గ్యాస్‌ ట్రబుల్‌ మందులతో కిడ్నీకి చేటు..

21 Feb, 2019 00:45 IST|Sakshi

కడుపు ఉబ్బరంగా ఉందనిపిస్తే చాలు.. చాలామంది ఒమీప్రొజోల్, మెటాప్రొలోల్‌ వంటి మందులు ఎడాపెడా వాడేస్తూంటారు. ప్రొటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటర్లు అని పిలిచే ఈ మందుల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ మ్యాగజైన్‌ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. పీపీఐ మందులతో పోలిస్తే హిస్టమైన్‌ –2 రకం మందులు తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు తక్కువ. అమెరికాలో అందుబాటులో ఉన్న కోటి మంది రోగుల వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు రూబెన్‌ అబగ్యాన్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు.

పీపీఐ మందులు మాత్రమే తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే ఇతరులతో పోలిస్తే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. కొంచెం స్పష్టంగా చెప్పాలంటే ఈ మందులు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పీపీఐ మందులు అత్యవసరమైనప్పటికీ వాటితో ఈ సమస్యలున్నాయని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని.. పైగా పీపీఐ పద్ధతిపై ఆధారపడని యాంటాసిడ్లు, హిస్టమైన్‌ –2 రకం మందులతో దుష్ఫలితాలు తక్కువన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు.  

మరిన్ని వార్తలు