పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే కిడ్నీకి ప్రమాదమా?

28 Aug, 2019 08:02 IST|Sakshi

నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. నాకు ఈ మధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? – ఎమ్‌. భూమయ్య, కరీంనగర్‌
డయాలసిస్‌ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్‌ లేదా  మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్‌ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి

నా వయసు 65 ఏళ్లు. చాలా ఏళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. ఆ నొప్పులు తట్టుకోలేక చాలాకాలం నుంచి నొప్పి నివారణ మందులు (పెయిన్‌ కిల్లర్స్‌) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?– డి. మాధవరావు, చీరాల
పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్‌ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్‌ షాప్‌ నుంచి పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్‌ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్‌ కిల్లర్స్‌ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో  నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి.

బాబు కళ్లూ,కాళ్లు ఉబ్బికనిపిస్తూఉన్నాయి...
మా అబ్బాయికి ఆరేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్‌ టెస్ట్‌లో ప్రోటీన్‌ 3 ప్లస్‌ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?– ఎమ్‌. సుభాష్, వరంగల్‌
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్‌ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్‌ కొలెస్ట్రాల్‌ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌లో సీరమ్‌ ఆల్బుమిన్‌ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్‌ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్‌ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్‌ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్‌ నియంత్రించుకోవాలి.డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్,కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా