లూపస్‌ వల్ల కిడ్నీపై దుష్ప్రభావం పడిందంటున్నారు

22 Apr, 2019 00:08 IST|Sakshi

రుమటాలజీ కౌన్సెలింగ్‌

నాకు గతంలో లూపస్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కొంతకాలం కిందట మూత్రపరీక్ష చేయించినప్పుడు లూపస్‌ కారణంగా నా కిడ్నీలపై దుష్ప్రభావం పడి, లూపస్‌ నెఫ్రైటిస్‌ వచ్చినట్లు చెప్పారు. దయచేసి ఈ వ్యాధి గురించి విపులంగా వివరించి, నాకు తగిన సలహా ఇవ్వగలరు. 

మన శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి అధిక రక్తపోటును నియంత్రించడం, తగినన్ని లవణాలనూ, ఖనిజాలనూ రక్తంలో నిర్వహితమయ్యేలా చూడటం, ఎర్రరక్తకణాలను తయారు చేయడం, ఎముకకు బలాన్ని చేకూర్చడం వంటి అత్యంత కీలకమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. అంతేకాదు... రక్తంలోని విషపూరితమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తాయి. మూత్రపిండాల సాధారణ వడపోత కార్యకలాపాలలో ఎర్రరక్తకణాలుగానీ, ప్రోటీన్లు గానీ బయటకు పోవు. అయితే ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు దెబ్బతింటే ఎర్రరక్తకణాలూ, ప్రోటీన్లు బయటకు పోతూ, హానికరమైన విషపదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా పేర్కొనవలసింది ‘లూపస్‌ నెఫ్రైటిస్‌’ 

లూపస్‌ నెఫ్రైటిస్‌ లక్షణాలు 
అదుపు తప్పిన రోగనిరోధక శక్తి ప్రభావం కిడ్నీల మీద పడినప్పుడు ‘లూపస్‌ నెఫ్రైటిస్‌’ వ్యాధి వస్తుంది. లూపస్‌ లక్షణాలు మొదలైన రెండు లేదా మూడేళ్ల తర్వాత కిడ్నీపై దాని దుష్ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు లూపస్‌ ప్రారంభదశలోనే నేరుగా కిడ్నీపై ప్రభావం పడవచ్చు కూడా. ఈ వ్యాధి ప్రారంభదశలో పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. తరచూ కాళ్ల వాపు, ముఖంలో వాపు, కనురెప్పలు బరువుగా ఉండటం, మూత్రంలో అధికంగా నురుగు కనిపించడం, కొన్నిసార్లు మూత్రంలో ఎరుపు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటేలూపస్‌ ఉన్న వ్యక్తుల్లో 60 శాతం మందిలోనూ, చిన్నపిల్లల్లో దాదాపు మూడింట రెండు వంతుల మందిలో దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. దీని తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ. 

గుర్తించడం ఎలా
సాధ్యమైనంత వరకు తొలిదశలోనే గుర్తించడం వల్ల రోగికి ఎంతో మేలు చేకూరేందుకు అవకాశం ఉంది. దీని లక్షణాలు నిర్దుష్టంగా పైకి కనిపించవు కాబట్టి ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌) వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే తరచూ మూత్రపరీక్ష చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ప్రోటీన్లు, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూత్రపిండాల బయాప్సీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధి ఏ స్థాయిలో ఉందన్న విషయం బయాప్సీ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైన చికిత్సను రుమటాలజిస్టులు సూచిస్తారు. 

లూపస్‌ నెఫ్రైటిస్‌ వల్ల కలిగే నష్టాలు
లూపస్‌ నెఫ్రైటిస్‌ రెండు కిడ్నీల మీద కూడా సమానంగా ప్రభావం చూపుతుంది. ఎంత మెరుగైన చికిత్స తీసుకున్నప్పటికీ దాదాపు 10 నుంచి 20 శాతం మందిలో కిడ్నీల పై ఒక పొర ఏర్పడి, కిడ్నీలు శాశ్వతంగా పాడైపోతాయి. దాంతో ఒంట్లో నీరు పేరుకుపోవడం, రక్తహీనత, అధికరక్తపోటు వంటి అనర్థాలు ఏర్పడతాయి. అలాంటివారికి దీర్ఘకాలికంగా డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం. అంతేకాదు... ఈ జబ్బు ఉన్నవారు తేలిగ్గా అంటువ్యాధులకు గురవుతుంటారు. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే లూపస్‌ వ్యాధి నిర్ధారణ జరగగానే వెంటనే రుమటాలజిస్టుల పర్యవేక్షణలో కిడ్నీలపై ఆ వ్యాధి ప్రభావాన్ని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. 

చికిత్స విధానాలు 
ఎస్‌ఎల్‌ఈకి శాశ్వతమైన చికిత్స అందుబాటులో లేదు. అయితే జబ్బు ప్రభావం కిడ్నీ మీద పడుతున్నప్పుడు సరైన సమయంలో మందులు మొదలుపెట్టాలి. దానివల్ల సమస్య ముదరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీనికోసం ఇమ్యూనోసప్రసెంట్స్‌ మందులను వాడాల్సి ఉంటుంది. ఇవి అదుపుతప్పిన రక్షణ వ్యవస్థను సరైన దారిలో పెట్టి కిడ్నీ ఫెయిల్‌ కాకుండా కాపాడతాయి. 

కీళ్లవాతానికి మందులు వాడినా ప్రయోజనం లేదు... 

 నా వయసు 45 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా బాధ చాలా తీవ్రంగా ఉంది. నొప్పులు భరించలేకుండా ఉన్నాను. ఈ సమస్యకు మంచి పరిష్కారాలు  ఏవైనా ఉంటే వివరంగా చెప్పండి. 

కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని నిర్లక్ష్యం చేసి, వ్యాధిని  ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, పూతమందుల వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి.

కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది.  
ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్‌ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్‌’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్‌), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్‌ వాడటం తప్పనిసరి.

వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్‌ఆర్‌డీఎస్‌’ (డిసీజ్‌ మాడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌) మందులను సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్‌కి వాడేలాంటివనే అపోహ  ఉంది. దాంతో బాధ తీవ్రంగా ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. 

బయోలజిక్స్‌ గురించి...
సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్‌ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, లూపస్, స్క్లీరోడెర్మా, యాంకైలోజింగ్‌ స్పాండిలోసిస్‌ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులలో ఈ బయోలజిక్స్‌ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. 
ఇక మధ్యలోనే చికిత్స మానేసిన రోగుల్లో... వ్యాధి ముదరడం వల్ల బాధల తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్‌ మాలెక్యూల్స్, స్టెమ్‌సెల్‌ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని  బేరీజు వేసుకొని, సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. 

డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి
సీనియర్‌ కన్సల్టెంట్‌ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌. 

మరిన్ని వార్తలు