బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌

11 Jan, 2020 02:11 IST|Sakshi

యంగ్‌ బాలీవుడ్‌ –10 / కియరా అద్వానీ

కియరా అద్వానీ ‘లస్ట్‌ స్టోరీస్‌’లో కోరికలున్న టీచర్‌గా చేసింది. ‘స్పెర్మ్‌’ తారుమారు కాగా మరొకరి బిడ్డను గర్భాన మోసే తల్లిగా ‘గుడ్‌ న్యూస్‌’లో నటించింది. కబీర్‌ సింగ్‌లో పెళ్లికి ముందే బోయ్‌ ఫ్రెండ్‌తో సామీప్యానికి వెరవని ప్రియురాలిగా నటించింది. అదే కియరా అద్వానీ ‘భరత్‌ అనే నేను’లో తెలుగువారికి నచ్చినట్టుగా ఎంతో అందంగా కనిపించింది. ఆమెకు అందం ఉంది. ఆమెలో పాత్ర కోసం చేయదగ్గ సాహసం ఉంది. కియరా ఇప్పుడు బాలీవుడ్‌ను తన చుట్టూ తిప్పుకుంటోంది.

2018 కియారా అద్వానీ కెరీర్‌లో ముఖ్యమైన సంవత్సరం. ఆ సంవత్సరంలోనే ఆమె రెండు సినిమాలు రిలీజయ్యాయి. థియేటర్లలో ‘భరత్‌ అనే నేను’. నెట్‌ఫ్లిక్స్‌లో ‘లస్ట్‌ స్టోరీస్‌’. భరత్‌ అనే నేనులో కియరా ముఖ్యమంత్రి అయిన మహేశ్‌బాబుకు గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపిస్తుంది. చక్కటి ఆహార్యంలో ముగ్ధ రూపంలో మహేశ్‌ను ఆమె ఆకట్టుకుంటుంది. కాని ‘లస్ట్‌ సోరీస్‌’లో ఆమె కథ వేరు. ఆమెకు ఆ సినిమాలో భర్త ఉంటాడు. అతనితో సాన్నిహిత్యానికి వంక ఉండదు. కాని అది ఆమెకు సరిపోదు. అలా సరిపోక పోవడం మన సంస్కృతిలో నిషిద్ధ చర్చాంశం. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది అసలు ఉన్నట్టుగా తెలియనట్టే నటిస్తుంటారు. ఆ సినిమాలో కియరా పాత్ర తనకు కోరిక ఉన్నట్టు గ్రహిస్తుంది. భర్త ఉన్నా భర్త ఇవ్వదగినది ఇస్తూ ఉన్నా చాలనంత కోరిక ఉన్నట్టు గ్రహిస్తుంది. కోరిక ఉన్నట్టు గ్రహించడం ఏం తప్పు. అడ్డదారులు తొక్కకుండా దానిని ఆమె వ్యక్తపరచడమే ఆ సినిమాలో తప్పు అవుతుంది.

అత్తగారు ఆమెను అనాదరిస్తుంది. భర్త దూరమవుతాడు. కాని భర్త ఆమెను పూర్తిగా అర్థం చేసుకొని చివరకు చేరువ అవుతాడు. కియరా అద్వానీ ఆ పాత్రను నిర్వహించిన తీరును అందరూ మెచ్చుకున్నారు. ఒకవైపు భరత్‌ అనే నేను పెద్ద హిట్‌ అయ్యింది. లస్ట్‌ స్టోరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్‌ హిట్‌ అయ్యింది. కియరా అద్వానీ తిరుగులేని స్టార్‌గా అవతరించింది. కియరా అద్వానీ డబ్బున్న కుటుంబంలో (1992) జన్మించింది. ఆమె తండ్రి సింధి. తల్లిది ముస్లిం–ఐరిష్‌ జాతీయతలు ఉన్న కుటుంబ నేపథ్యం. తల్లికి యాడ్స్‌ చేయడం సరదాగా ఉండేది. కియరా చిన్నప్పుడే తల్లితో కలిసి విప్రో బేబీ ప్రాడక్ట్స్‌ యాడ్‌లో నటించింది. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఉండే ఇంటికి పెద్ద కూతురుగా పుట్టిన కియరాను తండ్రి ఏ మాత్రం గ్లామర్‌ ఫీల్డ్‌లో రాకూడదని కోరుకున్నాడు. కాని కియరాకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఇది ఎంత తండ్రికి చెప్పినా వినేవాడు కాదు. కాని చిత్రంగా ఆయన మనసు మారింది.

దానికి కారణం రాజు హిర్వాణి తీసిన ‘త్రీ ఇడియట్స్‌’ సినిమా. పిల్లలను వారికి ఏది నచ్చితే అది చేయనివ్వాలి, దేనిలో వారు రాణిస్తారో ఆ రంగంలో ప్రవేశపెట్టాలి అని ఆ సినిమా చెబుతుంది. అది చూసిన కియరా తండ్రి ఆమెకు సినిమాల్లో వెళ్లమని పర్మిషన్‌ ఇచ్చాడు. అయితే నిర్ణయాలు తీసుకోవడంతో పని అయిపోదు. దానికి పని చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో అంటే ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. కియరా అద్వానీ తల్లి జెనివైవ్‌ జాఫ్రీ సల్మాన్‌ ఖాన్‌కు స్కూల్‌ ఫ్రెండ్‌. కియరా చిన్నప్పటి నుంచి సల్మాన్‌ ఖాన్‌కు తెలుసు. కియరా సినిమాల్లోకి వద్దామని నిశ్చయించుకున్నాక ఆమెను పేరు మార్చుకోమని సల్మాన్‌ ఖానే సలహా ఇచ్చాడు. ఎందుకంటే కియరా అసలు పేరు ఆలియా అద్వానీ. ఆలియా భట్‌ అప్పటికే సినిమాల్లో ప్రశేశిస్తూ ఉండటంతో కియరాను కొత్తపేరు పెట్టుకోమని చెప్పాడు. ఒక సినిమాలో ప్రియాంక చోప్రా పాత్రకు కియరా అనే పేరు ఉంటుంది. కియరా కూడా అదే పేరు పెట్టుకుని కియరా అద్వానీ అయ్యింది.

సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌ పరిచయం అవకాశాలు కల్పించగలవుగానీ సక్సెస్‌ను గ్యారంటీ చేయలేవు. కియరా అద్వానీ ‘ఫగ్లీ’ (2014) అనే కామెడీ సినిమాతో ఆరంగేట్రమ్‌ చేసింది. ఇంతటితో తాను సినిమాల్లో దూసుకెళతానని కలలు కంది కాని ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. సినిమా రంగంలో ఫ్లాప్‌ అనేది అన్నీ దారులను మూసివేసే తాళం కప్పలాంటిది. కియరా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అవార్డు ఫంక్షన్స్‌కు వెళితే చివర కూచోబెట్టేవారు. అవకాశాలు కోరితే ముఖం తిప్పుకునేవారు. తల్లిదండ్రులు ఆమెను చూచోబెట్టి ఒక్కమాట చెప్పారు. ‘అసలు నీ సినిమా రిలీజయ్యిందని మర్చిపో. తిరిగి మొదటి నుంచి మొదలెట్టు’ అని. ‘ఇందులో కొనసాగాలంటే మళ్లీ ప్రయత్నించాల్సిందే’ అన్నారు. కియరా ప్రయత్నించింది. ‘ఎం.ఎస్‌.ధోని’ సినిమాలో కియరాకు ధోని భార్య పాత్ర లభించింది. అయితే అది చిన్నది. ఆ తర్వాత ‘మెషీన్‌’ అనే సినిమాలో సోలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్‌ అయ్యింది.

సరిగ్గా అప్పుడు కరణ్‌ జొహర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది కియారాకు. ఆ సినిమాయే ‘లస్ట్‌ స్టోరీస్‌’. స్త్రీల లైంగికతను చర్చించే ఈ సినిమాలో కియారాది ఒక స్కూల్‌ టీచర్‌ పాత్ర. అందులో ఆమె ఒక సన్నివేశంలో వైబ్రేటర్‌ వాడినట్టుగా కనిపించాల్సి ఉంటుంది. అయినా కియరా ఆ పాత్ర చేసింది. కుటుంబం, నేపథ్యం, ఇన్‌హిబిషన్స్‌ ఇవన్నీ పక్కనపెట్టి కియరా నటించడం పాత్రను పాత్రలా చూడటం అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో తెలుగు నుంచి ‘భరత్‌ అనే నేను’ భారీ హిట్‌ కావడంతో కియరా ఇరుభుజాలకు రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆమె ఎగరడం మొదలుపెట్టింది. తెలుగులో భారీ హిట్‌ అయిన అర్జున్‌ రెడ్డి హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ అవుతున్నప్పుడు హీరోయిన్‌ పాత్రకు కియరాను దర్శకుడు సందీప్‌ రెడ్డి ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని రిలీజ్‌ అయ్యాక తేలింది.

అందులో షాహిద్‌ కపూర్‌ వంటి సీనియర్‌ నటుడికి సరిజోడుగా కియరా నటించగలిగింది. కబీర్‌ సింగ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలవడంతో కియరా టాప్‌ క్లాస్‌ హీరోయిన్‌గా అవతరించింది. ఆమె తాజా సినిమా ‘గుడ్‌ న్యూస్‌’ నూరు కోట్ల కలెక్షన్‌ను దాటింది. కియారా ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ పక్కన, యంగ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ పక్కన రెండు వేరు వేరు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకదానికి ‘కాంచన’ సిరీస్‌ ఆధారం. దర్శకుడు లారెన్స్‌. తెలుగు సినిమా వల్ల కూడా ఎదిగిన కియరా ఇప్పుడు తెలుగుకు అందనంత ఎత్తుకు చేరుకుంది. ఆమె తిరిగి తెలుగులో నటించాలనంటే అంత అందమైన పాత్ర, అంత బోల్డ్‌ కేరెక్టర్‌ ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సినిమా వస్తుందనే ఆశిద్దాం.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు