నీలమాధవుడు

28 Jul, 2018 00:38 IST|Sakshi

చెట్టు నీడ

ఆదివాసీలుండే ఆ ప్రాంతంలో జటిలుడు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ తల్లికి అతడొక్కగానొక్క బిడ్డ. వాడికి నాలుగు అక్షఱం ముక్కలు చెప్పించాలన్న తపనతో ఆ తల్లి అతడిని రోజూ బడికి పంపించేది. బడికి వెళ్లాలంటే ఆ బుడతడు రోజూ సమీపంలోని చిట్టడివిగుండా ప్రయాణించాల్సిందే. ఒక్కణ్ణే రోజూ అంతదూరం నడిచి వెళ్లాలంటే తనకు భయంగా ఉంటోందని తల్లితో అన్నాడొక రోజు. అందుకు ఆ తల్లి ‘‘నువ్వు ఒంటరిగా ఏమీ వెళ్లడం లేదు. నీకు తోడుగా నీ అన్న నీలమాధవుడున్నాడు. నీకు భయం వేస్తే అతడిని పిలువు. తప్పక వస్తాడు’’ అని ధైర్యం చెప్పి, భగవంతుడిపై భారం వేసి, అతడిని బడికి పంపింది. తల్లిమాటపై నమ్మకం, అన్న ఉన్నాడనే ధీమా అతడిని రోజూ విడవకుండా బడికెళ్లేలా చేశాయి. ఒకరోజు బడిలో ఏదో ఆటల కార్యక్రమం ఉండడంతో అక్కడే బాగా ఆలస్యమైంది. దాంతో భయం భయంగానే ఇంటికి బయల్దేరాడు. అడవి మధ్యలోకి రాగానే ఆ జటిలుడికి భయం వేసింది. దాంతో ‘‘అన్నా! నీల మాధవా! ఎక్కడున్నావు, తొందరగా రా! నాకు భయంగా ఉంది’’ అని ఆర్తిగా పిలిచాడు. ఇంతలో నల్లగా, అందంగా ఉన్న ఓ పది పన్నెండేళ్ల కుర్రాడొకడు పరుగు పరుగున వచ్చాడక్కడికి.

‘‘తమ్ముడూ, నేనున్నాను. నీకేం భయం లేదు’’ అంటూ రకరకాల కబుర్లు చెబుతూ ఆ పిల్లాడి చెయ్యి పట్టుకుని అడవి దాటించాడు. ‘‘తమ్ముడూ, ఇక వెళ్తాను’’ అంటున్న ఆ నల్లపిల్లాడితో ‘‘అన్నా, నాకు భయంగా ఉంటోంది. రోజూ వస్తావా’’ అనడిగాడు. ‘‘ఓ! తప్పకుండా ’’ అంటూ చేతిలో చెయ్యేశాడతను. అప్పటినుంచి అడవిలోకి రాగానే ‘అన్నా’ అని ఇతడు పిలవడం, ‘ఇదుగో వస్తున్నాను తమ్ముడూ’ అంటూ అతగాడు వచ్చి మెడమీద, భుజాల మీద, ఒకోసారి నెత్తిమీద కూచోబెట్టుకుని ఇతన్ని అడవి దాటించడం.. ఇలా ప్రతిరోజూ జరిగింది.. ఆ పిల్లాడికి కాస్త మంచీ చెడూ తెలిసేదాకా.  తర్వాత్తర్వాత అడవికి వచ్చినా జటిలుడికి భయం వేసేదీ కాదూ, అన్నను పిలిచేవాడూ కాదు. నేను పిలిచినా అన్న వస్తాడో రాడో, అసలు తనకు అన్నంటూ ఉంటేగా రావడానికి అనే అనుమానం ఇతని మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పట్నుంచీ ఇతను పిలవడం, అన్న రావడం రెండూ జరగలేదు! అందుకే అన్నారు భయం అనేది నిజం. భక్తి అనేది నమ్మకం. భయం ఉంటేనే భక్తి కలుగుతుంది. మనసు స్వచ్ఛంగా ఉంటేనే భయభక్తులు ఉంటాయి. చిన్నారులు నవ్వినంత స్వచ్ఛంగా, అందంగా మనం నవ్వగలమా మరి! కల్లాకపటం తెలియని వయసులో ‘‘అన్నా... రావా! భయంగా ఉంది’ అని పిలిచినట్టు ఆ తర్వాత అతను పిలవగలిగాడా? 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు