అవి నాకు కిక్ ఇవ్వలేదు...

19 Apr, 2014 22:24 IST|Sakshi

తమిళంలో లవర్ బోయ్...
 తెలుగులో పోలీస్‌మేన్...
 యువతుల మనసు దోచే పాత్రలు ఒకచోట...
 యువ హీరోలకు దీటైన పాత్రలు మరోచోట...
 శామ్ కెరీర్ ఇవాళ మూడు క్లాప్‌లు, ఆరు షాట్‌లతో ఓ ‘రేసుగుర్రం’...
 తమిళ, తెలుగు సినీ రంగాల్లో అభిమానులనూ, అభిమానించే అగ్ర దర్శకులనూ సంపాదించుకోవడం, బాక్సాఫీస్ విజయాలు అందుకోవడం ఏ నటుడికైనా ‘కిక్’ కాక మరేమిటి?
 శామ్‌కు... కాదు... కాదు...
 ‘కిక్’ శామ్‌కు తరగని ఆస్తి అదే.
 ఇంట్లో ఒప్పించి మరీ సినీ హీరో అయిన ఈ ఫుట్‌బాల్ ఆటగాడి మనసులోని మాటల కచ్చేరీలోని కిక్కే వేరప్పా!  

 
హాయ్.. నేను ‘కిక్’ శామ్‌ని. మీకు కిక్ ఇచ్చే విషయాలు చాలా చెప్పాలని ఉంది. ముందు నా గురించి చెబుతా. నా అసలు పేరు ‘షంషుద్దీన్ ఇబ్రహీం’. సినిమాల కోసం ‘శామ్’ అని మార్చేసుకున్నాను. తెలుగులో మాత్రం నేను చేసిన ‘కిక్’ నా ఇంటి పేరైపోయింది. తమిళ పరిశ్రమలో అందరూ నన్ను సున్నితమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటారు. అందుకని ‘చాక్లెట్ బాయ్’ అంటారు. ఇక్కడేమో జోష్‌గా ‘కిక్ శామ్’ అని అంటారు. నేనిప్పటివరకు తెలుగులో ఆరేడు సినిమాల్లో నటించా. వాటిలో ఎక్కువగా సీరియస్‌గా ఉండే పోలీసు పాత్రలే. తమిళంలోనేమో సరదా సరదాగా ఉండే పాత్రలు చేస్తుంటా. ఏమైనా పోలీసు పాత్రలకు విరామం తీసుకోవాలనుకుంటున్నా. చేసిన పాత్రలే చేస్తే కిక్కేముంటుంది!
 
అమ్మకు ఇష్టం లేదు!
 
మీకో విషయం చెప్పనా? అసలు నేను సినిమా నటుణ్ణి కావాలనుకుంటున్నానని మా ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద రాద్ధాంతమే చేశారు. మా అమ్మగారికి నేను సినిమాల్లోకి రావడం అస్సలిష్టం లేదు. నేను మంచి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరుకీ, స్పోర్ట్స్ క్లబ్స్‌కీ మా కాలేజ్ తరఫున ఆడేవాణ్ణి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ‘మా ఇంట్లో మంచి క్రీడాకారుడున్నాడు’ అని మా అమ్మ గర్వంగా చెప్పుకునేది. నా ధ్యాస మాత్రం సినిమాల మీదే. అమ్మని ఒప్పించారు నాన్నగారు. కానీ, నేను నటుణ్ణి కాకముందే ఆయన పోయారు. అది నా దురదృష్టం.
 
నాలుగేళ్లు తెగ తిరిగా!
 
