ ఉండగా ఆ కురులు పల్లకీ అంచులో చిక్కుకుపోయాయి. ఎంతో నొప్పి కలుగుతున్నా గురువుకు అంతరాయం కలుగుతుందని ఆ సంగతి చెప్పలేదు. సాధారణంగా మిగిలిన బోయీలు చేయి మార్చుకుంటారు. తన కురులు చిక్కుకుపోవడం వల్ల మరొకరికి భుజం మార్చకుండా అలాగే పల్లకీని మోశారు. ఈ సంగతి తెలిసి గురువు పులకించి పోయి ‘గైసు దరజ్’ బిరుదు ఇచ్చారు.
     బందే నవాజ్ సమక్షంలో ఒక అనుయాయి ఒక వ్యక్తిని ‘నువ్వు’ అని సంబోధించాడు. దానికి బందే నవాజ్ అభ్యంతరం చెప్పారు. ‘అతడు హిందువు. కనుక నువ్వు అన్నాను’ అన్నాడు అనుయాయీ. ‘దానికంటే ముందు అతడు మనిషి. మనిషిని గౌరవించు’ అని హితవు చెప్పారు బందే నవాజ్.
     
బందే నవాజ్ మహిమాన్వితం పట్ల అనుమానాలున్న ఒక పెద్ద మనిషి ఒకసారి బందేనవాజ్‌ను దర్శించడానికి వచ్చి ఆ సమయంలో ఆయన చేతిలో ఉన్న విసన కర్రను చూసి ఇది నాకు ఇస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు బందే నవాజ్ ఆ పెద్ద మనిషితో ‘ఒక ఊళ్లో ఒక గాడిదకి దొంగలని పట్టడం తెలుసు. దాని కళ్లకు గంతలు కట్టి అనుమానితుల దగ్గర వదిలేస్తే అది నేరుగా వెళ్లి దొంగ కట్టుకున్న పంచెను పట్టుకుని లాగుతుంది. మహిమలు చూపితే నేనూ ఆ గాడిదతో సమానం అవుతాను. ఇదిగో విసనకర్ర కోరుకున్నావుగా. తీసుకెళ్లు’ అని ఇచ్చేశారు.

ఒక ముసలామె బందే నవాజ్ మహిమను ఎగతాళి చేయదలచి జనాజా (శవవాహనం)లో తన కొడుకును పడుకోబెట్టి నలుగురితో కూడి బందే నవాజ్ దగ్గరకు వచ్చి నా కొడుకు చనిపోయాడు... జనాజా నమాజు చదవండి అని ప్రాధేయపడింది. ఆయన నమాజు చదవడం మొదలెడితే కొడుకు నవ్వుతూ లేచి నిలబడి ఆయనను ఎగతాళి చేయాలని ఉద్దేశ్యం. బందే నవాజ్ జనాజా నమాజు చదివారు. నమాజు పూర్తయినా కొడుకు లేవలేదు. తల్లి వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు. చేసిన తప్పుకు లెంపలు వేసుకుని ఆమె బందే నవాజ్ కాళ్ల మీద పడింది. బందే నవాజ్ ఆమెను క్షమించిన మరుక్షణం కొడుకు శరీరం ప్రాణంతో కదిలింది.
 
 

మరిన్ని వార్తలు