సినిమాల్లో అవకాశాల కోసం కొన్నాళ్లు మోడల్‌గా చేసి, ఆ తర్వాత సినిమాలకు ప్రయత్నం చేయ సాగా. పరిశ్రమలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అంత సులువుగా అవకాశాలు రాలేదు. నాలుగైదేళ్లు తెగ తిరిగా. చివరకు తమిళ దర్శ కుడు జీవా గారి దృష్టిలో పడ్డాను. ‘12 బి’ ద్వారా ఆయన నన్ను హీరోను చేశారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కూడా ఆయన దర్శకత్వంలోనే ‘ఉళ్లమ్ కేక్కుదే’ సినిమా చేశాను. అదీ నా కెరీర్‌కు ఉపయోగపడింది. సినీ పరిశ్రమలో జీవా గారు నా గాడ్‌ఫాదర్. 2008లో ఆయన రష్యాలో గుండెపోటుతో చనిపోయారు. నాకైతే వెన్నెముక కోల్పోయినట్లనిపించింది.
 
లవర్‌బోయ్‌గానే చేయమంటున్నారు
 
కెరీర్‌పరంగా నాకెలాంటి అసంతృప్తీ లేదు. నాకు మహిళా అభిమానులెక్కువ. నేను గడ్డం, మీసాలతో కనిపిస్తే వాళ్లకు నచ్చడం లేదు. వాళ్ల ఇష్టాన్ని కాదనలేను. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా ఇంకా లవర్‌బోయ్‌గా చేయాలంటే నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకే అప్పుడప్పుడూ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాను. నేనిష్టపడే పాత్రలు చేయడం కోసం స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. ‘6’ సినిమా నిర్మించి, నటించాను. నాలుగైదు కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తీశాను. లాభం రాలేదు.. నష్టం కూడా తేలేదు. అయితే, ఆ సినిమాతో డబ్బు కన్నా పేరు బాగా వచ్చింది.
 
ఆనందంగా ఉన్నా!
 
తమిళంలో హీరోగా, తెలుగులో కీలక పాత్రలు చేస్తూ ఆనందంగా ఉన్నా. వాస్తవానికి ‘కిక్’ తర్వాత తెలుగులోసోలో హీరోగా చేసి ఉండ వచ్చు. కానీ, వచ్చిన అవకాశాలు అంత కిక్ ఇవ్వలేదు. అందుకే, కీలక పాత్రలకే పరిమితమయ్యా.

ప్రేమ వివాహం
 
నాది ప్రేమ వివాహం. నేను ముస్లిమ్. నా భార్య పంజాబీ హిందువు. పేరు - కామ్నా. ‘పంజాబీ అమ్మాయి కోడలుగా వస్తే, ఆమెతో ఏ భాషలో మాట్లాడాలిరా.. మన కుటుంబంతో తను సర్దుకు పోగలుగుతుందా? మన సంప్రదాయాలు వేరు, తనవి వేరు’ అని అమ్మ ససేమిరా అంది. కానీ, చివరకు ఒప్పించాను. ఇప్పుడు మా అమ్మ, నా భార్యతల్లీకూతుళ్లలా ఉంటున్నారు.

నాకో వెసులుబాటు ఏమిటంటే.. ఉత్తరాది వంటకాలు తినాలంటే మా ఆవిడ, దక్షిణాది వంటకాలంటే మా అమ్మ చేస్తారు. పెళ్లికి ముందే మేము ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోవడంతో పెళ్లి తర్వాత మా జీవితం సాఫీగా సాగుతోంది. ‘సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి కనబరచడు’ అనే నమ్మకం కామ్నాకి ఉంది. ఎలాంటి పరిస్థితిలోనూ చేయి వదలననే నమ్మకం ఆమెకు ఉంది.

వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ‘నమ్మకం’ అవసరం. మేమిద్దరం... మాకిద్దరు పిల్లలున్నారు. పెద్దమ్మాయి పేరు సమైరా. రెండో పాప పేరు కియారా. సమైరా ఒకటో తరగతి చదువుతోంది. కియారాకి రెండేళ్లు. అందరూ మారతారో లేదో నాకు తెలియదు కానీ,  తండ్రయిన తర్వాత నాలో చాలా మార్పొచ్చేసింది. నా భార్యకూ, కూతుళ్లకూ నేనే హీరోని. అందుకే సినిమాలు, కుటుంబం తప్ప నాకు వేరే ధ్యాస లేదు.
 
- గోల్డీ
 

మరిన్ని వార్తలు